న్యూఢిల్లీ: భారత క్రికెటర్లు యశస్వి జైస్వాల్, మహిళా క్రికెటర్ షఫాలీ వర్మకు.. జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నోటీసులు ఇచ్చింది. గత ఏడాది ఆ ఇద్దరూ డోపింగ్ పరీక్షల(Dope Tests)కు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో వారికి నాడా నోటీసులు జారీ చేసింది. అయితే ఆ పరీక్షలకు ఎందుకు మిస్సయారన్న విషయాన్ని ఇంత వరకు ఆ క్రికెటర్లు వెల్లడించలేదు. ఆ ఇద్దరు కూడా నాడాకు చెందిన రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్‌లో ఉన్నారు. కారణాలు వెల్లడించకపోవడం వల్ల నోటీసులు జారీ చేసినట్లు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ పేర్కొన్నది.
క్రికెటర్లకు నోటీసులు ఇవ్వడమే కాకుండా, ఈ అంశం గురించి బీసీసీఐ, ఐసీసీకి కూడా ఫిర్యాదు చేసినట్లు నాడా చెప్పింది. డోప్ పరీక్షలకు మిస్సైన అంశం గురించి నాడా నోటీసు అందినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌ను ప్రవేశపెట్టారని, ఇక ఆ మెగా క్రీడల ప్రోటోకాల్ ప్రకారం అన్ని పరీక్షలకు హాజరు కావాలని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున బ్యాటర్ యశస్వి ఆడుతున్నాడు. ఇక భారత మహిళల జట్టులో షఫాలీ వర్మ ఉన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆమె ఆడారు.
ఒకవేళ ఆటగాళ్లు వరుసగా మూడు సార్లు డోపింగ్ పరీక్షలకు హాజరుకాకుంటే, అప్పుడు వాళ్లను సస్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయి. నాడా ఆర్టీపీ జాబితాలో 13 మంది క్రికెటర్లు ఉన్నారు. ఇండియా నుంచి డోప్ టెస్టు లిస్టులో మొత్తం 348 మంది అథ్లెట్లు ఉన్నారు. తాజాగా ఆ లిస్టులో చేరిన క్రికెటర్లలో అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్ ఉన్నారు. ఒకవేళ మూడో సారి కూడా డోపింగ్ పరీక్షలకు హాజరుకాకుంటే, ఆ ఆటగాళ్లపై రెండు నిషేధం విధిస్తారు. నిషేధిత ఉత్ప్రేరకం టెర్బుటలైన్ వాడడం వల్ల క్రికెటర్ పృథ్వీ షాపై 2019లో 8 నెలల బ్యాన్ విధించిన విషయం తెలిసిందే.