Group 2 | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు స్టే నేపథ్యంలో ఇప్పుడు ఓ కొత్త చిక్కువచ్చిపడింది. గ్రూప్-1 పోస్టులతోపాటు గ్రూప్-2తోపాటు, గ్రూప్-3 పోస్టుల భర్తీపైనా ఈ ఎఫెక్ట్ పడేలా కనిపిస్తున్నది. ఈ స్టేను ఎత్తివేసేందుకు ఇటీవల కోర్టు నిరాకరించింది. జూన్ 11కు కేసు విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకు స్టే ఉండటంతో గ్రూప్-1 పో స్టుల భర్తీ నిలిచిపోయినట్టే. దీంతో పరోక్షంగా గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల భర్తీ కూడా ఆగిపోయినట్టే. ఎందుకంటే, గ్రూప్-1 అంశం ఏదో ఒకటి తేలితేనే గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల భర్తీ ఓ కొలిక్కిరానున్నది.
చిక్కుముడి ఇక్కడే..
ఉద్యోగాల భర్తీలో పోస్టులను ఆరోహణ (ఎగువ నుంచి దిగువకు) క్రమంలో భర్తీచేస్తామని టీజీపీఎస్సీ పలుమార్లు ప్రకటించింది. పెద్ద హోదా గల ఉద్యోగాలను ముందు భర్తీచేసి, ఆ తర్వాత చిన్న క్యాడర్ ఉద్యోగాలను వరుస క్రమంలో భర్తీచేయడం ఈ విధానం ప్రత్యేకత. పోస్టులు బ్యాగ్‌లాగ్ కాకుండా ఉండేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తామని కమిషన్ తెలిపింది. వాస్తవానికి పోస్టుల భర్తీలో అవరోహణ క్రమాన్ని (మొదట కింది క్యాడర్ పోస్టులను నింపి, ఆ తర్వాత పై క్యాడర్ పోస్టులను భర్తీచేయడం) పాటిస్తే.. కింది క్యాడర్లో పోస్టులు బ్యాక్లాగ్ అవుతున్నాయి. సాధారణంగా మెరిట్ అభ్యర్థులే అక్కడా, ఇక్కడా టాపర్లుగా ఉంటున్నారు. ఉదాహరణకు గ్రూప్-3 ఉద్యోగాలను మొదట నింపి, ఆ తర్వాత గ్రూప్-2 పోస్టులను నింపితే.. గ్రూప్-3 పోస్టులు బ్యాక్‌ల్యాగ్ అవుతాయి. దీంతో ఆరోహణ క్రమంలో మొదట గ్రూప్-1, ఆ తర్వాత గ్రూ ప్-2, చివరగా గ్రూప్-3 పోస్టులను భర్తీచేయాలన్న ఆలోచనలో టీజీపీఎస్సీ ఉన్నది. గ్రూప్-1పై హైకోర్టులో విచారణ సమయంలో టీజీపీఎస్సీ కూడా ఇదే వాదనలు వినిపించింది. గ్రూప్-1 ప్రక్రియ ఆగిపోతే దాని ప్రభావం గ్రూప్-2, గ్రూప్-3పై పడుతుందని, కాబట్టి ఏదో ఒకటి తేల్చాలని కోర్టును అభ్యర్థించింది. కానీ, కోర్టు ఈ వాదనలను తిరస్కరించింది.
మరికొంతకాలం ఆగాల్సిందే..
కోర్టులో ఉన్న ఈ వ్యవహారం ఇప్పట్లో ముగుస్తుందా? అంటే అనుమానంగానే ఉన్నది. ఎవరికి అనుకూలంగా తీర్పువచ్చినా మరో పిటిషనర్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించే అవకాశముంది. తీర్పు వ్యతిరేకంగా వచ్చిన పిటిషనర్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లే అవకాశాలు లేకపోలేదు. తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఇప్పటికే నిరుద్యోగ జేఏసీ నేతలు అంటున్నారు. మొత్తానికి మూణ్నాలుగు నెలల సమయం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే గ్రూప్-2, గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ లిస్టు (జీఆర్ఎల్) కూడా విడుదలైంది. జీఆర్ఎల్ ఆధారంగా పోస్టులు, రోస్టర్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించాల్సి ఉంది. మొత్తంగా గ్రూప్-1 పోస్టుల భర్తీ ప్రక్రియ ఓ కొలిక్కి వస్తేనే.. ఈ రెండు ముందుకుసాగే అవకాశాలు ఉండటంతో గ్రూప్-2, గ్రూప్-3 టాపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.