యాదాద్రి : మార్చి 28న యాదాద్రి నారసిండి ప్రధానాలయ పునః ప్రారంభంలో భాగంగా జరిగే మహాకుంభసంప్రోక్షణకు కావాల్సిన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం, ఆలయ అధికారులు దృష్టి సారించారు. ఇందుకోసం ముచ్చింతల్‌లో చేపట్టిన మహాయజ్ఞాలు, ఆలయంలో ఏర్పాటు చేసిన భద్రత వ్యవస్థ, రుత్వికులు, భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలపై అధికారులు బుధవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ధి సమారోహ ఉత్సవాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్, డీసీపీ నారాయణరెడ్డి, యాదాద్రి ఆలయ ఈవో ఎన్. గీత, ఏసీపీ నర్సింహరెడ్డి సందర్శించారు.
అక్కడ చేపట్టిన ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. యాదాద్రిలో చేపట్టాల్సిన మహాకుంభ సంప్రోక్షణ, అంతకుముందు వారం రోజుల పాటు చేపట్టాల్సిన మహా సుదర్శన యాగానికి కావాల్సిన సదుపాయాలను పరిశీలించారు. భద్రతావ్యవస్థపై చేపట్టిన జాగ్రత్తలు, ప్రోటోకాల్‌కు సంబంధించిన జాగ్రత్తలు, కమాండ్ కంట్రోల్, యాగశాల ఏర్పాటు, భక్తుల సౌకర్యాలు, రుత్వికులకు ఏర్పాటు చేసిన వసతులు, భోజనశాల ఏర్పాట్లను క్షుణంగా పరిశీలించారు.