BRS | కురవి: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై సీరోలులో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రెడ్యానాయక్ మాట్లాడుతూ.. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ఎలా దోచుకోవాలి? ఎలా దాచుకోవాలనే వాటిపైనే దృష్టి సారించారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు, హామీల అమలుపై ప్రజలకు వాస్తవ పరిస్థితిని వివరించేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు అన్ని గ్రామాల్లో బాకీ కార్డులను పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయో ప్రజలకు వివరించాలని సూచించారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాకముందు రూ. 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి, మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయకపోవడంతో పాటు డీఏలు కూడా ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రంలో ప్రతి పనికీ 10 నుంచి 15 శాతం వరకు లంచాలు తీసుకుని పనులు చేస్తున్నారని ఆరోపించారు.
డోర్నకల్ ఎమ్మెల్యేను ఉద్దేశించి తాను సీరోలు ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ‘పాడి గేదె’ లాంటి వాడినని, ప్రజలు మాత్రం ‘దున్నపోతు’ లాంటి వ్యక్తికి ఓటు వేసి గెలిపించారని వ్యాఖ్యానించారు. ప్రజలు పాలన, అభివృద్ధి, హామీల అమలును పరిశీలించి భవిష్యత్‌లో నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంపల్లి సొసైటీ మాజీ చైర్పర్సన్ కొండపల్లి శ్రీదేవి, కురవి మాజీ వైస్ ఎంపీపీ దొంగలి నర్సయ్య, నాయకులు బోజ్యానాయక్, పెద్ద వెంకన్న, మామిండ్ల వెంకన్న, జైపాల్‌రెడ్డి, మోహన్‌నాయక్, నరహరి, అనిల్ పాల్గొన్నారు.