‘తెలంగాణలో పండిన యాసంగి వరి ధాన్యాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గౌరవ ప్రధాన మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది.”ఉమ్మడి జిల్లా అంతటా స్థానిక సంస్థల పాలకవర్గాలు ఇలానే ఏకగ్రీవ తీర్మానాలతో కేంద్రంపై యుద్ధం ప్రకటించాయి. ధాన్యం కొనుగోళ్లపై మోడీ సర్కారు కుట్రలను నిరసిస్తూ.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులకు అండగా అన్ని వర్గాలు కదలివస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపును అందుకుని అన్ని స్థాయిల్లోని స్థానిక సంస్థల పాలకవర్గాలు యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతూ తీర్మానాలు చేస్తున్నాయి. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కాగా.. శనివారం యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లోనూ ఏకగ్రీవంగా తీర్మానాలను ఆమోదించారు. ఆదివారం నల్లగొండలోనూ జడ్పీ ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీలు, మండల పరిషత్‌ల్లో మెజార్టీ చోట్ల తీర్మానాలు పూర్తికాగా, మిగిలిన వాటితోపాటు మున్సిపాలిటీలు, మార్కెట్ కమిటీలు, పీఏసీఎస్‌లు, డీసీసీబీ, డీసీఎంఎస్ల్లోనూ ఒకటి రెండ్రోజుల్లో చేసేలా కార్యచరణ రూపొందించారు. ఆ తీర్మానాలన్నింటినీ నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి పోస్ట్ చేయనున్నారు. అప్పటికీ రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే ప్రత్యక్ష పోరాటం తప్పదని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సిద్ధమవుతున్నారు.
రాష్ట్రంలోని రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని, ఉద్యమాలు చేపడుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని కోరుతూ జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి తీర్మానం ప్రతిపాదించగా, జడ్పీ వైస్ చైర్మన్ బీకునాయక్ బలపర్చగా జడ్పీటీసీ సభ్యులు ఏకగీవ్రంగా ఆమోదం తెలిపారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ఆహార భద్రతా చట్టం ప్రకారం రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని వెనుకంజ వేస్తే ఉద్యమాలు తప్పవన్నారు. ధాన్యాన్ని కొనం అని చేప్పే అధికారం, హక్కు కేంద్రానికి లేదన్నారు. పీయూష్ గోయల్ రైతుల వ్యతిరేకిగా పెట్టుబడిదారులకు ప్రతినిధిగా వ్యవహరిస్తూ తెలంగాణను అవమానిస్తే ఊరుకేనేది లేదని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేయలాని చూస్తే సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎంతవరకైనా కొట్లాడుతామన్నారు.
– భువనగిరి అర్బన్, మార్చి 26
తెలంగాణలో ఉచిత విద్యుత్ ఇస్తున్నారనే కోణంలో వ్యవసాయాన్ని దెబ్బతీయాలని కేంద్రం చూస్తున్నదని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన ఎఫ్‌సీఐ రైతులను ఇబ్బందులు పెడుతుందని, లారీలు అన్లోడ్ చేయకుండా రోజుల తరబడి ఆపుతుందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో తెలంగాణ ప్రభుత్వానికి టన్నుకు రూ.300 నష్టం వస్తున్నా రైతు సంక్షేమం కోసం భరిస్తుందన్నారు. దేశంలోని అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అదాని, అంబానీలకు కట్టబెట్టాలని కేంద్రం చూస్తున్నదని విమర్శించారు. ధాన్యం కొనుగోలుపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని, ప్రతి గ్రామ పంచాయతీ నుంచి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి వరకు రాష్ట్రంలో పండించిన వరి ధాన్నాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే తీర్మానాలు పంపిస్తున్నట్లు తెలిపారు. దేశంలో అన్ని రకాల పంటలు పండుతాయని, కేంద్రానికి ముందు చూపు లేకే 80శాతం నూనెలు దేశానికి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. దేశంలో 13 రాష్ర్టాల్లో వరి పండిస్తున్నారని, ఇతర పంటలపై కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులు, ప్రజలకు అనుకూలం లేదని, కార్పొరేట్ శక్తులకు కొమ్మకాయాలని చూస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేయకుండా ఉండేందుకే బాయిల్డ్ రైస్ తీసుకోము, రా రైస్ తీసుకుంటామని కొత్త నాటకాలు మొదలు పెట్టిందన్నారు. రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామన్నారు.
సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కష్ణారెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, జడ్పీటీసీలు బీరు మల్లయ్య, గోలి ప్రణీతాపింగళ్‌రెడ్డి, కుడుదుల నగేశ్, ప్రభాకర్‌రెడ్డి, చామకూర గోపాల్‌గౌడ్, అనూరాధ, భువనగిరి ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, కోఆప్షన్ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో వరి శాతం పెరిగిందని మంత్రి ఉద్ఘాటించారు. రాష్ట్రంలో పండించిన ప్రతి వరి గింజను పంజాబ్ తరహాలో కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. కాకతీయుల కాలం నుంచి తెలంగాణలో అత్యధికంగా వరి పంటలు పండుతున్నాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోని లేని గొలుసుకట్టు చెరువులు తెలంగాణలో ఉన్నాయని, ఈ చెరువులను ప్రభుత్వం పునరుద్ధరించడంతో వరి శాతం మరింత పెరిగిందన్నారు. రాష్ట్ర సుభిక్షం కోసం నీటి పారుదల రంగాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే 24 గంటల విద్యుత్, మూడేళ్లలోనే వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సాధించుకున్నామన్నారు. దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణేనని, ఇది కండ్లకు కన్పిస్తలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడక ముందు వేల ఎకరాలలో వరి సాగు చేస్తే రాష్ట్రం ఏర్పడ్డాక కోటి ఎకరాలకు పైగా సాగులోకి వచ్చి 3కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు. కరోనా నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా కళ్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేసి రైతుల పక్షాన నిలిచామన్నారు. కేంద్రం గత యాసంగి నుంచి ధాన్యం కొనుగోలులో చిక్కులు పెట్టి రైతులను మోసం చేయాలని చూస్తుంది ఎందుకని ప్రశ్నించారు.
ఆహార భద్రత చట్టం ప్రకారం రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందే. అందుకోసం రైతుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎంతవరకైనా కొట్లాడుతాం. పేగులు తెగేదాకా, కేంద్రం దిగొచ్చే వరకూ పోరాడుతాం. రాష్ట్ర రైతాంగం పచ్చగా ఉంటే మోడీ సర్కారు తట్టుకోలేక కక్షపూరితంగా పగ బట్టినట్టు ఇబ్బందులకు గురిచేస్తున్నది. తెలంగాణలో వ్యవసాయాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పెట్టుబడిదారుల ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు. కేంద్రం కుట్రలను సాగనివ్వం. రైతులకు అండగా గులాబీ సైన్యం ఉంటుంది.
– జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, సబ్సిడీ విత్తనాలతో రైతులకు చేస్తున్న సంక్షేమం కేంద్రానికి కన్పిస్తలేదా అని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి ప్రశ్నించారు. యాదాద్రిభువనగిరి జిల్లా ఏర్పడక ముందు 62వేల ఎకరాలు సాగుచేస్తే జిల్లా ఏర్పడ్డాక 2.50లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. యాసంగిలో పండించిన వరి ధాన్యం కేంద్ర కొనుగోలు చేయకుంటే ఉద్యమాలు జిల్లా నుంచే మొదలవుతాయన్నారు.
జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి
రాష్ట్రంలో యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం పూర్తి స్థాయిలో కొనకుంటే ఉద్యమాలు చేయడంలో తగ్గేదే లేదని టెస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. వరి ధాన్యం పండించడంలో రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ముందులో ఉందని, దేశంలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు పండించిన వరి ధాన్యానికి ప్రస్తుతం నాలుగు రెట్లు పెరిగిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోని మిల్లులు మిర్యాలగూడ, నల్లగొండ, సూర్యాపేటలో అధికంగా ఉన్నాయన్నారు. కేంద్ర మొండి వైఖరి వీడి బాయిల్డ్ రైస్, రా రైస్ అని తేడా లేకుండా పండించిన ప్రతి వరి గింజనూ కొనుగోలు చేయాలని లేకుంటే ఉద్యమాలకు రైతులంతా సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి