‘అభివృద్ధి’ అనే అంశం రాజకీయాలకతీతంగా, నిరంతరంగా కొనసాగాల్సిన ప్రక్రియ. అది కొరవడినప్పుడు ప్రజలు పరాజితులుగానే మిగిలిపోతారు. ఈ సత్యాన్ని గుర్తించింది కాబట్టే గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో విప్లవాత్మక విజయాలను సాధించింది. అందులో భాగంగానే యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)ను నిర్మించింది. ఇది దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కేసీఆర్ హయాంలో 90 శాతం పూర్తికాగా ఇప్పుడు వినియోగంలోకి వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు విద్యుత్తును వినియోగించుకోనున్నారు. ఇది శుభపరిణామం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకున్నట్టుగా ప్రస్తుత ప్రభుత్వం నిర్వహిస్తే రాబోయే వేసవికాలంలో విద్యుత్తుకు కొరత ఉండదు. చూద్దాం… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను విజేతలుగా నిలుపుతుందో లేదా పరాజితులుగా చరిత్ర పుటల్లోకెక్కిస్తుందో…!
2035 నాటికి తెలంగాణ రాష్ట్రం 31,891 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్‌తో విద్యుత్తు వినియోగంలో అతిపెద్ద రాష్ట్రంగా ఆవిర్భవించనున్నదని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇటీవలి తన నివేదికలో పేర్కొన్నది. దక్కన్ పీఠభూమిలో భౌగోళికంగా కీలకమైన తెలంగాణలో అభివృద్ధి శరవేగంతో కొనసాగుతుండటమే అందుకు ప్రధాన కారణం. తెలంగాణ రాష్ట్రం అవతరించిన 2014, జూన్ 2 నాటికి కేవలం 6,667 మెగావాట్ల డిమాండ్ ఉండగా తదనంతర దశాబ్ద కాలంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాల మూలంగా ప్రస్తుత రాష్ట్ర విద్యుత్తు డిమాండ్ 15,856 మెగావాట్లుగా ఇటీవల నమోదైంది. రాబోయే వేసవికాలంలో డిమాండ్ 18 వేల మెగావాట్లకు చేరుకోవచ్చని ఒక అంచనా.
రాష్ట్ర అవతరణ తర్వాత విద్యుత్తు రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ఉత్పత్తి, రవాణా, పంపిణీ రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించడం గమనించవచ్చు. దేశంలోనే అన్నివర్గాల వినియోగదారులకు వాణిజ్య, పారిశ్రామిక, గృహ వాడకందారులకే కాకుండా వ్యవసాయ రంగానికీ 24 గంటల నిరంతర విద్యుత్తును అందించడం అద్భుతమైన ముందడుగు. వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్ది, పారిశ్రామిక, ఐటీ, ఫార్మా, వాణిజ్య, సైన్స్ తదితర రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంలో భాగం గా విద్యుత్తు రంగాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రచించి, నిధులు కేటాయించి అభివృద్ధి పథాన నడపడంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కృతకృత్యులయ్యారు. అందులో భాగంగానే 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, 800 మెగావాట్ల కొత్తగూడెం ఏడవ స్టేజీ ప్లాంటు, 800 మెగావాట్ల కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులను పేర్కొనవచ్చు. యాదాద్రి ప్రాజెక్టును ఒకే స్థలంలో నిర్మించింది. ఇది దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్ భాగస్వామ్యంతో నిర్మితమవుతున్న వైటీపీఎస్ నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉండటం, బీహెచ్ఈఎల్కు నామినేషన్ పద్ధతిలో కేటాయించడం తదితర కారణాల రీత్యా రాబోయే కాలంలో ప్రజలకు గుదిబండగా మారనున్నదని ఆరోపిస్తూ ప్రస్తుత ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది.
నల్లగొండ జిల్లా దామరచర్లలో సుమారు 4,676 ఎకరాల సువిశాల ప్రదేశంలో 25099.42 కోట్ల అంచనాలతో ఐదు 800 మెగావాట్ల యూనిట్లు నెలకొల్పడానికి సంకల్పించగా, రెండో యూనిట్ 2025, జనవరి 25 నాడు వాణిజ్య కార్యకలాపాలతో పూర్తిస్థాయిలో పనిచేస్తున్నది. మొదటి యూనిట్ ఇప్పటికే సింక్రనైజేషన్ ప్రక్రియను పూర్తిచేసుకొని, వచ్చే మార్చిలో పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానున్నది. పనులన్నీ అనుకున్న ప్రకారం వేగవంతంగా పూర్తి చేసుకున్నట్టయితే మిగతా మూడు యూనిట్లు 2,400 మెగావాట్ల పూర్తి సామర్థ్యం విద్యుత్తు 2026 మార్చి నాటికి ప్రజలకు అందుబాటులోకి రావచ్చు.
అంతేకాకుండా గత ప్రభుత్వం విద్యుత్తు రంగానికి విశేషమైన ప్రాధాన్యమిచ్చి అప్పటికే వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటును కేటీపీపీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి 2016, జనవరిలో వాణిజ్య కార్యకలాపాల దిశగా పూర్తిస్థాయిలో సింక్రనైజేషన్ చేసింది. ఈ ప్లాంటుతో పాటు నిర్మాణ పనులు ప్రారంభించుకున్న రాయలసీమ థర్మ ల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)పూర్తికావడానికి 2018, డిసెంబర్ వరకు వేచి చూడాల్సి వచ్చింది. కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ)కు సంబంధించిన బాయిలర్, టర్బైన్, జనరేటర్ పనులు బీహెచ్ఈఎల్ చేయగా బ్యాలెన్స్ పనులు చేయాల్సిన కాంట్రాక్టర్లతో ఉన్న పేచీలన్నింటినీ పరిష్కరించి పనులు పూర్తవడానికి నాటి ప్రభుత్వం, యాజమాన్యం విశేష కృషి చేసింది.
కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏడవ దశ 800 మెగావాట్లు దేశంలో రికార్డు సమయంలో పనులు పూర్తిచేసుకొని ఉత్పత్తి ప్రారంభించడం విద్యుత్తు రంగంలోనే సంచలనం. 60 నెలల కాలపరిమితి ఉండగా, కేవలం 48 నెలల సమయంలోనే సీవోడీ పూర్తిచేసుకోవడం తెలంగాణ జెన్కో సాధించిన అపూర్వ విజయం. ఇదిలా ఉంటే 2025, ఫిబ్రవరి 13 నాడు తెలంగాణ జెన్కో రామగుండంలో 800 మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మాణానికి డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)ను ఆమోదించింది. రామగుండంలో 62.5 మెగావాట్ల విద్యుత్తు కేంద్రం (బీస్టేషన్) కాలం చెల్లడంతో గత సంవత్సరం మూసివేశారు. అదే స్థలంలో కొత్తగా 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్నారు. పాత స్టేషన్‌కు సంబంధించిన మూడు వందల ఎకరాలు అందుబాటులో ఉండటంతో అక్కడి సింగరేణి అనుకున్న ప్రతిపాదిత ప్లాంట్‌ను కేవలం జెన్కో ఆధ్వర్యంలోనే నిర్మించడానికి నిర్ణయించారు. ఆమోదించిన డీపీఆర్ ప్రకారం 800 మెగావాట్ల ప్రతిపాదిత ప్లాంటుకు రూ.13,331 కోట్లు ఖర్చవుతాయనే అంచనాలున్నాయి. అంటే ప్రతీ మెగావాట్‌కు రూ.16.60 కోట్లు అన్న మాట. దేశంలోనే ఇంత వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు లేకపోగా అంచనా వ్యయం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పోల్చిచూసినప్పుడు చాలా ఎక్కువగా ఉన్నదని నిపుణుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదిత థర్మల్ కేంద్రం చేపట్టడానికి ప్రభుత్వం అంగీకరించిన పక్షంలో యూనిట్ కరెంట్ ధర రూ.8.18 పైసలుగా డీపీఆర్‌లో పేర్కొనగా, ఉత్పత్తి ప్రారంభమయ్యే నాటికి రూ. 9 నుంచి 10 వరకు చేరుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. కోల్ లింకేజీని డొమెస్టిక్ దేశీయ బొగ్గుగా పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ చేపట్టిన థర్మల్ కేంద్రాల పెట్టుబడి వ్యయం, యూనిట్ వ్యయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఏపీ విభజన చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ రామగుండంలో నిర్మిస్తున్న స్థాపిత వ్యయం రూ.29,345 కోట్లు. ఇటీవల గ్లోబల్ టెండర్లు పిలిచిన ఈ థర్మల్ కేంద్రం ఉత్పత్తి వ్యయం మెగావాటుకు రూ.12.23 కోట్లు. గత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వైటీపీఎస్ ఉత్పత్తి వ్యయం మొదటి రెండు యూనిట్లు పూర్తయ్యేసరికి మెగావాట్‌కు రూ.8.63 కోట్లుగా ఉన్నది. మిగతా యూనిట్లు పూర్తయ్యేనాటికి మెగావాటు ఉత్పత్తి వ్యయం సుమారు 9 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. కాగా, యూనిట్ కరెంటు ధర ప్రభుత్వ వర్గాల ప్రకారం రూ.6.35 పైసలు. అదే సమయంలో సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించే నాటికి మెగావాట్‌కు రూ.9.74 కోట్లు. ఏటా తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు, డిమాండ్ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో డిమాండ్‌కు అనుగుణంగా ప్రాజెక్టులను పూర్తిచేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
ఝార్ఖండ్ విద్యుత్తు వితరణ్ నిగం లిమిటెడ్ (జేబీవీఎల్), నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేష న్ లిమిటెడ్ (ఎన్టీపీసీ)లు సంయుక్తంగా 20 17లో ప్రారంభించిన పత్రాతు (PATRA TU) థర్మల్ విద్యుత్తు కేంద్రాల పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. వాటితో పాటు ప్రారంభించిన వైటీపీఎస్ రెండు యూనిట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. గత కొంతకాలం గా నత్తనడకన సాగుతున్న వైటీపీఎస్ బ్యాలెన్స్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తే రోజుకు సుమారు 96 మిలియన్ యూనిట్ల విద్యుత్తు తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ‘అభివృద్ధి’ అనే అంశం రాజకీయాలకు అతీతంగా నిరంతరం కొనసాగాల్సిన ప్రక్రియ. అది కొరవడినప్పుడు ప్రజలు పరాజితులుగానే మిగిలిపోతారు.
యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు కేంద్రాల నిర్మాణాల్లో తీవ్ర జాప్యం జరగడం, టెండర్లను అధిక రేట్లకు ఇవ్వడంతో రానున్న 25 ఏండ్లలో రాష్ట్ర ప్రజలపై రూ.14,140 కోట్ల అదనపు భారం పడనున్నదని ఇటీవల ప్రభుత్వం పేర్కొన్నది. ఇందులో రూ.9,697 కోట్లు యాదాద్రి భారంగా చెప్పుకొచ్చారు. మెగావాట్‌కు రూ.8.63 కోట్ల వ్యయమవుతున్న యాదాద్రి ప్రాజెక్టు వల్ల సుమారు 10 వేల కోట్ల భారం ప్రజల మీద పడనున్నప్పుడు మెగావాట్‌కు రూ.16.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రామగుండం థర్మల్ ప్లాంట్ వల్ల ఎంత నష్టం జరుగనున్నదో ఆలోచించాలి. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు సంబంధించిన 320 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ జనరేటర్ కాలిపోయి 8 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు పునరుద్ధరించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యంగానే పరిగణించవచ్చు. దీనివల్ల డిమాండ్ ముంచుకొస్తున్న ప్రస్తుత తరుణంలో రోజుకు సుమారు 6.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తిని కోల్పోతున్నాం.
– తుల్జారాం సింగ్ ఠాకూర్ 78930 05313