CUET PG exam | కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) తేదీలు ఖరారయ్యాయి. ఈ పరీక్షలు 2023 జూన్ 1 నుంచి 10 రోజుల పాటు జరుగనున్నాయి. ఈ పరీక్ష తేదీలను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ ఎం జగదీష్ కుమార్ గురువారం ప్రకటించారు. దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఎంట్రెన్స్ టెస్ట్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు.
సెంట్రల్ యూనివర్శిటీల్లో పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం కామన్ యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియ 2023 మార్చి నెల రెండో వారం నుంచి ప్రారంభమవుతుంది. కాగా, ఫలితాలను జూలై 1 న ప్రకటించేందుకు అధికారులు ప్లాన్ చేశారు. సెంట్రల్ కామన్ యూనివర్శిటీ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నది. అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన సమాచారం కోసం అధికారిక వెబ్సైట్లో సంప్రదించాలి.
అస్సామీ, బెంగాలీ, ఇంగ్లిష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 1,000 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. 450-500 పరీక్షా కేంద్రాలను నిత్యం వాడేలా చర్యలు తీసుకుంటున్నారు. కాగా, తదుపరి సెషన్ నుంచి మరిన్ని ప్రైవేట్, ప్రభుత్వ, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ఈ ప్రవేశ పరీక్షలో పాల్గొంటాయని యూజీసీ విశ్వసిస్తున్నది.