బుధవారం 28 అక్టోబర్ 2020
Nipuna-education - Aug 12, 2020 , 00:06:26

సివిల్స్‌ విజేతలు

సివిల్స్‌ విజేతలు

సివిల్స్‌... జాతీయస్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పరీక్ష. దీనిలో విజేతలు దేశంలోని అత్యున్నత  ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ తదితర 24 రకాల సర్వీసులకు ఎంపికవుతారు. సైన్స్‌, ఆర్ట్స్‌, లా, డాక్టర్లు, సీఏలు ఇలా దాదాపు అన్ని రంగాలకు చెందినవారు దీనికోసం ప్రయత్నిస్తారు. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు జరిగిన ఘటనతోనో, ఆయా సందర్భాల్లో ఉన్నత సేవలు అందించి ఆదర్శంగా నిలిచిన అధికారులను చూసి ఇన్‌స్పైర్‌ అయ్యో, సమాజ సేవ చేయాలనో  సివిల్స్‌  రాస్తారు ఎక్కువమంది. సివిల్స్‌లో రాణించడానికి కుటుంబ నేపథ్యం, ఆర్థిక స్తోమత అవసరం లేదు. అంతేకాదు ఏ సబ్జెక్టు అనేది కూడా సమస్యే కాదు. గతంలో అనేకమంది ఈ విషయాలను నిరూపించారు. మరోసారి 2019 సివిల్స్‌ తుది ఫలితాల్లో ఇదే విషయం స్పష్టమైంది. భవిష్యత్‌లో సివిల్స్‌ రాసేవారికి విజేతల అనుభవాలు పాఠాలుగా ఉపయోగపడుతాయి. వారు అనుసరించిన వ్యూహాలు, చదివిన పుస్తకాలు, ఇంటర్వ్యూ విశేషాలు నమస్తేతో పంచుకున్న విషయాలు నిపుణ పాఠకుల కోసం 

తెలంగాణ నుంచి దాదా పు 20 మంది సర్వీస్‌ సాధించారు. వీరిలో టాపర్‌గా ధాత్రిరెడ్డి (46) నిలిచారు. ఈసారి ఎక్కువమంది ఇంజినీరింగ్‌ బ్యాగ్రౌండ్‌ నుంచి వచ్చి సివిల్స్‌ ఒక మంచి ప్లాట్‌ఫాం అని మరోసారి నిరూపించారు. అంతేకాదు దిగువ మధ్యతరగతి నుంచి వచ్చి, సాధారణ పాఠశాలలో చదివినా సివిల్స్‌ సాధించవచ్చని రుజువుచేశారు. అంతేకాదు ఈసారి ఎక్కువమంది అభ్యర్థులు కోచింగ్‌ పోకుండానే తక్కువ ప్రయత్నాల్లో విజయం సాధించినవారు కావడం మరో విశేషం. 

 • సివిల్స్‌-2019 ఫలితాల్లో మొదటి ర్యాంక్‌ను ప్రదీప్‌ సింగ్‌ సాధించాడు. హర్యానాలోని సోనిపట్‌కు దగ్గరలోని తెవ్రి గ్రామం ఇతనిది. తండ్రి గ్రామ సర్పంచ్‌. గతేడాది ఐఆర్‌ఎస్‌ సాధించి శిక్షణలో ఉన్న ప్రదీప్‌ ఈసారి సివిల్స్‌ రాసి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 
 • రెండోర్యాంక్‌ను న్యూఢిల్లీకి చెందిన జతిన్‌ కిశోర్‌ సాధించాడు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. 2018లో ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ సాధించి ప్రస్తుతం అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. రెండో ప్రయత్నంలో రెండోర్యాంక్‌ సాధిండం విశేషం.
 • మహిళల్లో ప్రథమస్థానం. ఓవరాల్‌గా మూడోర్యాంక్‌ను సాధించింది ప్రతిభ వర్మ. ఉత్తరప్రదేశ్‌ సుల్తాన్‌పూర్‌కు చెందిన ప్రతిభ ఐఐటీ ఢిల్లీలో ఇంజినీరింగ్‌ చదివింది. ఇప్పటికే ఐఆర్‌ఎస్‌గా పనిచేస్తుంది. మూడో ప్రయత్నంలో మూడోర్యాంక్‌ సాధించింది.                          
 • మొత్తం 927 పోస్టులకు గాను 829 మంది ఫలితాలను ప్రకటించింది. వీటిలో 304 మంది జనరల్‌ కేటగిరీ, 78 ఈడబ్ల్యూఎస్‌, 251 మంది ఓబీసీ, 129 ఎస్సీ, 67 మంది ఎస్టీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఉన్నారు. మొత్తం పోస్టుల్లో 180 మంది ఐఏఎస్‌, 24 ఐఎఫ్‌ఎస్‌, 150 ఐపీఎస్‌, 438 సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ ఏ, 135 గ్రూప్‌ బీ పోస్టులు ఉన్నాయి. మొత్తం ఫలితాల్లో 66 మందిని ప్రొవిజినల్‌ కింద, 11 మంది విత్‌హెల్డ్‌లో ఉంచారు. 
 • ఈసారి టాప్‌ టెన్‌లో తెలుగువారు లేకపోవడం రెండు తెలుగు రాష్ర్టాలకు లోటుగా కన్పిస్తుంది.
 • ఈసారి మంచిర్యాంకులు సాధించినా గతంతో పోలిస్తే కొంత తగ్గిందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

...? కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

పాలిటెక్నిక్‌ నుంచి పాలన వైపు

ప్రేమ్‌సాగర్‌ (170వ ర్యాంక్‌)

కుటుంబ నేపథ్యం: తండ్రి నవీన్‌ రెడ్డి టీవీ మెకానిక్‌. తల్లి అనితారెడ్డి గృహిణి. చెల్లి సాహితీరెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుంది. 

రెండో ప్రయత్నంలో సాధించా

టీవీ మెకానిక్‌ షాప్‌ నడవకపోవడంతో హుస్నాబాద్‌కు వచ్చాం. 4వ తరగతి వరకు వల్మిడిలో చదువుకున్నా. తర్వాత హుస్నాబాద్‌లో 10వ తరగతి వరకు చదివాను. వరంగల్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఈసీఈ చదివాను. తర్వాత ఈసెట్‌ ద్వారా బీటెక్‌ రెండో సంవత్సరంలో చేరాను. కానీ ఫీజుకు ఇబ్బంది ఏర్పడింది. ఈ సమయంలో మురళీమోహన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సహాయం చేసింది. 2012లో ఇంజినీరింగ్‌ పూర్తిచేశాను. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా ఐదేండ్లు పనిచేశాను. ఈ సమయంలోనే ఆర్థికంగానే కాదు సొసైటీకి ఏదైనా చేస్తేనే జీవిత సంతృప్తి అని భావించాను. దీంతో సివిల్స్‌ సాధించాలని నిర్ణయించుకున్నాను. ప్రిపరేషన్‌ ప్రారంభించగా మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాను. కానీ నిరాశపడకుండా చదువుతూ రెండో ప్రయత్నంలో 170వ ర్యాంక్‌ సాధించాను. 

పొలిటికల్‌ సైన్స్‌ ఆప్షనల్‌

సివిల్స్‌ ప్రిపరేషన్‌లో పొలిటికల్‌ సైన్స్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ ఆప్షనల్‌గా తీసుకున్నాను. ఆప్షనల్‌ కొత్త కాబట్టి బాలలత మేడం దగ్గర రెండునెలలు కోచింగ్‌ తీసుకున్నాను. 

ప్రిలిమ్స్‌ వ్యూహం

 • ఇన్‌సైట్‌ టెస్ట్‌ సిరీస్‌ ఫాలో అయ్యాను. 
 • 6-12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ బుక్స్‌ చదివాను. బుక్స్‌ చదువుతూ టెస్టులు రాయడంవల్ల అవగాహన పెరిగింది. అయితే కొన్ని కాన్సెప్ట్‌లకు క్లారిటీ లేదు. వాటిని యూట్యూబ్‌లో విన్నాను. ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌ గురించి బీబీసీ  న్యూస్‌ యాప్‌ చూసేవాడిని. దీనిలో 1 మినిట్‌ న్యూస్‌ చెప్తారు. నాలుగు గంటలకు ఒకసారి చూసేవాడిని. ప్రాక్టీస్‌పైనే ఎక్కువ ఆధారపడ్డాను. యూపీఎస్సీ సిలబస్‌, పాతప్రశ్నత్రాలు ప్రతిరోజు చూసేవాడిని. దీనివల్ల యూపీఎస్సీ ఏం ఆశిస్తుందనేది అర్థమవుతుంది. టెస్ట్‌ సిరీస్‌లను అనాలసిస్‌ చేస్తూ... ప్రతి తప్పును విశ్లేషించకోడానికి కనీసం ఐదారుగంటల సమయాన్ని కేటాయించేవాడిని. టెస్ట్‌లు రాయడంతోపాటు దాన్ని విశ్లేషించుకోవడం కూడా చాలా ముఖ్యం.
 • 100 శాతం సమయాన్ని ఒక సబ్జెక్టుకు కేటాయిస్తే 70 శాతం టెస్టులు. 30 శాతం చదువు ఉండాలి.

ప్రిలిమ్స్‌ ఫార్ములా: తక్కువ చదవడం+ ఎక్కువ రివిజన్‌ చేయడం+ ప్రాక్టీస్‌ చేయడం చేయాలి.

 • సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ చాలా ముఖ్యం. ప్రిలిమ్స్‌లో తప్పు చేసినా కాన్ఫిడెన్స్‌గా ఆన్సరింగ్‌ చేయాలి. జవాబులు గుర్తించేటప్పుడు విశ్వాసంగా ఉండాలి. దీనికి టెస్ట్‌లే కీలకం. ప్రిలిమ్స్‌కు ముందు 40 టెస్ట్‌లు చేశాను. దీనివల్ల టైం మేనేజ్‌మెంట్‌, కాన్ఫిడెన్స్‌, ఎటువంటి ప్రశ్న ఇచ్చినా సమాధానం గుర్తించే శక్తి వస్తుంది.
 • ఎన్ని టెస్ట్‌ సిరీస్‌లు చేసినా యూపీఎస్సీ స్థాయిలో ఉండవు. ఇందుకు ప్రిలిమ్స్‌ కోసం 15 రోజుల ముందు గత ఐదేండ్ల పేపర్లు సాల్వ్‌ చేయాలి. 

మెయిన్స్‌ వ్యూహం

 • నాలుగు జీఎస్‌ పేపర్లు ఉంటాయి. రెండు ఆప్షనల్‌ ఉంటాయి. మొదట ఎక్కువ స్కోర్‌ చేసే పేపర్‌ జీఎస్‌-4 ఎథిక్‌ పేపర్‌ తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు వస్తాయి. 20-30 రోజుల్లో  చదివి 250కి 120 తెచ్చుకోవచ్చు.
 • ఆప్షనల్స్‌ రెండు పేపర్లు తప్పనిసరి. ఇక జీఎస్‌-3 ఎకానమీ పేపర్‌. దీనికోసం రెగ్యులర్‌గా న్యూస్‌ పేపర్‌ చదివితే చాలు. దీనికి ఎక్కువ సమయం పట్టదు. పై వాటిపై ఎక్కువ దృష్టిపెడితే 60 శాతం మార్కులు సులభంగా రెండు నెలల సమయంలోనే పూర్తి చేయవచ్చు. అన్నింటిపై ఈక్వల్‌ సమయం కేటాయించవద్దు. ఈజీ, డిఫికల్ట్‌ ఆధారంగా సమయం కేటాయించడం మంచిది. 
 • మెయిన్స్‌కు ముఖ్యమైనవి.. ప్రాక్టీస్‌ టెస్ట్‌లు, రోజు రాయడం ప్రాక్టీస్‌. ఎందుకంటే మెయిన్స్‌ డిస్ట్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ప్రిలిమ్స్‌ మెయిన్స్‌ మధ్య మూడునెలలు. మొదటి రెండునెలల 15 రోజులు టెస్ట్‌లు రాశాను. దీనికి కారణం 3 గంటల్లో 20 ప్రశ్నలకు ఆన్సర్స్‌ రాయాలి. ఒక్క ప్రశ్నకు 9 నిమిషాలు. కనీసం 150 పదాల్లో సమాధానం రాయాలి. 
 • టైం మేనేజ్‌మెంట్‌ చాలా కీలకం. దీనికి బాగా ప్రాక్టీస్‌ చేయాలి. మరో ముఖ్యవిషయం మెయిన్స్‌లో ఇచ్చే 20 ప్రశ్నల్లో 10 మాత్రమే వస్తాయి. 10 చాలామందికి తెలియవు. కానీ వాటిని ఎలా మేనేజ్‌ చేస్తామనే బట్టి మన విజయం ఆధారపడి ఉంటుంది. ఆయా పది ప్రశ్నలకు సంబంధించి కేవలం కొంత సమాచారం మాత్రమే ఉంటుంది. కానీ దాని నుంచి 150 పదాలను అర్థవంతంగా జవాబు రాయడమనే స్కిల్‌ ఉంటే తప్పక విజయం సాధించవచ్చు.    

భాష అడ్డం కాదు

 • తెలుగు మీడియంలో విజయం సాధించవచ్చా.. అనేది చాలామందికి అనుమానం ఉంటుంది. నిజానికి లాంగ్వేజ్‌ అడ్డంకి కాదు. తెలుగులో అన్ని మెటీరియల్స్‌ దొరకుతున్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్క అభ్యర్థి గుర్తుంచుకోవాల్సిన విషయం మామూలు స్కూల్స్‌ చదివినా సివిల్స్‌ సాధించవచ్చు. భయపడకుండా ప్రిపరేషన్‌ ప్రారంభిస్తే విజయం సులభం.

భవిష్యత్‌ విద్యార్థులకు

 • ప్రిలిమ్స్‌+ మెయిన్స్‌ కోసం 2018 జనవరి నుంచి ఇంటిగ్రేటెడ్‌ ప్రిపరేషన్‌ కొనసాగించా, కొంత కాన్ఫిడెన్స్‌ రాగానే ప్రతిరోజు 2-3 ప్రశ్నలకు జవాబులు రాయడం ప్రాక్టీస్‌ చేయాలి. ఆ తర్వాత ప్రిలిమ్స్‌ ముందు కనీసం రెండుమూడు నెలలైనా ఎక్స్‌క్లూజివ్‌గా చదవాలి. ప్రిలిమ్స్‌ కాగానే ప్రిపరేషన్‌లో ఎలాంటి గ్యాప్‌ ఇవ్వద్దు. మూడునెలల కాలం చాలా విలువైంది. మూడునెలల్లో ఎన్నిటెస్ట్‌లు రాస్తే అంత మంచిది.  రాయడం అనేది ప్రాక్టీస్‌ చేయాలి. 

ఇంటర్వ్యూ విశేషాలు..

 • మనోజ్‌ సోని బోర్డు ఇంటర్వ్యూ చేసింది. దాదాపు 35 నిమిషాలు పాటు ఇంటర్వ్యూ చేశారు.
 • కేస్‌ స్టడీస్‌ ప్రకారం ప్రశ్నలు అడిగారు. ఉదా: వరంగల్‌ కలెక్టర్‌ అయితే నీవు ఏం చేస్తావు? ప్రమోషన్‌ రాకుంటే ఏం చేస్తావు? లేటెస్ట్‌ డిజాస్టర్‌ లింక్‌తో ప్రశ్నలు అడిగారు. 
 • టీఎస్‌ ఏర్పడ్డాక కామన్‌ మ్యాన్‌ ఎలా ఫీల్‌ అవుతున్నాడు?  డిస్‌ అడ్వాంటేజెస్‌ ఏమిటి? వీటితోపాటు హాబీపై ప్రశ్నలు అడిగారు. ఇస్రో గురించి అడిగారు. ఎక్కువ ప్రశ్నలు కేస్‌ స్టడీస్‌పై అడిగారు. 

డెడికేషన్‌ ఉండాలి

 • భయం ఉండవద్దు. బాగా తెలివైన వారు కానవవసరం లేదు. ఎవరైనా సివిల్స్‌ సాధించవచ్చు. డెడికేషన్‌ ఉంటే చాలు. ఇంగ్లిష్‌ కూడా పెద్దగా అవసరం లేదు. చుట్టూ ఏం జరుగుతుంది అనేది నిత్యం గమనిస్తూ ఉండాలి.
 • దీనికి న్యూస్‌ పేపర్‌ చదవాలి. ఇంట్రెస్ట్‌ ఉంటే వెనక్కి తిరిగి చూడవద్దు. ఇది లాంగ్‌ జర్నీ. ప్రతిరోజు ఓపిక/పేషెన్సీతో ప్రిపరేషన్‌ సాగించాలి. కోచింగ్‌ అనేది అవసరం లేదు. కరోనా మహమ్మారి అయినా దీన్ని అవకాశంగా మార్చుకోండి. క్రైసిస్‌ను అవకాశంగా వాడుకోవాలి. మెటీరియల్‌ మొత్తం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.  సందేహాల నివృత్తి కోసం సీనియర్స్‌, మెంటార్స్‌ను ఉపయోగించుకోవాలి. ఢిల్లీ కోచింగ్‌ అనే అపోహ తీసివేయాలి. ఇంట్లోనుంచైనా సివిల్స్‌ సాధించవచ్చు. డిగ్రీ తర్వాత ప్రిపరేషన్‌ అనేది ముఖ్యం. దీనికోసం ఇంటర్‌, డిగ్రీ నుంచి చదవడం ముఖ్యం కాదు. సివిల్స్‌ వైపు రావాలంటే న్యూస్‌ చదవడం, వినడం అలవాటు చేసుకోవాలి.

ఉపయోగపడే సైట్లు 

 • ఇన్‌సైట్స్‌ ఆన్‌ ఇండియా.కామ్‌ దీనిలో సివిల్స్‌కు సంబంధించి డిస్కషన్స్‌ ఉంటాయి. 
 • ఆలిండియా రేడియో- న్యూస్‌ రాత్రి 9 గంటల వార్తలు.
 • యూట్యూబ్‌లో మంచి చానల్స్‌ చాలా ఉన్నాయి. వాటిని అప్పుడుప్పుడు చూడండి.
 • ఎన్‌సీఈఆర్‌టీ కోసం.. ఫ్రీ యూపీఎస్సీ.కామ్‌- అన్ని ఇన్‌స్టిట్యూట్‌లకు సంబంధించిన టెస్ట్‌ సిరీస్‌లను, బుక్స్‌ను దీనిలో ఉంచుతారు. ఫ్రీగా వీటిని డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రాక్టీస్‌ చేయాలి. వీటితోపాటు 6-12 ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ తప్పనిసరిగా చదవాలి.

కమిట్‌మెంట్‌తో సాధించా

మంద మకరంద్‌ (110వ ర్యాంకు) 

ఐఐటీ బాంబేలో ఇంజినీరింగ్‌. ఎంఎన్‌సీలో ఆకర్షణీయమైన జీతంతో ఉద్యోగం. కానీ ఏదో వెలితి. ఏదో కోల్పోయానన్న బాధతో తన ఆరాటానికి సరైన వేదిక సివిల్స్‌ అని భావించి ఇటువైపు ప్రయత్నించాడు. కమిట్‌మెంట్‌ ఉంటే చాలు తక్కువ ప్రయత్నాల్లోనే సాధించవచ్చని 110వ ర్యాంక్‌ సాధించి నిరూపించాడు మకరంద్‌. ఆయన నమస్తే తెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు. 

విద్యాభ్యాసం గురించి చెప్పండి? 

చిన్నప్పుడే అంటే రెండున్నరేండ్ల ప్రాయంలో బాల మేధావిగా పేరుపొందాను. 1 నుంచి 2వ తరగతి వరకు సిరిసిల్ల పట్టణంలోని కాకతీయ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో, 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సిద్దిపేట పట్టణంలోని సాయిగ్రేస్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో, 9 నుంచి 10వ తరగతి వరకు కేకేఆర్‌ గౌతమ్‌ స్కూల్‌ గుడివాడలో, ఇంటర్‌ శ్రీచైతన్య కళాశాల విజయవాడలో, ఎంసెట్‌లో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు, ఐఐటీలో ఆలిండియా 11వ ర్యాంకు, బాంబే ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చదివాను. 

 • గోల్డ్‌మన్‌శాక్స్‌ కంపెనీలో ఫైనాన్షియల్‌ అనలిస్టుగా బెంగుళూర్‌లో జాయినయ్యాను. అప్పుడే సివిల్స్‌పై దృష్టి మళ్లింది. 
 • దీనికి కారణం మల్టి డైరెక్షన్‌లో ఎదగాలన్న తపన, నేను చేసే, చూసే పని ఒక్కటి కావాలని, సర్వీస్‌ చేయాలన్నా సివిల్సే బెస్ట్‌ అని భావించి ఇటువైపు వచ్చాను. 
 • తల్లిదండ్రులిద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులే. తల్లి నిర్మల బాలికల ఉన్నత పాఠశాల కొండపాక, తండ్రి సురేశ్‌ జడ్పీహెచ్‌ఎస్‌ బదనకల్‌ ముస్తాబాద్‌ మండలంలో పనిచేస్తున్నారు. 

కోచింగ్‌ ఎక్కడ తీసుకున్నారు? 

వాజీరాం అకాడమీలో కోచింగ్‌ తీసుకున్న. సివిల్స్‌వైపు అవగాహన లేని వారికి కోచింగ్‌ అవసరం. మన ఒరిజినాలిటీ మిస్‌ కావద్దు. నేడు ఆన్‌లైన్‌లో అన్ని క్లాసులు లభిస్తున్నాయి. సీనియర్ల అభిప్రాయాలు తీసుకోవాలి. మంచి గైడెన్స్‌ కోసం కోచింగ్‌ అవసరం. బయట కూడా మంచి మెటీరియల్‌ దొరుకుతున్నాయి. 

లాంగ్‌టర్మ్‌ విజన్‌లో భాగంగా ప్రిపేర్‌ కావచ్చా? 

లాంగ్‌టర్మ్‌ విభాగంలో ప్రిపేర్‌ కావచ్చు. కరెంట్‌ అఫైర్స్‌తో పాటు నిత్యం న్యూస్‌ పేపర్లో వచ్చే వార్తలు చదవాలి. ముందుగా ఆటిట్యూడ్‌లో ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఒక సంవత్సరం మాత్రమే పుస్తకాలతో అవసరం. పరీక్ష డిమాండ్‌కు అనుగుణంగా ప్రిపేర్‌ కావాలి. సమాజం పట్ల, జరుగుతున్న సంఘటనల పట్ల నిత్యం పరిశీలన ఉండాలి. 

భవిష్యత్తులో ప్రిపేరయ్యే వారికి మీరిచ్చే సలహాలు? 

ఎదగాలనే తపనతో పాటు ప్రతి అంశంలో నేర్చుకోవాలనే తత్వం అలవర్చుకోవాలి. మొదటి ప్రయత్నం 2018లో ప్రిలిమ్స్‌లోనే ఆగిపోయాను. 2019లో రెండో ప్రయత్నంలో ఆలిండియా సివిల్స్‌ ఫలితాల్లో 110వ ర్యాంకు సాధించాను. 

ప్రిలిమ్స్‌ మెయిన్స్‌ ప్రిపరేషన్‌ వ్యూహం ఏమిటి?

ఎగ్జామ్‌ ఓరియంటెడ్‌గా చదవాలి. పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అనే దానికి అనుగుణంగా చదువు సాగించాలి. చదువుతున్న సబ్జెక్టుపై పూర్తి పట్టు సాధించేలా శ్రద్ధ పెట్టాలి. సీనియర్లు, గురువుల అభిప్రాయాలు తీసుకోవాలి. పరీక్షకు అనుగుణంగా వ్యూహం ఉండాలి. చదివిన దానిని పూర్తిగా అర్థం చేసుకోవాలి. నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవాలి. చదివిన దాన్ని మార్కుల రూపంలోకి వచ్చేలా ప్రిపరేషన్‌ ఉండాలి. మెటీరియల్‌ను తయారు చేసుకోవాలి. అచీవ్‌మెంట్‌, ఓరియంటెడ్‌గా ప్రిపరేషన్‌ ఉండాలి. 

ఇంటర్వ్యూలో ఏం అడిగారు?

స్మితా నాగరాజు బోర్డు ఇంటర్వ్యూ చేసింది. రాష్ట్ర విభజనను మీరు సమర్థిస్తారా అని అడిగారు. దానికి సమర్థిస్తానని చెప్పాను. చాలాకాలంగా ఒక ప్రాంత సమస్యలను పరిష్కరించకుండా ఉండటంవల్ల ఇలాంటి డిమాండ్‌లు, ఉద్యమాలు వస్తాయి. అందుకే త్వరగా సమస్యలను పరిష్కరించాలని చెప్పాను. నార్త్‌ ఈస్ట్‌లో కూడా గొడవలు అవుతున్నాయి. దేశంలో చాలా రాష్ర్టాల్లో ప్రత్యేక రాష్ర్టాల డిమాండ్‌లు వస్తున్నాయి. అక్కడి సమస్యలు త్వరగా పరిష్కరించాలి. సిద్దిపేట ప్రాంతంలో పండే పంటలు గురించి అడిగారు. ముఖ్యంగా మక్కజొన్న, దానికి సంబంధించిన ఫుడ్‌ ప్రాసెస్‌ ఉత్పత్తులను ప్రమోట్‌ చేయాలనుకుంటారా, ఎలా ప్రమోట్‌ చేస్తావు అని అడిగారు. 

...? - రాగుల కరుణాకర్‌రెడ్డి, సిద్దిపేట 

తపన ఉంటే సాధించవచ్చు

- ధాత్రిరెడ్డి (46వ ర్యాంక్‌)

చిన్నప్పటి నుంచి చురుకైన స్వభావం. చదువుల్లో టాపర్‌ కాదు. కానీ ఆటపాటల్లో ఇతర పోటీల్లో తనదైన శైలిలో ముందుకుపోయిన వైనం. ఐఐటీ సాధించడం.. ఇంజినీరింగ్‌ తర్వాత ఎంఎన్‌సీలో జాబ్‌.. కానీ ఏదో చేయాలనే తపన. సమాజ సేవ, మనస్సుకు తృప్తి ఉండే పనికోసం ఆరాటం. ఈ ఆలోచనలోంచి సివిల్స్‌ వైపు పయనం. అలా ప్రారంభమైన ప్రస్థానం కేవలం రెండో ప్రయత్నంలో 233, మూడో ప్రయత్నంలో 46వ ర్యాంక్‌ సాధించింది ధాత్రిరెడ్డి. తన విజయ ప్రస్థానం ఆమె మాటల్లో..

కుటుంబ ప్రోత్సాహంతో..

 • మాది చౌటుప్పల్‌ దగ్గర్లోని గుండ్లబావి. నాన్న కృష్ణారెడ్డి వ్యాపారి. అమ్మ గృహిణి. సోదరుడు గ్రీష్మన్‌రెడ్డి ఐఐటీ బాంబేలో గ్రాడ్యుయేట్‌. అమ్మనాన్నలు నాకు స్వేచ్ఛ ఇచ్చారు. చదువు విషయంలో ఒత్తిడి చేయలేదు. కానీ ఏది చేసినా దాన్ని పర్‌ఫెక్ట్‌గా చేయమని చెప్పేవారు. కుటుంబ ప్రోత్సాహంతోనే మంచి ర్యాంక్‌ సాధించగలిగాను. అదేవిధంగా మహేష్‌భగవత్‌ సార్‌ తదితరులు నా డౌట్స్‌ను క్లియర్‌ చేసేవారు. వారి గైడెన్స్‌ ఉపయోగపడింది. ఇక సివిల్స్‌లో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఇంటిగ్రేటెడ్‌ ప్రిపరేషన్‌ చేశాను. ప్రిలిమ్స్‌కు రెండున్నర నెలల ముందు ఎక్స్‌క్లూజివ్‌గా ప్రిపేర్‌ కావాలి. ప్రిలిమ్స్‌కు ముందు 80-90 టెస్ట్‌ సిరీస్‌ ప్రాక్టీస్‌ చేశాను. మెయిన్స్‌కు ఆన్సర్‌ రైటింగ్‌ ప్రాక్టీస్‌ చేయాలి. 3 గంటల్లో 20 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి అనేది గుర్తుంచుకోవాలి. రాయడం అనేది పెద్ద టాస్క్‌. ప్రతిరోజు ఆరుగంటలు. ప్రాక్టీస్‌ చేస్తే మంచిది. 
 • హైదరాబాద్‌లోని సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్‌ తరువాత ఎంఎన్‌సీలో జాబ్‌ చేశాను. బీటెక్‌ చేసే సమయంలో సరైన ప్లాట్‌ఫాం సివిల్స్‌గా భావించి ఇటువైపు వచ్చాను. అందరిలాగా కోచింగ్‌కు వెళ్లినా నచ్చకపోవడంతో సొంతంగా ప్రిపరేషన్‌ ప్రారంభించాను. 2017లో విఫలమయ్యాను. కానీ పట్టు వదలకుండా రెండోప్రయత్నంలో 233 ర్యాంక్‌తో ఐపీఎస్‌గా ఎంపికయ్యాను. ఐఏఎస్‌ కావాలని మరోసారి చదివి 46వ ర్యాంక్‌ సాధించాను. తెలుగు రాష్ర్టాల్లో మొదటిర్యాంక్‌ రావడం చాలా సంతోషంగా ఉంది. 

సోషియాలజీ

 • ఆప్షనల్‌ సోషియాలజీ. ఆప్షనల్‌ అనేది ఎంపికలో ఆసక్తి ఉంటేనే మనం బాగా చదవగలం. సివిల్స్‌ అనేది సుదీర్ఘప్రస్థానం అనేది గుర్తుంచుకోవాలి. 
 • సోషియాలజీ వల్ల తర్వాత క్షేత్రంలో ఉపయోగం ఉండటం, ఆసక్తి రెండు కారణాలవల్ల దీన్ని తీసుకున్నాను. 

ఎంతసేపు చదవాలి?

 • రోజుకు ఎన్ని గంటలు చదవాలి? ఎంత చదవాలి అనేది టార్గెట్‌ చేసుకోవాలి. లేకుంటే లక్ష్యాన్ని చేరుకోలేం. కేవలం రెండు మూడు గంటలు చదివితే సరిపోదు. నేను రోజుకు 8-10 గంటలు చదివాను. 
 • కోచింగ్‌ విషయానికి వస్తే అవకాశం ఉండి పోగలగే స్తోమత ఉంటే తీసుకోవచ్చు. దీనివల్ల కొంత గైడెన్స్‌ లభిస్తుంది. లేకున్నా సర్వీస్‌ సాధించవచ్చు. 

ఇంటర్వ్యూ

 • బీబీ వ్యాస్‌ బోర్డు ఇంటర్వ్యూ చేసింది. సుమారు 40 నిమిషాల పాటు ఇంటర్వ్యూ జరిగింది. ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌, పోలీస్‌ సంస్కరణలు తదితర విషయాలపై ప్రశ్నలు అడిగారు.

సూచనలు

 • సివిల్స్‌ సాధించాలనుకునేవారు మొదట ఆటంకాలను తగ్గించుకోవాలి.
 • తక్కువ బుక్స్‌ను ఎంచుకుని ప్రిపరేషన్‌ ప్రారంభించాలి.
 • వీటిని ఎక్కువసార్లు చదవాలి. 
 • ఏ డిగ్రీ చదివినవారైనా సివిల్స్‌ సాధించవచ్చు. 
 • పట్టుదల, ఓపికతో ప్రిపరేషన్‌ సాగించాలి.
 • నా ప్రిపరేషన్‌ నోట్స్‌, వ్యూహాలు, ఇంటర్వ్యూ తదితర అన్ని విషయాలు భవిష్యత్‌లో సివిల్స్‌ రాసేవారికి ఉపయోగపడాలని బ్లాగ్‌లో పెట్టాను. ఎవరైనా ఆసక్తి ఉంటే వాటిని ఉపయోగించుకోండి. బ్లాగ్‌ https://dhatrireddy3.blogspot.comలో చూడవచ్చు. 

సెంచరీ కొట్టాడు

అతడో క్రికెట్‌ ప్లేయర్‌. హైదరాబాద్‌ అండర్‌-19కి ఆడాడు. జేఎన్‌టీయూహెచ్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అదే సమయంలో చిన్నప్పటి నుంచి తన తండ్రి చెప్పిన సివిల్స్‌ వైపు దృష్టిసారించాడు. విజయం సాధించాడు. అతడే 103వ ర్యాంక్‌ సాధించిన ఎంవీ సత్యసాయి కార్తీక్‌. మొదటి మూడు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్‌ కూడా పాస్‌ కాలేదు. కానీ పట్టు వదలకుండా నాలుగో ప్రయత్నంలో విజయం సాధించాడు. కార్తీక్‌ తన చదువు, ఆట, సివిల్స్‌ పై చెప్పిన విషయాలు ఆయన మాటల్లో..

- ఎంవీ సత్యసాయి కార్తీక్‌(103వ ర్యాంక్‌)

 • మాది హైదరాబాద్‌. నాన్న శ్రీనివాస్‌ అంబర్‌పేట ఎస్‌బీఐలో ఉద్యోగి. అమ్మ ప్రభావతి బొటిక్‌ నడుపుతుంది. చెల్లి హన్సిక ఆశ్రిత్‌ స్టార్టప్‌ నిర్వహిస్తుంది. హైస్కూల్‌ వరకు ఆల్‌ సెయింట్స్‌లో చదివాను. ఇంటర్‌ ఉప్పల్‌ లిటిల్‌ఫ్లవర్‌ జూనియర్‌ కాలేజీలో, బీటెక్‌ (సీఎస్‌ఈ) గోకరాజు గంగరాజు కాలేజీలో చదివాను. తర్వాత డెలాయిట్‌లో ఆరునెలలు ఉద్యోగం చేశాను.
 • వాస్తవానికి క్రికెట్‌ ప్లేయర్‌ని హైదరాబాద్‌ అండర్‌-19కి ఆడాను. జేఎన్‌టీయూహెచ్‌ టీమ్‌ కెప్టెన్‌గా వ్యవహరించాను. ఇండియా టీంకు ఆడాలని ఉండేది. కానీ అది నెరవేరలేదు. ఇదే సమయంలో నాన్న చిన్నప్పటి నుంచి చెబుతున్న సివిల్స్‌వైపు దృష్టి పెట్టాను. సమాజానికి దగ్గరగా ఉండి సేవచేయడానికి, నాకంటూ ఒక గుర్తింపు పొందడానికి సివిల్స్‌ కరెక్ట్‌ని భావించాను. 

పట్టు వదలకుండా..

2015లో ఢిల్లీ, బెంగళూరులో ఏడాది కోచింగ్‌ తీసుకున్నాను. మొదటి మూడు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్‌ పాస్‌ కాలేదు. అయినా కుంగిపోకుండా మరింత సీరియస్‌గా చదివాను. దీంతో నాలుగోసారి 103వ ర్యాంక్‌ సాధించాను. 

సోషియాలజీ

 • ఆప్షనల్‌ సోషియాలజీ. దీనిపై ఆసక్తితో తీసుకున్నాను. దీనివల్ల సొసైటీ ప్రాబ్లమ్స్‌, ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌ అన్ని సమస్యలకు దీని ద్వారా అవగాహన కలుగుతుంది.

ఇంటర్వ్యూ

 • స్మితా నాగరాజ్‌ మేడం బోర్డు ఇంర్వ్యూ చేసింది. సుమారు 25-30 నిమిషాలపాటు జరిగింది. నా బయోడేటా, హాబీలు, క్రికెట్‌, ఎథికల్‌ హ్యాకింగ్‌పై ప్రశ్నలు అడిగారు. రాష్ట్రం విషయానికి వస్తే నక్సలిజం, దిశ ఘటన తదితర అంశాలు అడిగారు. 
 • సివిల్స్‌లో మెయిన్స్‌ డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌. దీనికోసం బాగా ప్రాక్టీస్‌ చేశాను. మహేశ్‌భగవత్‌, హేమంత్‌ నింబాల్కర్‌, బాలలత, వేదకుమారి చాలా హెల్ప్‌ చేశారు. సోషియాలజీకి సంబంధించి ఢిల్లీ రాజ్‌కుమార్‌సార్‌ సహాయపడ్డారు. 

నిర్లక్ష్యం వద్దు

 • ప్రిలిమ్స్‌ను నిర్లక్ష్యం చేయవద్దు. స్ట్రాటజీ ఉండాలి. దీనికోసం ప్రతిరోజు రెండుగంటలపాటు డిఫరెంట్‌ టైప్‌ ప్రశ్నలను సాల్వ్‌చేయాలి. పరీక్ష జరిగే సమయం అంటే ఉదయం 9.30 నుంచి 12.30, మధ్యహ్నం 2-4 వరకు రియల్‌ టైం ఎగ్జామ్‌లాగే ప్రశ్నలను సాధించాలి. శరీరం ఆ సమయంలో యాక్టివ్‌గా ఉండటం అలవాటవుతుంది. మానసిక సంసిద్ధత ఉంటుంది.
 • ఎమోషనల్‌ ఫ్యాక్టర్స్‌ స్ట్రెస్‌ తగ్గించుకోవడానికి గేమ్స్‌, మెడిటేషన్‌, నిద్ర, డైట్‌ జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవాలి.
 • మెయిన్స్‌ టైంలోపల అంటే మూడు గంటల్లో 20 ప్రశ్నలు రాయాలి. ఒక్కప్రశ్న కూడా మిస్‌చేయవద్దు. దీనికోసం స్ట్రక్చర్‌ ఫాలో కావాలి. రైటింగ్‌ ప్రాక్టీస్‌ చేయాలి. 
 • ముఖ్యంగా సివిల్స్‌కు చాలా సోర్సులు ఉంటాయి. కానీ ఎక్కువ చదివి నష్టపోవద్దు. తక్కువ సోర్స్‌లు అంటే ప్రామాణికమైన బుక్స్‌ లిమిటెడ్‌గా ఎంచుకుని వాటినే పదేపదే రిపీట్‌ చేయాలి. రైటింగ్‌ ప్రాక్టీస్‌ చాలా ముఖ్యం.
 • ఇంటర్వ్యూ విషయంలో నాకు చెల్లి ప్రతిరోజు ప్రశ్నలు అడుగుతూ హెల్ప్‌ చేసింది. 
 • సివిల్స్‌ లాంగ్‌టైం ప్రాసెస్‌. దీనికోసం డైలీ, వీక్లీ, మంత్లీ ప్రోగ్రెస్‌ చూసుకుంటూ ప్లాన్‌చేసుకోవాలి. ఎన్ని గంటలనేదే కాకుండా ఎంత చదవాలనేది ముఖ్యం.
 • మరో ముఖ్య విషయం సివిల్స్‌ ఒక్కటే ప్లాట్‌ఫాం కాదు. ప్యాషన్‌ ఏది ఉంటే దానివైపు వెళ్లాలి. దానికి న్యాయం చేయాలి. ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకోవాలనే తపన ఉండాలి. గోల్‌ రీచ్‌ కావాలనే కసి, తృష్ణ ఉంటే ఏదైనా సాధించగలం. కనీసం ఏడాదిన్నర ప్రాసెస్‌ ఇది. కాబట్టి అన్నింటిని బ్యాలెన్స్‌ చేసుకుని ప్రిపరేషన్‌ కొనసాగించాలి. డిగ్రీ అయ్యాక సివిల్స్‌వైపు వస్తే మంచిది. కాకుంటే డిగ్రీ ప్రారంభం నుంచి న్యూస్‌పేపర్స్‌, ప్రపంచం పట్ల అవగాహన పెంచుకుంటే సులభంగా ఉంటుంది. 
 • బాధ్యతాయుతంగా ప్రజల కోసం సర్వీస్‌ చేస్తాను. సమాజంలోని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లడం, పేదప్రజలకు, ఎడ్యుకేషన్‌, ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ రంగాల్లో కృషిచేస్తాను.

మొదటి ప్రయత్నంలోనే సాధించా..

సత్యప్రకాశ్‌గౌడ్‌ (ర్యాంకు 218)

చదివింది ఇంజినీరింగ్‌. ప్రజాసేవ చేయాలన్న తపన. దీంతో సివిల్స్‌ వైపు అడుగువేశాడు.  ఇంట్లో అమ్మనాన్నల  ప్రోత్సాహంతో మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ సాధించాడు. పట్టుదల, సరైన ప్రణాళిక ఉంటే ఏదైనా సాధించవచ్చంటున్న సత్యప్రకాశ్‌ గౌడ్‌ నిపుణతో పంచుకున్న విషయాలు

కుటుంబ నేపథ్యం: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం తంగడపల్లి గ్రామం. ప్రస్తుతం హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో స్థిరనివాసం. తండ్రి బడేటి అశోక్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఏజీఎంగా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. అక్క ఉషశ్రీ బీడీఎస్‌ పూర్తిచేసింది.

సివిల్స్‌వైపు రావడానికి ఎవరైనా ప్రోత్సహించారా? లేక సొంతంగా నిర్ణయించుకున్నారా?

 • నాకు నేనే నిర్ణయించుకున్నాను. సొంత ఆలోచనతోనే ప్రయత్నం మొదలుపెట్టాను. బీటెక్‌ ఫోర్త్‌ ఇయర్‌లోనే సివిల్స్‌ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. యూపీఎస్సీ సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌ రాయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాను.

సివిల్స్‌నే ఎందుకు ఎంచుకున్నారు? ఇటు వైపు రావడానికి కారణం?

 • సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగం అంటే ప్రజాసేవ చేయడం. అందులోనూ తొలినుంచి మా ఇంట్లో సామాజిక స్పృహ ఎక్కువే. ఇంకా సమాజ పరిస్థితులపై కుబుంబ సభ్యులందరికి అవగాహన ఉండటం ఇవన్ని కూడా సివిల్స్‌ రాయాలనే నా ఆలోచనకు దారితీసిందని చెప్పవచ్చు.

ఎన్నో ప్రయత్నంలో సివిల్స్‌ సాధించారు?

 • ఇది నా మొదటి ప్రయత్నం. మొదటి ప్రయత్నంలోనే 218 ర్యాంకు సాధించాను. వాస్తవానికి నాది బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ 2018 ఐఐటీ పట్నా నుంచి పూర్తిచేశాను. ఆ తరువాత 2018 జూన్‌లో ఢిల్లీ వెళ్లి నా ఆప్షనల్‌ సబ్జెక్టు (పొలిటికల్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంట్‌ రిలేషన్స్‌) కోసం సుప్రారంజున్‌ మేడమ్‌ దగ్గర కోచింగ్‌ తీసుకున్నాను. జూన్‌ 2019లో ప్రిలిమ్స్‌ పాసై మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యాను. మెయిన్‌ పరీక్షను సెప్టెంబర్‌లో రాశాను. మెయిన్స్‌ పాసవడం, ఇంటర్వ్యూ ఇలా.. అన్ని విజయాలతో అనుకున్నది సాధించాను. అది కూడా మొదటి ప్రయత్నంలోనే రావడం గర్వంగా ఉంది.

భవిష్యత్‌ లక్ష్యాలు ఏమిటి?

 • సివిల్స్‌లో విజయం సాధించాలన్న లక్ష్యాన్ని చేరుకున్నా. ఇక నా దృష్టి శిశుసంరక్షణ, మహిళా భద్రత, సేవ చేయడంపైనే. ముఖ్యంగా పిల్లల చదువుకు, గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి, మహిళలరక్షణకే నా మొదటి ప్రాధాన్యం.

మీ విజయానికి దోహదపడిన అంశాలు ఏమిటి?

 • సరైన ప్రళాళిక, గతంలో అడిగిన ప్రశ్నల విధానాన్ని అర్థం చేసుకోవడం. ఇంకా దానికి తగిన విధంగా సిలబస్‌ను ఎంత, ఏ మేర చదవాలో నిర్ణయించుకోవడం, ఎప్పటికప్పుడు సబ్జెక్టులవారీగా సొంతంగా నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవడం, గత ప్రశ్నప్రత్రాలకు సమాధానాలు రాయడం. అందులో రాసిన తప్పులను తెలుసుకోవడం. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూలకు ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్‌ కావడం నా సక్సెస్‌కు కారణాలు.

ఇంటర్వ్యూలో ఏయే అంశాలపై ప్రశ్నలు అడిగారు?

 • ఇంటర్వ్యూ బోర్డులో చైర్మన్‌తో సహా ఐదుగురు సభ్యుల బృందం ఉన్నది. ఇంటర్వ్యూలో నేను ఎంచుకున్న ఆప్షనల్‌ సబ్జెక్టుపై, జాతీయ, ప్రాంతీయ రాజకీయాలతో పాటు అంతర్జాతీయంగా ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్‌ కార్యకలపాలపై కూడా ప్రశ్నలు అడిగారు. వీటితో పాటు విద్యాభ్యాసం, విద్యావ్యవస్థపై, అలవాట్లు, అభిరుచులు బీటెక్‌ చదివిన పట్నా (బీహార్‌) హైదరాబాద్‌కు గల వ్యత్యాసాలు వంటి అంశాలపైన అడిగారు.

కోచింగ్‌ తీసుకున్నారా? సొంతంగా ప్రిపేర్‌ అయ్యారా?

 • మొదట్లో ప్రణాళిక వేసుకుని సొంతంగానే చదివాను. అయితే ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ మాత్రమే కోచింగ్‌ తీసుకున్నాను. మిగతా సబ్జెక్ట్స్‌ అన్నీప్రిలిమ్స్‌ అండ్‌ మెయిన్‌కు సొంతంగానే ప్రిపేరయ్యాను. జూన్‌ 2018 నుంచి ఇంటర్వ్యూ జరిగిన మార్చి 17, 2020 వరకు ఢిల్లీలోనే ఉండి సొంతంగా ప్రిపేరయ్యాను.

ఆప్షనల్‌ సబ్జెక్ట్స్‌ ?

 • పొలిటికల్‌ సైన్స్‌, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌

సివిల్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు మీరిచ్చే సలహాలు?

 • ఏదైనా మనం అనుకుంటే సాధించవచ్చు. పట్టుదల ఉంటే కానిది లేదు. ఒక ప్రణాళిక ప్రకారంగా వందశాతం డెడికేషన్‌తో హార్డ్‌వర్క్‌ చేస్తే మొదటి ప్రయత్నంలో కాకపోయినా మరో ప్రయత్నంలోనైనా విజయం సాధించవచ్చు. చేసే పనిపై పూర్తిస్థాయిలో ఆసక్తి ఉండాలి. లక్ష్యంపై స్పష్టత.. అనుకున్నది సాధించడానికి అలుపెరగకుండా శ్రమించే ఓర్పు.. ప్రతి సందర్భంలో లక్ష్యమే కళ్లముందు కనిపించాలి. వీటితో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటే  మరింత సులువుగా విజయం సాధించవచ్చు. ఎవరైనా సరే ఓటమి వచ్చినా కుంగిపోకూడదు. పట్టుదలతో కృషిచేయాలి. అప్పుడే అంతిమ విజయం మనదవుతుంది.

మీ ప్రిపరేషన్‌ ఎలా సాగింది?

సివిల్స్‌ ఎప్పుడైతే ఎంచుకున్నానో ఆ రోజు నుంచే ప్రణాళిక తయారుచేసుకున్నాను. ముందుగా మొత్తం సిలబస్‌ క్షుణ్ణంగా ఒకటికి పదిసార్లు చదివాను. ప్రిలిమ్స్‌కు ఏయే సబ్జెక్టులు ఉంటాయి, ఏ తరహా ప్రశ్నలు అడుగుతున్నారని అవగాహన ఏర్పరచుకొని, దానికి సంబంధించిన పుస్తకాలు, మెటీరియల్‌ గురించి తెలుసుకుని వాటిని సమకూర్చుకున్నాను. అదేవిధంగా మెయిన్స్‌లో ఏ ఆప్షనల్‌ తీసుకోవాలనేది కూడా అన్వేషించి ఆప్షనల్స్‌ను ఎంచుకున్నాను. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో మిగతా సబ్జెక్ట్స్‌కు సొంతంగానే ప్రిపేరయ్యాను. ఇంటర్వ్యూ కోసం మాక్‌ ఇంటర్వ్యూకు అటెండ్‌ అయ్యాను.

నాన్న ప్రోత్సాహంతోనే..

కొల్లాబత్తుల కార్తీక్‌ (428)

కుటుంబ నేపథ్యం: తండ్రి శ్రీనివాస్‌ హెచ్‌పీసీఎల్‌లో ప్రొడక్షన్‌ సూపరింటెండెంట్‌, తల్లి రేవతి గృహిణి. తమ్ముడు ఐఐఐటీ డీఎం, కాంచీపురంలో ఇంజినీరింగ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నాడు. 

ప్రైవేటు ఉద్యోగంలో సంతృప్తి లేక.. 

 • నాన్న ప్రోత్సాహంతోనే సివిల్స్‌ సాధించాను. అమ్మ ఎల్లప్పుడు నాకు తోడుగా అండగా నిలుస్తూ మనోధైర్యాన్ని ఇచ్చింది. విద్యాభ్యాసం మొత్తం వైజాగ్‌లోనే సాగింది. బీటెక్‌ తర్వాత ఏడాదిపాటు ప్రైవేటు ఉద్యోగం చేశాను. అందులో సంతృప్తి లేక  సివిల్స్‌ వైపు వచ్చాను. 
 • దేశాభివృద్ధిలో సివిల్‌ సర్వీస్‌ ఆఫీసర్స్‌ కీలకమైన పాత్ర పోషిస్తారు. నాకు కూడా ఆ అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. సిటిజన్‌ ఫ్రెండ్లీ సర్వీసెస్‌ అందజేయడం నాలక్ష్యం.
 • 2017లో గ్రాడ్యుయేషన్‌ తర్వాత ప్రిపరేషన్‌ లేకుండా సివిల్స్‌ ప్రయత్నించా. 2018లో ఉద్యోగం మానేసి కోచింగ్‌ తీసుకుని 2019లో మళ్లీ ప్రయత్నించాను. ఈసారి 428వ ర్యాంకు సాధించాను. ఎలాగైనా సివిల్స్‌ కొట్టాలనే కసి, ఆశతో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినప్పటికీ లక్ష్యసాధన విడిచిపెట్టలేదు.

సివిల్స్‌లో ఆప్షనల్స్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌

 • చిన్న వయస్సు నుంచే చాలా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. సమాజసేవ అంటే ఇష్టం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సమాజం పట్ల బాధ్యత, గౌరవం పెరుగుతాయి.

విజయానికి దోహదపడిన అంశాలు

 • హార్డ్‌వర్క్‌, స్మార్ట్‌వర్క్‌, స్పిరిట్‌ ఆఫ్‌ సర్వీస్‌

ఇంటర్వ్యూలో ఎదుర్కొన్న ప్రశ్నలు

 • కొల్లాబత్తుల అనే నా ఇంటిపేరు ఎలా వచ్చిందనే ప్రశ్న నుంచి, చైతన్య, నారాయణ స్కూల్స్‌ మీద ఐటీ రైడ్స్‌ వంటి ప్రశ్నల వరకు చాలానే అడిగారు. ముఖ్యంగా ఏపీలో మూడు రాజధానులు, ఇంగ్లిష్‌ మీడియం, తెలుగు మీడియం, ఇండియా-చైనా అంశం, అడ్మినిస్ట్రేషన్‌ ఎలా చేస్తారు. ట్రైబల్‌ (గిరిజన జాతులు) సమస్యలు వాటి పరిష్కారాలు లాంటి ప్రశ్నలు అడిగారు.
 • బాలలత మేడమ్‌ దగ్గర కోచింగ్‌ తీసుకున్నాను. మేడమ్‌ సలహాలు నా లక్ష్యసాధనకు ఎంతో తోడ్పడ్డాయి. 

సలహాలు, సూచనలు

 • మీ హార్డ్‌వర్క్‌ని నమ్ముకోండి. కన్‌స్టెన్సీ మెయింటెన్‌ చేయండి. ప్రిపరేషన్‌లో సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌తోపాటు టెస్టులు బాగా ప్రాక్టీసు చేయండి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని పరిపుష్టం చేసుకోండి.

సివిల్స్‌లో తెలుగు తేజాలు 

దేశంలో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌- 2019 తుది ఫలితాలు వెలువడినాయి. దీనిలో 829 మంది అభ్యర్థులు సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. ఇందులో 304 జనరల్‌, 78 ఈబీసీ, 254 ఓబీసీ, ఎస్సీ 129, ఎస్టీ 67 మంది ఉన్నారు. ఈ ఫలితాల్లో ప్రదీప్‌ సింగ్‌ మొదటి ర్యాంక్‌, జతిన్‌ కిశోర్‌ రెండో ర్యాంకు, ప్రతిభా వర్మ మూడో ర్యాంక్‌ సాధించారు. తెలుగు రాష్ర్టాల నుంచి టాప్‌ 100లో మెరుగైన ఫలితాలు సాధించారు. ర్యాంకులు సాధించిన తెలుగు అభ్యర్థులు.. మల్లవరపు సూర్యతేజ (76), కట్టా రవితేజ (77), సింగారెడ్డి రిషికేశ్‌ రెడ్డి (95), ఎంవీ సత్యసాయి కార్తీక్‌ (103), మంద మకరంద్‌ (110), తాటిమాకుల రాహుల్‌ రెడ్డి (117), కే ప్రేమ్‌సాగర్‌ (170), పీ సందీప్‌ వర్మ (244), శ్రీచైతన్య కుమార్‌ రెడ్డి (250), చీమల శివగోపాల్‌ రెడ్డి (263), యలవర్తి మోహన్‌కృష్ణ (283), ఏ వెంకటేశ్వర్‌ రెడ్డి (314), సిరిశెట్టి సంకీర్త్‌ (330), ముత్తినేని సాయితేజ (344), ముక్కెర లక్ష్మీపావన గాయత్రి (427), కొల్లాబత్తుల కార్తీక్‌ (428), ఎన్‌ వివేక్‌ రెడ్డి (485), నీతిపూడి రష్మితారావు (534), కోరుకొండ సిద్ధార్థ (566), సీ సమీర్‌ రాజా (603), కొప్పిశెట్టి కిరణ్మయి (633) తదితరులు ర్యాంకులను సాధించారు. 

హైదరాబాద్‌కు ర్యాంకుల పంట

సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌లో హైదరాబాద్‌ మరోసారి తన ప్రత్యేకత చాటుకుంది. గత కొన్నేండ్లుగా టాప్‌ర్యాంకులతోపాటు ఎక్కువ సంఖ్యలో సర్వీస్‌లను హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకున్న అభ్యర్థులు సొంతం చేసుకుంటున్నారు. దక్షిణాదిన సివిల్స్‌ హబ్‌గా హైదరాబాద్‌ నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన పలు కోచింగ్‌ సెంటర్లు కూడా మంచి ర్యాంకులను సాధించాయి. దీంతో దక్షిణాదివారే కాకుండా ఉత్తరాది నుంచి కూడా మధ్యతరగతి విద్యార్థులు హైదరాబాద్‌ కోచింగ్‌వైపు దృష్టిసారిస్తున్నారు.

ఫెయిలే పట్టుదలను పెంచింది

పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా సివిల్స్‌ పరీక్ష రాసి గతేడాది రైల్వే సర్వీస్‌ సాధించి ఈసారి మరింత మెరుగైన ర్యాంక్‌ సాధించిన శశికాంత్‌ నాయక్‌ విజయంపై ఆయన చెప్పిన విషయాలు.

శశికాంత్‌ నాయక్‌ (764వ ర్యాంక్‌)

 • మాది మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం చాకలిదానితండా. నాన్న హాస్టల్‌ వార్డెన్‌గా పనిచేస్తూ 2008లో చనిపోయాడు. అమ్మ సీతమ్మ. తమ్ముడు, చెల్లి ఉన్నారు. నాన్న చనిపోయిన అమ్మ కష్టపడి నన్ను చదివించింది. వట్టెం జవహర్‌ నవోదయలో ఉన్నప్పుడు ఒకసారి జిల్లా కలెక్టర్‌ వచ్చారు. అక్కడ ఆయన్ను దగ్గరి నుంచి చూసి స్ఫూర్తి పొందాను. అప్పటినుంచే కలెక్టర్‌ కావాలన్న కోరిక పెరిగింది. నాన్న కూడా ఎప్పుడు కలెక్టర్‌ గురించి చెప్పేవారు. 
 • సివిల్స్‌ ప్రిపరేషన్‌ కోసం ఢిల్లీకి వెళ్లాను. కోచింగ్‌ తీసుకున్నాను. అక్కడ స్నేహితులతో ఉండి గ్రూప్‌ స్టడీ చేశాను. ఆప్షనల్‌ సబ్జెక్టు ఆంత్రోపాలజీ.
 • విజయానికి దోహదపడ్డ అంశాలు హార్డ్‌వర్క్‌, ప్లానింగ్‌, పాజిటివ్‌ ఆటిట్యూడ్‌. 2012 నుంచి సివిల్స్‌ రాస్తున్నాను. ఫెయిల్‌ అయిన ప్రతిసారి మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రిపేరయ్యేవాడిని. 
 • స్మితా బోర్డు ఇంటర్వ్యూ చేసింది. రైల్వే సర్వీస్‌ నుంచి ఐఏఎస్‌ ఎందుకు వెళ్లాలని అనుకుంటున్నావు? ఐఏఎస్‌గా ఏం చేయదల్చుకున్నావు? పట్టణాల పేర్లు మార్పుపై, తెలంగాణ వంటలు, రైల్వే ప్రైవేటీకరణ, మహబూబ్‌నగర్‌, గ్రామీణ సమస్యలపై ప్రశ్నలు అడిగారు. 
 • సివిల్స్‌ రాయబోయే అభ్యర్థులకు చెప్పేది ఒక్కటే సిన్సియర్‌గా చదవండి. అంకితం కండి. ప్లానింగ్‌, ఓపిక ఉంటే తప్పక సివిల్స్‌ సాధించవచ్చు.
 • గతేడాది రైల్వే సర్వీస్‌ వచ్చింది. ఇంకా మంచి సర్వీస్‌ సాధించాలని ప్రయత్నించాను. ఈసారి 764వ ర్యాంక్‌ వచ్చింది.  

..? సత్యంగౌడ్‌ సూదగాని

పట్టు వదలకుండా ప్రయత్నించాను

సివిల్స్‌లో ర్యాంక్‌ కొట్టాలనేది అతడి కల.. దానికోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రిపేరయ్యాడు. మూడుసార్లు ఫెయిలైనా నాలుగోసారి అతడి కల నెరవేరింది. అతడే ఇటీవల వెలువడిన సివిల్స్‌ ఫలితాల్లో 244వ ర్యాంక్‌ సాధించిన సందీప్‌ కుమార్‌. సివిల్స్‌ ర్యాంక్‌ రావడానికి ఎలా కష్టపడ్డాడనే విషయాలు నమస్తే నిపుణతో పంచుకున్న విషయాలు.

ఫ్యామిలీ, ఎడ్యుకేషన్‌ గురించి చెప్పండి?

నాన్న పేరు పిన్నపునేని కోటేశ్వరరావు, అమ్మ పేరు ప్రభావతి. అన్నయ్య సంపత్‌.  నాన్నది పెన్‌పహాడ్‌ మండలం ధూపాడు గ్రామం. హుజూర్‌నగర్‌కు వచ్చి స్థిరపడి ఇక్కడ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ పెట్టారు. విద్యుత్‌ శాఖలో నాన్న జేఏవోగా, అమ్మ సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. 1 నుంచి 8వ తరగతి వరకు హుజూర్‌నగర్‌లోని విజ్ఞాన్‌ పాఠశాలలో, 9 నుంచి 10వ తరగతి వరకు కోదాడలోని గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌లో, ఇంటర్‌ హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీలో, ఇంజినీరింగ్‌ జేబీఐఈటీలో పూర్తి చేశాను. ఢిల్లీలోని ఖాన్‌ స్టడీ గ్రూప్‌లో కోచింగ్‌ తీసుకున్నాను.

ఎన్నో ప్రయత్నంలో విజయం సాధించారు?

నాలుగో ప్రయత్నంలో ర్యాంక్‌ సాధించాను. 2016లో 732వ ర్యాంక్‌ వచ్చింది. ఉద్యోగానికి సెలవు పెట్టి రెండోసారి ప్రయత్నించగా ప్రిలిమ్స్‌ పాస్‌ కాలేదు. అయినా పట్టువిడవకుండా ప్రయత్నించగా మూడోసారి ఇంటర్వూ వరకు వచ్చాను. ఎలాగైనా ర్యాంక్‌ కొట్టాలని ప్రిపేరయ్యాను. నాలుగోసారి 244వ ర్యాంక్‌ సాధించాను.  

ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు అనుసరించిన వ్యూహం ఏమిటి?

ముందుగా సిలబస్‌ను బాగా అధ్యయనం చేశాను. తర్వాత ఏయే పుస్తకాలు చదవాలో నిర్ణయించుకున్నాను. ప్రిలిమ్స్‌కు విస్త్రృతంగా చదివాను. ప్రీవియస్‌ క్వశ్చన్‌ పేపర్స్‌ను ఫాలో కావాలి. దానికి మాక్‌టెస్ట్‌లను రాస్తూ ఎప్పటికప్పుడు పోగ్రాంను చూసుకోవాలి. మెయిన్స్‌ వచ్చే సరికి ఆన్సర్‌ రైటింగ్‌ చాలా కీలకపాత్ర వహిస్తుంది. స్టాటిక్‌ పార్ట్‌, డైనమిక్‌ పార్ట్‌ రెండింటిని అనుసంధానం చేసి చదవాలి. మంచి షార్ట్‌ నోట్స్‌ను తయారు చేసుకుని దానిని ఎప్పటికప్పుడు రివైజ్‌ చేయాలి. ఎక్కువ ఆన్సర్లు రాస్తే అంత నాణ్యత వస్తుంది. ఆన్సర్‌ రైటింగ్‌తో స్కిల్స్‌ మెరుగుపడుతాయి. వీటి కోసం ఏదో ఒక టెస్ట్‌ సిరీస్‌ను ఫాలో కావాలి. టాపర్స్‌ ఆన్సర్స్‌ చూసేవాడిని. మెయిన్స్‌ అనేది కొంచెం ఇంటెన్సివ్‌గా, స్పెషల్‌గా ఉన్న టాపిక్‌లను తీసుకుని వాటినే లోతుగా పరిశీలన చేసి ప్రిపేర్‌ కావాలి.

ఇంటర్వూలో ఏం అడిగారు?    

మనోజ్‌ సోనీ ప్యానెల్‌ బోర్డు ఇంటర్వ్యూ చేసింది. బయోడేటా ఫాంలో నింపిన విషయాలపైనే ఎక్కువగా ప్రశ్నలు అడిగారు. 

 • 10వ తరగతి చదివేటప్పుడు జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొన్నానని బయోడేటాలో రాశాను. దీంతో వారు కబడ్డీ గురించి అడిగారు. ప్రపంచ స్థాయిలో భారతదేశం కబడ్డీలో ఎలా రాణిస్తుందని, ఒలింపిక్స్‌లో కబడ్డీని చేర్చకపోవడానికి కారణం ఏమిటని అడిగారు. అంతేకాకుండా ప్రపంచంలో భారతదేశ స్థానం ఎలా ఉందని అడిగారు. 
 • హుజూర్‌నగర్‌లో అనేకసార్లు బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌లను నిర్వహించాను. దీంతో ఇండియాలో ఉన్న బ్లడ్‌ డొనేషన్‌ కొరత గురించి అనేక ప్రశ్నలు అడిగారు. 
 • హాబీ వచ్చేసి తెలుగు జానపద గేయాలు వినడం. జానపద గేయాలు ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం వింటుంటావా లేకపోతే గ్రామీణ నేపథ్యంలోని సారాన్ని తెలుసుకోవడానికి వింటుంటావా, సంస్కృతి గొప్పదనాన్ని తెలుసుకోవడానికి వింటావా అని అడిగారు. మా నాన్నది గ్రామీణ నేపథ్యం కావడంవల్ల జానపద గేయాలు వింటూ పెరిగాను. గ్రామీణ వాతావరణం ఆ పాటల్లో కండ్లకు కట్టినట్టుగా చెప్పడం బాగుటుంది. గోరటి వెంకన్న సాహిత్యం, పాటల గురించి వివరించాను. 
 • అస్పిరేషనల్‌ డిస్ట్రిక్ట్‌ అనే పథకాన్ని రెండేండ్ల క్రితం భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకానికి సంబంధించి తెలంగాణలో ఏయే జిల్లాలు ఎంపికయ్యాయియి? ఆ జిల్లాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది? హెల్త్‌, విద్య, అగ్రికల్చర్‌తో పాటు వివిధ పారామీటర్స్‌లలో ఎంత అభివృద్ధి చెందిందని అడిగారు. 
 • జ్యుడీషియల్‌ యాక్టివిజానికి, జ్యుడీషియల్‌ ఓవర్‌రీచ్‌కు తేడాలు ఏమిటో ఉదాహరణలు ఇవ్వమని అడిగారు.
 • డాటా సెక్యూరిటీ, డాటా ప్రైవసీకి సంబంధించి రెండు, మూడు ప్రశ్నలు అడిగారు.

సలహాలు, సూచనలు

సివిల్స్‌లో విజయం సాధించాలంటే విషయ పరిజ్ఞానం, మేథో సంపక్తి కన్నా చాలా ముఖ్యమైనవి క్రమశిక్షణ, ఓర్పు, సంకల్ప బలం. గెలవాలన్న తపన, గెలవగలనన్న నమ్మకంతో కష్టాన్ని ఇష్టపడుతూ ముందుకు సాగాలి. ప్రారంభంలో ప్రతిరోజు ఇంగ్లిష్‌ న్యూస్‌పేపర్లను చదువుతూ 6 నుంచి 12వ తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదివితే బేసిక్‌ అండర్‌స్టాండింగ్‌ వస్తుంది. దీంతో ప్రతి సబ్జెక్ట్‌కు ఒక స్టాండర్డ్‌ బుక్‌ తీసుకుని, ప్రీవియస్‌ క్వశ్చన్లను అనలైజ్‌ చేస్తూ, రైటింగ్‌ ప్రాక్టీస్‌ చేయాలి. విజయం సాధించాలంటే ఆరాటం లేని పోరాటం చేయాలి. తొందరపాటు పనికిరాదు. కేవలం మార్కుల కోసమే కాదు మార్పు కోసం చదవాలి. చదువు కేవలం ఉద్యోగాన్ని సంపాదించడానికే కాదు వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడాలి. దేశ దిశను నిర్దేశించేదిగా ఉండాలి. జీవితంలో లక్ష్యం లేకపోతే ఇతరుల లక్ష్యం కోసం మనం పనిచేయాల్సి ఉంటుంది. అందుకే మంచి లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దానిని సాధించడానికి కృషి చేయాలి.

...? కామళ్ల క్రాంతికుమార్‌,హుజూర్‌నగర్‌

ఆరోసారి సాధించాను

ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో సక్సెస్‌ అయ్యాడు శీతల్‌కుమార్‌. ఓ సామాన్య దర్జీ కుటుంబంలో పుట్టిన అతడు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి ఆరోసారి 417వ ర్యాంకు సాధించాడు. సివిల్స్‌ లక్ష్యసాధనలో అనుసరించిన వ్యూహం.. ప్రిపరేషన్‌ విధానం.. ఇంటర్యూ జరిగిన తీరు తదితర అంశాలపై నిపుణతో పంచుకున్న విశేషాలు..

విద్యాభ్యాసం, కుటుంబనేపథ్యం ఏంటి?

నల్లగొండలోని క్రాంతినగర్‌ మా స్వస్థలం. నాన్న రేణుకుంట్ల నరేందర్‌ టైలర్‌. అమ్మ సుజాత టైలరింగ్‌ మెటీరియల్‌ విక్రయిస్తుంది. అక్క సింధూర ఎస్‌బీఐలో ఉద్యోగి. బావ నాగరాజు డివిజనల్‌ ఇంజినీర్‌. మమ్మల్ని బాగా చదివించాలని అమ్మానాన్నలు బాగా కష్టపడేవారు. వారి కష్టాన్ని చూసి కష్టపడి చదివాం. ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చదివాను. ఎంటెక్‌ కూడా పూర్తి చేశాను. బీటెక్‌లో ఎన్‌సీసీలో జాయినయ్యా. అక్కడే తొలిసారిగా సోషల్‌ యాక్టివిటీ గురించి అవగాహన ఏర్పడింది. సేవ చేయాలంటే ఏదైనా పబ్లిక్‌ రంగం ఉద్యోగంవైపు వెళ్లాలని భావించాను. అందుకు సివిల్స్‌ సాధించాలని ఫ్రెండ్స్‌ ద్వారా తెలుసుకున్నా. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ పూర్తికాగానే తొలిసారిగా 2014లో సివిల్స్‌కు హాజరయ్యాను. అప్పుడు ఫలితం రాకపోయినా.. సివిల్స్‌ అంటే ఏంటి? ఎలా ప్రిపేర్‌ కావాలి? లాంటి విషయాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడింది.

ఎన్నో ప్రయత్నంలో విజయం సాధించారు.? పొరపాట్లను ఎలా సరిదిద్దుకున్నారు?

ఇది ఆరో ప్రయత్నం. 417వ ర్యాంకు సాధించాను. ఈ ర్యాంకుతో ఐపీఎస్‌ గ్యారంటీ. ఐఏఎస్‌కు చాన్స్‌ ఉండవచ్చని భావిస్తున్నా. 2016లో ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. అక్కడి నుంచి వెనుదిరిగా. ఇంటర్వ్యూ వరకు వెళ్లడంతో నాలో విశ్వాసం పెరిగింది. ఇంకా కష్టపడితే ర్యాంకు కొట్టవచ్చని కుటుంబసభ్యులంతా ఎంకరేజ్‌ చేశారు. దీంతో 2017, 2018ల్లోనూ రాశాను. కానీ నిరాశే మిగిలింది. 2019 అటెంప్ట్‌ చివరిదనుకుని ప్రిపేరయ్యాను. రోజుకు పది గంటల వరకు కష్టపడి చదివా. గతంలో చేసిన పొరపాట్లను గుర్తించాను. అవి పునరావృతం కాకుండా ప్రిపేరయ్యాను. చివరికి సక్సెస్‌ అయ్యాను. 

ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు అనుసరించిన వ్యూహ?

2014లో తొలిసారిగా పరీక్షకు హాజరైనప్పుడు హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌లో కోచింగ్‌ తీసుకున్నా. దీంతో సివిల్స్‌ స్టడీ మెటీరియల్‌, పరీక్షా విధానంపై అవగాహన ఏర్పడింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు కోచింగ్‌కు వెళ్లలేదు. సొంతంగానే నోట్స్‌ తయారు చేసుకుని వాటినే ఒకటికి రెండుసార్లు చదివాను. ప్రతిరోజు రెండు ఇంగ్లిష్‌ న్యూస్‌పేపర్లు చదివేవాడిని. పలు అంశాల్లో విషయ పరిజ్ఞానం కోసం రాజ్యసభ టీవీని చూసేవాడిని. ఆలిండియా రేడియో న్యూస్‌ను ఫాలో అయ్యాను. జనరల్‌ మెటీరియల్‌ను చదివా.. గత క్వశ్చన్‌ పేపర్లను ప్రాక్టీస్‌ చేశా. ఇగ్నోలో చేసిన ఎంఏ పొలిటికల్‌ అడ్మినిస్ట్రేషన్‌ సబ్జెక్టు బాగా ఉపయోగపడింది. నా ఆప్షనల్‌గా కూడా దాన్నే ఎంచుకున్నా. ఈ ఏడాది పూర్తిగా వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లాంటి సోషల్‌ మీడియా టూల్స్‌కు దూరంగా ఉన్నా. ఏడాది పాటు కుటుంబానికి దూరంగా ఢిల్లీలో ఉండి సొంతంగా ప్రిపేరయ్యి సక్సెస్‌ అయ్యాను. హైదరాబాద్‌కు చెందిన తేజ్‌దీపక్‌తో కలిసి ప్రిపేరయ్యాను. ప్రతిదీ షేర్‌ చేసుకునేవాళ్లం. తేజ్‌ దీపక్‌ కూడా 279వ ర్యాంకు సాధించాడు.  

ఇంటర్వ్యూలో ఏం అడిగారు?

పీకే జోషి బోర్డు ఇంటర్వ్యూ చేసింది. ఎక్కువగా నేను పుట్టి పెరిగిన ఏరియా గురించి అడిగారు. అమ్మమ్మ ఊరైన జనగామ, అదేవిధంగా పెరిగి నల్లగొండ ప్రాంత ప్రత్యేకతలు, సమస్యల గురించి అడిగారు. అదేవిధంగా మా ఫ్యామిలీ నేపథ్యాన్ని బేస్‌ చేసుకుని కొన్ని ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో ప్రధాన ఐదు సమస్యలు ఏంటని కూడా ప్రశ్నించారు. వీటికి సమాధానం ఇచ్చేందుకు నా ఆప్షనల్‌ పబ్లిక్‌ అడ్రినిస్ట్రేషన్‌ బాగా ఉపయోగపడింది.  

కోచింగ్‌ లేకుండా ప్రిపేర్‌కావచ్చా? 

కోచింగ్‌ తీసుకోవాలా వద్దా అనేది ప్రిపేరయ్యే అభ్యర్థుల కాన్ఫిడెన్స్‌ స్థాయిని బట్టి ఉంటుంది. తొలిసారిగా 2014లో సివిల్స్‌ రాయడం కోసం హైదరాబాద్‌లో పదినెలల పాటు కోచింగ్‌ తీసుకున్నాను. దీంతో స్టడీ మెటీరియల్‌, పరీక్షా విధానం, ప్రిపరేషన్‌ వ్యూహంపై అవగాహన ఏర్పడింది. ఆ తర్వాత కోచింగ్‌వైపు చూడలేదు. సొంతంగానే నోట్స్‌ తయారు చేసుకుని దాన్నే చదివాను. ప్రిపేరయ్యేవాళ్ల బ్యాగ్రౌండ్‌ను బట్టి ఎవరికి వారే నిర్ణయం తీసుకోవాలి. సామాన్య కుటుంబ నేపథ్యం ఉంటే సివిల్స్‌పై ప్రారంభంలో అంత అవగాహన, గైడెన్స్‌ ఉండదు. అవగాహన కోసం కోచింగ్‌ ఉపయోగపడుతది.   

సివిల్స్‌ రాయలనుకునేవారికి మీరిచ్చే సూచనలు, సలహాలు?

సివిల్స్‌ గోల్‌గా పెట్టుకోవాలంటే ముందుగా దానిపై పూర్తి అవగాహన పొందాలి. స్టడీ మెటీరియల్‌, ఎగ్జామ్‌ విధానం తెలుసుకోవాలి. గట్టి పట్టుదల ఉండాలి. సివిల్స్‌ సాధించాలంటే కుటుంబానికి, స్నేహితులకు, సోషల్‌ మీడియాకు కొంతకాలం దూరం కావాలి. లేచినా పడుకున్నా.. ఒక్కటే టార్గెట్‌ చేసుకోవాలి. ఒకేసారి రాకపోవచ్చు. ఓపికతో ప్రిపేరయ్యే శక్తి ఉండాలి. కొన్నిసార్లు మానసికంగా బలహీనం అవుతాం. మళ్లీ సిద్ధం కాగలగాలి. పక్కా ప్రణాళికతోపాటు అవసరమైతే సుదీర్ఘ ప్రయత్నం తప్పనిసరి. మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మనకు అనుకూలంగా మల్చుకునే శక్తిని సాధించాలి. ప్రతి విషయాన్ని అనాలసిస్‌ చేస్తూ పట్టు సాధించాలి. మొత్తంగా ప్రిపరేషన్‌కు కుటుంబసభ్యుల సంపూర్ణ సహకారం కూడా తోడవ్వాలి.  

...? మర్రి మహేందర్‌రెడ్డి,నల్లగొండ ప్రతినిధి


logo