వినాయక్ నగర్ : నిజామాబాద్ ( Nizamabad ) నగరంలో గంజాయిని విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు పట్టుకుని 230 గ్రాముల గంజాయిని ( Ganja ) స్వాధీనం చేసుకున్నట్టు నగర సీఐ శ్రీనివాస రాజ్ వెల్లడించారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు రాత్రి సుభాష్‌నగర్‌లోని ఎన్జీవోఎస్ కాలనీలో గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో 3వ టౌన్ ఎస్సై హరిబాబు,సిబ్బంది నిర్మల్ జిల్లా గాజుల నర్సాపూర్ ప్రాంతానికి చెందిన కోడె సంపత్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుని వద్ద 230 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి నిజామాబాద్‌లో విక్రయిస్తున్నాడని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. గంజాయి డ్రగ్స్ సేవించే వారిపై, క్రయ, విక్రయాలు జరిపే వారిపై నిఘా ఉంచామని వివరించారు. ప్రజలు కూడా తమ పిల్లల, కుటుంబ సభ్యుల ప్రవర్తన కదలికలను గమనించి ఏమైనా తేడా ఉంటే జాగ్రత్త వహించాలని కోరారు.