బంజారాహిల్స్ : ఆన్లైన్లో(Online games) లూడోగేమ్కు బానిసగా మారి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్న యువకుడు ఆత్మహత్యకు (Suicide ) పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం జక్లేర్ గ్రామానికి చెందిన గడ్డమీది వెంకటేష్(23) బంజారాహిల్స్ రోడ్ నెం14 లోని రోస్ట్ కేఫ్‌లో గార్డెనింగ్ పనులు చేస్తు కొంతకాలంగా ఆన్లైన్లో ఓ సంస్థకు చెందిన లూడో గేమ్ యాప్‌ను వాడుతున్నాడు. ఆ గేమ్ వల్ల అతడు సుమారు రూ.6లక్షలదాకా అప్పులు చేసి పోగొట్టుకున్నాడు. తీసుకున్న అప్పులు చెల్లించలేకపోవడంతో కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు.
ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్నేహితులు అతడిని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. తన సోదరుడు ఆత్మహత్యకు కారణమైన కంపెని ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ మీద చర్యలు తీసుకోవాలంటూ మృతుడి సోదరుడు భీమశంకర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యాప్ నిర్వాహకులపై బీఎన్ఎస్ 108 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.