హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలోని గురుకుల విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి రంగాలకు సంబంధించి నైపు ణ్య శిక్షణ ఇవ్వనున్నారు. ఎస్‌జీబీఎస్ ఉన్నతి ఫౌండేషన్‌తో ఎస్సీ గురుకుల సొసైటీ ఒప్పందం కుదుర్చుకున్నది. సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి ఆదివా రం ప్రకటనలో వెల్లడించారు. పది, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న గురుకుల విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు.
ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో ‘యూ ఎన్ ఎక్స్ టీ’ సంస్థ ఆధ్వర్యంలో 90 గంటలు తరగతి గదిలో ప్రత్యక్షంగా, 75 గంటలు సెల్ఫ్ లెర్నింగ్ విధానంలో శిక్షణ ఉంటుందని వివరించారు. స్పోకెన్ ఇంగ్లిష్, లైఫ్ సిల్స్, జీవన నైపుణ్యాలు, హెచ్ఆర్ సంబంధిత విషయాల్లో సిల్స్, ఇంటర్వ్యూ అంశాలపై శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. జూన్ మూడో వారం నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 238 గురుకుల కేంద్రాల్లో ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. ప్రతీఏటా 36 వేల మంది విద్యార్థులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.