ముంబై: దేశవాళీ క్రికెట్లో కొత్త జట్టుతో యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) ఆడనున్నాడు. 2024-2025 సీజన్లో ముంబై జట్టు తరపున జైస్వాల్ ఆడిన విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీ టోర్నీలో ముంబై తరపున జైస్వాల్ ప్రాతినిధ్యం వహించాడు. అయితే తన కెరీర్లో భారీ మార్పు చేసుకున్నాడతను. అండర్-19 క్రికెట్ ఆడుతున్న నాటి నుంచి ముంబై తరపున ఆడిన ఆ టీమిండియా ఓపెనర్ ఇప్పుడు దేశవాళీ క్రికెట్లో గోవా తరపున ఆడేందుకు డిసైడ్ అయ్యాడు. వచ్చే సీజన్ నుంచి అతను గోవా తరపున ఆడనున్నాడు. దీని కోసం అతను ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. స్టేట్ క్రికెట్‌ను మార్చుకోనున్నట్లు అతను తెలిపాడు. ఇటీవల ముంబై ప్లేయర్లు అర్జున్ టెండూల్కర్, సిద్దేశ్ లాడ్లు.. స్వరాష్ట్రాన్ని వీడి గోవా తరపున రంజీలో ఆడిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నుంచి తిరిగి వచ్చిన తర్వాత జైస్వాల్ దేశవాళీ క్రికెట్లో ముంబై తరపున రంజీలో ఆడాడు. టీమిండియా ప్లేయర్లు కచ్చితంగా దేశవాళీ టోర్నీల్లో ఆడాలని బీసీసీఐ నిబంధన పెట్టిన విషయం తెలిసిందే. దీంతో రంజీ ట్రోఫీలో జైస్వాల్‌తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఆడారు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున జైస్వాల్ ఆడుతున్నాడు. కానీ ఇప్పటి వరకు అతను పెద్దగా స్కోర్ చేయలేదు. మూడు మ్యాచుల్లో అతను కేవలం 34 రన్స్ మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 29 మాత్రమే. కొత్తగా వచ్చిన పవర్‌ప్లే రూల్స్‌తో జైస్వాల్ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. గత 18 ఇన్నింగ్స్‌లో అతను 8 సార్లు మొదటి మూడు ఓవర్లలోనే ఔటయ్యాడు. 2024 సీజన్లో జైస్వాల్ 31 సగటుతో 435 రన్స్ స్కోర్ చేశాడు. దాంట్లో ఓ సెంచరీ, ఫిఫ్టీ ఉన్నాయి. గత రెండు సీజన్ల నుంచి జైస్వాల్ అటాకింగ్ ఆట తీరు 70 శాతం తగ్గినట్లు అంచనా వేశారు.