Bollywood Stars | ముంబై వేదికగా నిర్వహించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాల్లో బాలీవుడ్ ప్రముఖులు పాల్గొనడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రాజకీయ, సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండే పలువురు సినీ తారలు ఈ వేడుకలకు హాజరవ్వడంతో వారి వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ముంబైలోని వర్లీలో ఉన్న నెహ్రూ సెంటర్లో “100 ఇయర్స్ ఆఫ్ సంఘ్ జర్నీ: న్యూ హారిజాన్స్” పేరుతో రెండు రోజుల పాటు ఈ ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్ మోహన్ భగవత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ్ సిద్ధాంతాలు, దేశాభివృద్ధిలో సంస్థ పాత్ర, భవిష్యత్ దిశపై చర్చలు సాగాయి.
ఈ వేడుకలకు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోలు, నటీమణులు, దర్శకులు, నిర్మాతలు పెద్ద ఎత్తున హాజరుకావడం విశేషంగా నిలిచింది. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, జాకీ ష్రాఫ్ వంటి నటులు వేడుకల్లో కనిపించగా, హేమ మాలిని, రవీనా టాండన్, శిల్పా శెట్టి, అనన్యా పాండే, పూనమ్ ధిల్లాన్, రూపాలి గంగూలీ వంటి నటీమణులు కూడా పాల్గొన్నారు.దర్శక–నిర్మాతల విభాగంలో కరణ్ జోహార్, సుభాష్ ఘయ్, మాధుర్ భండార్కర్, నితీష్ తివారీ, ఓం రౌత్, ఆనంద్ ఎల్ రాయ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. గాయకుడు అద్నాన్ సమీ, సంగీత దర్శకుడు ప్రీతమ్, గేయ రచయిత ప్రసూన్ జోషి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రెండు రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాల్లో కొందరు శనివారం, మరికొందరు ఆదివారం పాల్గొంటూ సంఘ్ నేతలతో వివిధ సామాజిక అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా మోహన్ భగవత్ ప్రసంగాన్ని బాలీవుడ్ ప్రముఖులు ఆసక్తిగా వినడం ఆకర్షణగా నిలిచింది.సినీ రంగానికి చెందిన ఇంతమంది ప్రముఖులు ఒకే వేదికపై ఆర్ఎస్ఎస్ శతాబ్ది కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి కావడంతో విశ్లేషకులు దీన్ని ప్రత్యేక పరిణామంగా భావిస్తున్నారు. సాధారణంగా వివాదాస్పద అంశాల నుంచి దూరంగా ఉండే సినీ తారలు దేశ సంస్కృతి, విలువలపై జరుగుతున్న చర్చలో భాగస్వామ్యం కావడం ఒక సంకేతంగా రాజకీయ, సామాజిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ వంటి తారల హాజరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సంఘ్ వందేళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ నిర్వహించిన ఈ వేడుకలు ముంబై సినీ పరిశ్రమతో సంఘ్‌కు ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేశాయని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.