e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News దేవుడి దయ.. కేసీఆర్‌ సంకల్పం!

దేవుడి దయ.. కేసీఆర్‌ సంకల్పం!

  • సువర్ణ మణిమయ సువిశాల ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగా యాదాద్రి
  • మన కండ్లముందు ఆవిష్కారమవుతున్న మహా అద్భుత నిర్మాణం
  • 2,500 గజాల నుంచి నాలుగు ఎకరాలకు ప్రధానాలయ విస్తరణ
  • రోజుకు 50 లక్షల లడ్డూలు.. పులిహోర తయారీకి ఆధునిక పోటు
  • ‘నమస్తే తెలంగాణ’తో.. వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 21 (నమస్తే తెలంగాణ): కేవలం 2,500 గజాల స్థలంలో చిన్నగా ఉన్న దేవాలయం. 3.30 ఎకరాలకు విస్తరించాలి. గర్భాలయానికి అంగుళం కూడా విఘాతం కలుగకూడదు. స్వయంభువైన స్వామికి ఆగమపరంగా ఎలాంటి అపరాధం జరుగకూడదు. శాస్ర్తోల్లంఘన ఎట్టి పరిస్థితుల్లో కావొద్దు.. కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతినరాదు.. కానీ ప్రధాన ఆలయ ప్రాంగణాన్ని విస్తరించాలి. విశాలం చేయాలి. అశేష భక్త జనావళికి సౌకర్యంగా.. అపురూపంగా, అద్భుతంగా ఆలయాన్ని పునరావిష్కారం చేయడం అంటే మాటలు కావు. ఒక రాయలు.. ఒక భోజుడు.. ఒక విక్రమార్కుడు.. మరొక రాజరాజ చోళుడు అద్భుత ఆలయాల నిర్మాణం కావించారు. కానీ.. యాదాద్రి.. అప్పటికే వేల సంవత్సరాలుగా కోట్లమంది భక్తులను అనుగ్రహిస్తున్న దివ్యక్షేత్రం. అలాంటి ఆలయాన్ని పునర్నిర్మించడమన్నది బహుశా మన కాలంలో ఎవరూ చేయ తలపెట్టని సాహసం. ఆ బృహత్కార్యానికి పైన నారసింహుడు ఆశీస్సులందించాడు.. కింద ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించారు.. వైటీడీఏ వైస్‌ చైర్మన్‌గా జీ కిషన్‌రావు అమలుచేశారు. ఆయన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో తన అనుభవాలను నమస్తే తెలంగాణ’తో పంచుకొన్నారు.

వివిధ విభాగాలను వైటీడీఏ ఎలా సమన్వయం చేసింది?
యాదాద్రి పునర్నిర్మాణం సున్నితమైన, కఠినతరమైన అంశం. ఈ పనిలో యాదాద్రి టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వైటీడీఏ) ఇది ఒక ఛత్రంలా పనిచేసింది. ఓపిక, సహనం ఉన్న వ్యక్తి ఎవరు అని విచారించి (నవ్వుతూ) నాకు వైటీడీఏ వైస్‌ చైర్మన్‌గా సీఎం అవకాశమిచ్చారు. సీఎం మార్గదర్శనంలో నిధులు ఖర్చు పెడుతూ.. ఎప్పటికప్పుడు ప్రభుత్వ అనుమతి తీసుకుంటూ.. చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తూ.. ఎక్కడా, ఎవరికీ ఇబ్బంది కలుగకుండా, అన్ని రకాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని.. నాణ్యతతో పనులు పూర్తిచేయడం వైటీడీఏ వల్లే సాధ్యమయ్యింది. ఇది లేకపోతే.. ఒక్కొక్క పనికి ఒక్కొక్క శాఖతో, విభాగంతో, అధికారితో, పండితులతో, పనిచేసే వారితో సమన్వయం చేయడం సాధ్యమయ్యేదే కాదు.

- Advertisement -

ఆలయ పునర్నిర్మాణానికి ఎంత ఖర్చు అయ్యింది?
ప్రభుత్వం నుంచి రూ.1,000 కోట్ల నిధులు వచ్చాయి. ప్రధానమైన ఆలయం నిర్మాణానికి సుమారు రూ.280 కోట్లే ఖర్చయ్యింది. ఆలయం చుట్టూ వసతుల కల్పనకే ఎక్కువ ఖర్చు అయ్యింది. భూసేకరణ, రోడ్లు, గ్రీనరీ, పార్కులు, లైటింగ్‌, నీటి వసతి, విద్యుత్తు.. ఇలా అనేకం చేయాల్సి వచ్చింది. మేము వేసుకొన్న ప్రణాళిక ప్రకారం వందశాతం పూర్తికావాలంటే మరో రూ.300 నుంచి రూ.400 కోట్లు ఖర్చు అవుతుంది.

పునర్నిర్మాణానికి ఎంతకాలం పట్టింది?
బాలాలయానికి ప్రధాన ఆలయాన్ని తరలించింది 2016 ఏప్రిల్‌ 21న అయితే.. మొదటి పిల్లర్‌ వేసింది మాత్రం 11.10.2016 నాడు. అంటే 2016 ఏప్రిల్‌ నుంచి పనులు ప్రారంభమయ్యాయి. కానీ ఈ ప్రాజెక్టుకు ఫౌండేషన్‌ వేసింది మాత్రం 2015 మేలో. ఒక్కో పనిచేసుకుంటూ.. పునః ప్రారంభం చేపట్టడానికి ఇంతకాలం పట్టింది. ఇదికూడా నిరంతరం శ్రమిస్తేనే. యాదాద్రి ఆలయం ఎలా ఉండనున్నది అంటే.. అద్భుతమని మాత్రం చెప్పక తప్పదు. ఇదంతా ఒక యజ్ఞంలా పూర్తిచేశాం. గతంలో ఏటా ఆలయానికి రూ.60 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. ఇప్పుడు (బాలాలయంలో) రూ.100 కోట్ల వరకు వస్తున్నది. భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. గతం లో వారాంతంలో రోజుకు 5 వేల మంది వరకు దర్శించుకొనేవారు. ఇప్పుడు శని, ఆది వారాల్లో సుమారు 25 వేల నుంచి 30 వేల మంది వస్తున్నారు. పునఃప్రారంభం తర్వాత ఇది రోజుకు 50 వేల వరకు ఉంటుందని అంచనా.

స్వామివారి నైవేద్యం, భక్తులకు ప్రసాదం తయారీకి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?
మెకనైజ్డ్‌ లడ్డూ, పులిహోర తయారీ యంత్రాన్ని ఏర్పాటుచేశాం. రోజుకు 50 లక్షల వరకు లడ్డూలు, పులిహోరను సిద్ధం చేయవచ్చు. ఈ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశమున్నది. యాదగిరి నరసింహస్వామి లడ్డూ ప్రత్యేకత.. రంగు, రుచి, సువాసనలు అలాగే ఉంటాయి. దీని నాణ్యతను కూడా థర్డ్‌పార్టీతో పరిశీలిస్తాం.

ఇంతటి కార్యంలో భాగస్వామ్యం కావడంలో మీ అనుభూతి ఏమిటి?
ఇదంతా భగవంతుడి దయ. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన అవకాశం. చాలా సంతోషంగా ఉన్నది.

పునర్నిర్మాణంలో శిల్పాలు, వినియోగించిన రాయి విశిష్టత ఏమిటి?
సుమారు లక్షకు పైగా టన్నుల కృష్ణ శిలలను ప్రకాశం జిల్లా గురిజేపల్లి నుంచి తెప్పించాం. ఆలయ నిర్మాణం పటిష్ఠంగా, దృఢంగా ఉంచాలంటే.. పాత కాలంనాటి డంగు సున్నం కావాలి. దీని తయారీకి కావాల్సిన లైమ్‌స్టోన్‌ను పిడుగురాళ్ళ నుంచి తెప్పించాం. దీనిని 1:1 నిష్పత్తిలో ఇసుకతో కలిపి.. ఆపై కరక్కాయ, బెల్లం, నీటితో కలిపి గానుగ (మిక్సింగ్‌) ఆడించేవారు. ఈ డంగు సున్నం నాణ్యతను బెంగళూరుకు చెందిన బ్యూరో వెరిటాస్‌ (ఇండియా) సంస్థ నిపుణులు తనిఖీ చేసేవారు. కృష్ణ శిలల నాణ్యత, నిర్మాణంలో నాణ్యతను పరిశీలించేందుకు థర్డ్‌పార్టీని ఏర్పాటుచేశాం. లైటింగ్‌ అనేది ఆలయానికి హైలైట్‌. బెంగళూరుకు చెందిన ‘క్రియేటివ్‌ లైటింగ్స్‌’ వారు దీనిని చేపట్టారు. మన పెంబర్తి కళాకారులు 108 బంగారు కలశాలను తయారుచేస్తున్నారు. వాటికి కాపర్‌ కోటింగ్‌ చేస్తారు. దానిపై తమిళనాడు నుంచి వచ్చిన కళాకారులు బంగారు తాపడం చేస్తారు. నారవేపతో నిర్మిస్తున్న ధ్వజస్థంభం 36 అడుగుల పొడవు ఉంటుంది. అలాగే కలపతో చేసిన అతి పెద్ద తలుపు పొడవుకూడా 36 అడుగులుంటుంది. దీనిని హైదరాబాద్‌లో చేయించాం.

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే అపూర్వ అవకాశం మీకు లభించింది. మీ అనుభవాలేమిటి?
సూటిగా చెప్పాలంటే రెండే రెండు అంశాలు ఇందులో కీలకమైనవి. ఒకటి పైన దేవుడి దయ.. తన ఆలయాన్ని పునర్నిర్మించాలని ఆ స్వామి అనుకొన్నారు. అందుకు ఎలాంటి విఘ్నాలు కలుగకుండా చూసుకొన్నారు. అనుకున్న పని అనుకున్నట్టుగా జరిగేలా.. చరిత్రలో నిలిచి పోయేలా చేసేందుకు కావాల్సిన ఆలోచనలను కలిగించారు. అనుగ్రహించారు. ఇక రెండోది.. కింద ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆ స్వామి ఆశీస్సులతో ఈ బృహత్కార్యానికి సంకల్పించారు. ఎంతో ప్రాముఖ్యమున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించాలని, భవిష్యత్తు తరాలకు మంచి ఆధ్యాత్మిక కేంద్రాన్ని అందించాలని ఆకాంక్షించారు. ఇందుకోసం నిధులు మొదలుకొని.. అన్ని అంశాలను స్వయంగా పర్యవేక్షించి.. మార్గదర్శనం చేస్తూ స్వామి సంకల్పాన్ని సాకారం చేశారు. ఏకంగా 17 సార్లు యాదాద్రిలో పర్యటించారు. పర్యటించిన ప్రతిసారీ కనీసం ఆరు గంటలకు తక్కువ కాకుండా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, పరీక్షించి, నిపుణులతో చర్చించి, చినజీయర్‌స్వామి లాంటి మహానుభావుల సూచనల ప్రకారం తగిన సలహాలిచ్చి మమ్మల్ని ముందుకు నడిపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆలయానికి వచ్చే భక్తుడికి ఏం కావాలో పర్‌ఫెక్ట్‌గా చెప్పేవారు. దాన్ని అలాగే సిద్ధం చేశాం. అందుకే పైన దేవుడి దయ.. కింద సీఎం సంకల్పం.. ఈ రెండింటి వల్లే ఆలయాన్ని దిగ్విజయంగా పునర్నిర్మించగలిగాం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement