కరీంనగర్, జూలై 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. కాళేశ్వరం జలాల ఎత్తిపోతలను ప్రారంభించింది. ఎల్లంపల్లి జలాశయం నుంచి నంది, గాయత్రీ పంపుహౌస్‌ల మీదుగా మధ్యమానేరుకు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో ‘కాళేశ్వరం కూలింది.. పనికి రాదు’ అన్ని ఇన్నాళ్లూ కాంగ్రెస్ సర్కార్ చెప్పినవన్నీ అబద్ధాలని మరోసారి తేలిపోయింది. ఎగువన ఉన్న ప్రాజెక్టులు డెడ్‌స్టోరేజీకి చేరి సాగు, తాగునీటికి కష్టాలు ఎదురవుతున్న పరిస్థితుల్లో నీళ్లు ఎత్తిపోయాలని సర్కార్‌పై బీఆర్ఎస్ గట్టిగా ఒత్తిడి పెంచింది. ఈ క్రమంలో తాజా వర్షపు నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం ఆగమేఘాలమీద చర్యలు తీసుకున్నది. పంప్‌హౌస్‌ల ద్వారా ఉప్పెనలా వస్తున్న నీటి ప్రవాహం కాళేశ్వరం పథకం గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెబుతున్నది.
బీఆర్ఎస్ పోరాటానికి తలొగ్గిన కాంగ్రెస్ సర్కార్ బుధవారం మధ్యాహ్నం నుంచి ఎత్తిపోతలు మొదలుపెట్టింది. నాలుగు పంపులు ఆన్‌చేసి నంది జలాశయం నుంచి గాయత్రీ పంపుహౌస్‌కు అక్కడినుంచి మధ్యమానేరుకు నీటిని ఎత్తిపోసే ప్రక్రియ చేపట్టారు. నాలుగు పంపుల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని మధ్యమానేరుకు ఎత్తిపోస్తున్నారు. ఒక్కో పంపు ద్వారా 3,150 క్యూసెక్కులు మొత్తం 12,600 క్యూసెక్కులను ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరుకు ఎత్తిపోయడం వల్ల అక్కడినుంచి అవసరమైతే హైదరాబాద్‌కు నీటిని తరలించడానికి అవకాశం ఉంటుంది. నాలుగు రోజుల క్రితం ఎల్లంపల్లిలో 7నుంచి 8 టీఎంసీల నీరు మాత్రమే ఉండగా, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో దాదాపు 3 టీఎంసీలకు రావడంతో బుధవారం సాయంత్రానికి 11 టీఎంసీలకు చేరింది. నిజానికి ఆ ప్రాజెకు ్టనుంచి ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌తో పాటు హైదరాబాద్ తాగునీటికి నీళ్లు ఇవ్వాల్సి ఉండేది. మరో 15రోజుల్లో హైదరాబాద్‌కు తాగునీరు సరఫరా చేయడం ఇబ్బంది అయ్యేది. ప్రస్తుతం రెండు రోజులుగా పడుతున్న వర్షాలతో క్యాచ్మెంట్ ఏరియా నుంచి 76వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో వస్తున్నది. ఎత్తిపోతలకు బీఆర్ఎస్ డిమాండ్ చేయడంతో ప్రభుత్వం వచ్చిన నీటిని వచ్చినట్టు ఎత్తిపోసేందుకు ఉపక్రమించింది.
రెండు రోజుల క్రితం వరకు రాష్ట్రంలో ఎటుచూసినా కరువు ఛాయలే కనిపించాయి. ఎల్ నినో పేరు చెప్పి సర్కార్ అన్ని విధాలుగా తప్పించుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఎల్లంపల్లి నుంచి శ్రీరాంసాగర్ వరకు, అలాగే మల్లన్న సాగర్‌వరకు ఉన్న అన్ని జలాశయాలు డెడ్‌స్టోరేజీకి చేరుకున్న విషయం విదితమే. ఈ పరిస్థితుల్లో మేడిగడ్డ మీదుగా లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నదని, అక్కడి నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి రాష్ట్ర రైతాంగానికి సాగునీరు ఇవ్వడంతోపాటు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా చూడాలని ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలాసార్లు విన్నవించారు. అయినా సర్కార్ మొండిగా వ్యవహరించడంతో మేడిగడ్డ పర్యటన చేపట్టి వాస్తవాలను ప్రజల ముందుంచారు. ఈ పర్యటనను అడ్డుకొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విఫల ప్రయత్నాలు చేసింది. వాటిని ఛేదించి మేడిగడ్డకు చేరుకున్న కేటీఆర్, మేడిగడ్డ నుంచి దిగువకు వృథాగా వెళ్తున్న జలాలను ప్రజలకు చూపించారు. అక్కడే వాస్తవాలను ప్రజలకు వివరించడంతోపాటు కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న మొండివైఖరి వల్ల రైతులకు సాగునీటి రంగానికి జరుగుతున్న అన్యాయాన్ని మీడియా సాక్షిగా ఎండగట్టారు. ప్రభుత్వం మొండిపట్టు వీడకపోతే.. అవసరమైతే కన్నెపల్లి పంపులను ఆన్ చేస్తామని హెచ్చరించారు. నిజానికి కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని బీఆర్ఎస్ చేసిన పోరాటానికి ప్రజల నుంచి అనుహ్య స్పందన లభించింది. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు ఎత్తిపోస్తున్న జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. నంది, గాయత్రీ పంపుహౌస్‌ల ద్వారా వస్తున్న నీటి ప్రవాహం కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. కాళేశ్వరం అంటే కేవలం కన్నెపల్లి మాత్రమే కాదని, అవసరాన్ని బట్టి ఎల్లంపల్లి నుంచి లేదా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి మధ్యమానేరుకు, అక్కడి నుంచి అనేక ప్రాంతాలకు నీటిని ఎత్తిపోసేలా డిజైన్ చేసిందని సాగనీటి రంగ నిపుణులు పదేపదే చెబుతున్నా.. వాటిని కప్పిపుచ్చేలా ఇన్నాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తూ వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఏడు లింకులు, 28 ప్యాకేజీలున్నాయని నిపుణులు చెప్పినా.. ‘కాళేశ్వరం కూలింది. లక్ష కోట్లు వృథా అయ్యాయి’ అంటూ అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్ నాయకులకు ప్రస్తుత నీటి పరవళ్లు చూసైనా కనువిప్పు కలుగుతుందా? లేదా? అని ప్రజలు నిలదీస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ చెప్పినట్టు ప్రాజెక్టు వృథాగా అయితే ఎల్లంపల్లి నుంచి ఎలా నీళ్లు ఎత్తిపోస్తున్నదనే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లింక్-2 కింద ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఎల్లంపల్లికి వరద ఇలాగే కొనసాగితే ఎన్ని రోజులైనా లింక్-2 ద్వారా ఎత్తిపోయవచ్చు. అక్కడినుంచి వివిధ లింకులు ద్వారా మల్లన్నసాగర్ వరకు.. ఇటు వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీ వరకు నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నది. నిజంగా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకపోతే.. ఎల్లంపల్లికి వచ్చే నీళ్లు సముద్రం పాలయ్యేది తప్ప ఎగువకు ఎత్తిపోసే అవకాశం ఉండేదా? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలనే డిమాండ్ వ్యక్తమవుతున్నది. కాళేశ్వరం మీద విమర్శలు చేసే నాయకులు.. ఇకనైనా కనువిప్పు చేసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం చూస్తే ఆగస్టు 2 వరకు ఎత్తిపోతలు కొనసాగించాలని అధికారులకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
కొల్లాపూర్, జూలై 29 : కృష్ణానది డెడ్ స్టోరేజీ పాయింట్ కోతి గుండు నుంచి వరద జలాలను ఎత్తిపోయాలని నాగర్‌కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ నాయకుల నుంచి వస్తున్న ఒత్తిడితో ఎంజీకేఎల్ నుంచి సాగునీరు విడుదల చేశారు. బుధవారం ఎంజీకేఎల్ఐ లిప్ట్ -1 నుంచి రెండు, నాలుగో మోటర్ల ద్వారా కృష్ణానది నీళ్లను ఎత్తిపోస్తున్నారు. ఎల్లూరు రిజర్వాయర్ నుంచి సింగోటం రిజర్వాయర్, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్‌కు శ్రీశైలం నీళ్లు ఎత్తిపోస్తున్నారు. ఎంజీకేఎల్ లిప్ట్ -1లోని 2,4 మోటర్లు 30 మెగా వాట్స్ సామర్థ్యం కలిగి 800 క్యూసెక్కుల నీళ్లను ఎత్తిపోస్తున్నాయి. 4 లక్షల 24 వేల ఎకరాల ఆయకట్టుతోపాటు, 303 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగు నీరు అందించడంలో ఈ ప్రాజెక్టు కీలక ప్రాత పోషిస్తున్నది.