Zaheerabad | జహీరాబాద్, ఫిబ్రవరి 9 : మున్సిపాలిటీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ వార్డులోని ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారు.. ఎవరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని ఆరా తీస్తూ వారిని ప్రసన్నం చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కో ఓటు కీలకం కానుంది. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు ఒక్కో ఓటు కోసం పడరాని పాట్లు పడుతున్నారు.
అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో ప్రతీ ఓటు తమకే పడేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఓటరు జాబితాలో నమోదైన ఓటర్ల ఇంటింటికి అభ్యర్థులు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగాలు, ఉపాధి రీత్యా ఇతర పట్టణాలకు ప్రాంతాలకు వలస వెళ్లిన పట్టణ ఓటర్లను రప్పించేందుకు అభ్యర్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటరు జాబితాలో నమోదై స్థానికంగా ఉండని వారిని తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ మద్దతుదారులు ఎవరెవరు ఎక్కడ ఉన్నారనే వివరాలను సేకరించి వారితో రోజుకు ఒకసారైన మాట్లాడుతూ తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఎక్కువ మంది ఓటర్లు ఉంటే వారి వద్దకు తమ సన్నిహితులను పంపిస్తున్నారు. ఎన్నికల్లో తమకు ఓటు వేసే విధంగా వ్యక్తి గతంగా ముఖముఖీగా మాట్లాడిస్తున్నారు. ముగ్గురు, నలుగురు, అంతకంటే ఎక్కువ మంది ఓటర్లు ఉంటే ప్రత్యేక వాహనాలు సమకుర్చేందుకు సిద్ధవుతున్నారు. ఒకరిద్దరు ఓటర్లు ఉన్నా వారు కోరితే వాహన సదుపాయం కల్పిస్తామని, లేదంటే రాకపోకలకు రవాణా ఖర్చులతో పాటు ఇతర ఖర్చులు ముందుగానే అందిస్తామని చెబుతున్నారు. ఆలస్యం చేస్తే తమ పోటీదారులు వలస ఓటర్ల నుంచి ఎక్కడ మాట తీసుకుంటారోనని అప్రమత్తమవుతున్నారు. దీంతో ఎవరికివారు ముందుగానే వలస ఓటర్లను సంప్రదించి మాట తీసుకుంటున్నారు. వాహన సదుపాయం కల్పించిన రవాణా ఖర్చులు అందజేసిన వలస ఓటర్లతో రోజు మాట్లాడే బాధ్యత తమకు సన్నిహితంగా ఉండే వారికి అభ్యర్థులు అప్పగించారు.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు రెండే రోజులే ఉండడంతో గెలుపే లక్ష్యంగా ఓటర్లను తమ వైపు తీప్పుకునేలా పలువురు అభ్యర్థులు హామీలతో పాటు ఆఫర్లు ఇస్తున్నారు. గంపగుత్త ఓట్లను రాబట్టేందుకు కులసంఘాలకు భారీగా తాయిలాలతో గాలం వేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పట్టణాల్లో ఓటర్లు వివిధ పనులో బీజిగా ఉంటుండడంతో అభ్యర్థులు తెల్లవారగానే ఓటర్ల ఇళ్లకు అభ్యర్థులు తమ అనుచరగణంతో కాలనీల్లోని పలువురి ఇళ్లకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వాహనాల్లో ఆయా వార్డుల్లో ప్రధాన వీధుల్లో పర్యటిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థుల గుర్తులతో కూడిన కరపత్రాలను ఓటర్లకు అందిస్తూ తమకే ఓటు వేయాలని ప్రాధేయపడుతున్నారు. జహీరాబాద్ మున్సిపాలిటీలో పరిధిలో 37వార్డులు ఉండగా 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 78,889 మంది ఓటర్లు ఉన్నారు. ఈనెల 11వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ దేవుళ్ళు ఓటు వేసి ఎవరిని గెలిపిస్తారో వేచి చూడాల్సిందే.