World’s Coldest City | మన దగ్గర ఉష్ణోగ్రత 28 కి పడిపోతేనే.. వామ్మో! అంటూ గజగజ వణికిపోతాం. అలాంటిది ఓ సిటీలో టెంపరేచర్ మైనస్‌గా నమోదవుతున్నాయి. మైనస్ 1, 2 కాదు.. ఏకంగా మైనస్ 50 సెల్సియస్ డిగ్రీలు వరుసగా నమోదవుతున్నాయి. అంత చల్లగా ఉంటే ఎలా బతుకురాబ్బా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు కదూ..?! ఇక్కడి కొన్ని గనుల కారణంగానే ప్రజలు అంత చలిలోనూ ఈ సిటీలో నివసిస్తున్నారంట.
రష్యాలోని యాకుట్స్క్ నగరం ప్రపంచంలోనే అత్యంత శీతల నగరంగా రికార్డులకెక్కింది. ఇక్కడ మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో మైనస్ 62 డిగ్రీలకు కూడా వెళ్లొచ్చని స్థానిక వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ సిటీలోని వారు నీరు తాగాలంటే ఐస్‌ను మరిగించాలి. ఆహార పదార్థాలన్నీ మంచులో గడ్డకట్టుకుపోయి ఉంటాయి. ఈ నగరం మాస్కోకు తూర్పున 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నది. శీతాకాలంలో సాధారణంగా ఉష్ణోగ్రత మైనస్ 40 డిగ్రీలుగా ఉంటుంది. అయితే ఆర్కిటిక్ నుంచి మంచు గాలుల కారణంగా ప్రస్తుతం ఉష్ణోగ్రత మరింతగా దిగజారిపోయింది.
యాకుట్స్క్ నగరంలో దాదాపు 3 లక్షల మంది నివసిస్తున్నారు. అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు మరీ ముఖ్యంగా డిసెంబర్-ఫిబ్రవరి మధ్య తీవ్రమైన చలి ఉంటుంది. ఈ నెలల్లో ఇంట్లో నుంచి బయటకు రావడమే కష్టంగా మారుతుంది. క్యాబేజీ ఆకుల మాదిరిగా డ్రెస్సులను ధరించి చలి నుంచి రక్షించుకుంటారు. మంచు కారణంగా చేపలను ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరమే రావడంలేదని చేపలు అమ్మే ఓ స్థానికురాలు నవ్వుతూ చెప్తున్నది. ఈ ప్రాంతంలో బంగారం, వజ్రాలతోపాటు యురేనియం గనులు ఉన్నాయి. వాటి నుంచి ఇక్కడి వారు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. దాంతో గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా వారిక్కడ నివసిస్తున్నారు.