యాదాద్రి, ఏప్రిల్ 21: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర ఆలయ పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బుధవారం మొదలైన ఈ ఉత్సవాలు స్మార్తగమశాస్త్ర పద్ధతిలో ఈ నెల 25 వరకు కొనసాగనున్నాయి. ఆచార్య బ్రహ్మ దేవపారాయణందారులు, యజ్ఞాచార్య బృందం, రుత్వికులు, పరిచారక బృందం సభ్యులు ఉత్సవాలను మహాద్భుతంగా నిర్వహిస్తున్నారు.
నవగ్రహ మండపం వద్ద నిర్మించిన ప్రత్యేక తొట్టిలో బింబమూర్తులకు పవిత్ర జలాలతో మంత్రపూర్వకంగా జలాధివాసం నిర్వహించారు. సీతారామ, లక్ష్మణ, ఆంజనేయస్వామి, సూర్యభగవానుడు, గణపతి, పర్వతవర్ధిని, సుబ్రమణ్యస్వామి, నాగదేవత, శివపార్వతుల విగ్రహం, ద్వారపాలకులు జయవిజయులు, నంది విగ్రహం, బలిపీఠం, స్ఫటిక లింగంతోపాటు శుద్ధి జలాలు ఉంచిన తొట్టిలో వెంచేపుచేశారు.
శివాలయంలోని యాగశాలలో ఉదయం 9 గంటలకు చతుస్థానార్చన నిర్వహించి, ద్వార తోరణం, కుంభారాధనలు చేపట్టారు. అనంతరం యాగశాలలో స్వయంభు అగ్ని మధనం నిర్వహించారు. స్వయంభు అగ్నితో పంచకుండాత్మక మహా రుద్ర యాగాన్ని ప్రధానార్చకులు, పురోహితులు, రుత్వికులు ప్రారంభించారు. యాగశాల ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు యాగశాల ప్రవేశం, మండ స్తంభ ద్వారతోరణ పూజ, చతుస్థానార్చనలు, హోమకుండ సంస్కారం, అగ్ని ప్రతిష్ఠ మహారుద్ర అరశ్చరణ, మూలమంత్రానుష్టాన హవనం శాస్త్ర సంప్రదాయరీతిలో జరిపారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8:30 గంటల వరకు శాంతి, దీక్షాహోమం, అగ్న్యత్తారణం, కౌతుక బంధనం, జలాధివాసం కార్యక్రమాలు నిర్వహించారు.
కుంభాభిషేక యాగశాలలో నాలుగు దిక్కుల్లో నవగ్రహాధి దేవతారాధన పూర్వకమైన ప్రక్రియను నిర్వహించారు. నాలుగు స్థానాలలో పరమేశ్వర ఆరాధన చేశారు. తోరణ పూజ నాలుగు దిక్కుల్లో ఆయా దేవతలను ఆరాధన పూర్వకంగా అర్పించి ధూప దీప నైవేద్యాదులు నారికేళ ఫలములను నివేదించారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఆలయ ఈవో ఎన్ గీత, అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి దంపతులు, ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, శివాలయ ప్రధానార్చకుడు నర్సింహరాములు శర్మ, ప్రధాన పురోహితుడు గౌరిభట్ల సత్యనారాయణ శర్మ, వేద పారాయణికులు, యజ్ఞాచార్యులు, రుత్వికులు, పరిచారక బృందం, పురోహితులు, అర్చకులు పాల్గొన్నారు.