యాదాద్రి, మార్చి 27 : కనీవిని ఎరుగని రీతిలో ప్రభుత్వ నిధులతో భారీ ఎత్తున నిర్మించిన గొప్ప హైందవ దేవాలయం మన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిదని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఆదివారం ఆయన యాదాద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొండకింద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అద్భుతమైన కళాకండాలు, ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రి పునర్నిర్మాణమైందని పేర్కొన్నారు. సోమవారం ఆలయం పునః ప్రారంభంకానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. త్వరలో యాదాద్రి పుణ్యక్షేత్రం తిరుపతి తరహాలో ప్రాచుర్యం పొంది ప్రపంచ భక్తులందరికీ ప్రధాన పుణ్యక్షేత్రంగా మారుతుందని తెలిపారు. హైదరాబాద్‌కు అతి సమీపంతో పాటు ప్రపంచంలోనే ఏ నగరం నుంచైనా రావడానికి అనుకూలంగా ఎయిర్‌పోర్టు, జాతీయ రహదారి ఉందన్నారు. మున్ముందు భక్తుల తాకిడి 50వేల నుంచి లక్ష వరకు ఉండే అవకాశముందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, రైతుబంధు సమితి డైరెక్టర్ మిట్ట వెంకటయ్య, నాయకులు ఎరుకల హేమేందర్‌గౌడ్, సూదగాని ఉదయ్‌కిరణ్, ఆకుల స్వామిగౌడ్ పాల్గొన్నారు.