హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభానికి ముహూర్తం దగ్గర పడుతున్నందున పెండింగ్ పనులన్నింటినీ ఫిబ్రవరిలోగా పూర్తిచేయాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో యాదాద్రి పనుల పురోగతి, సుదర్శన యాగం, మహాకుంభ సంప్రోక్షణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం నిమిత్తం ఎన్నారై భక్తుల నుంచి విరాళాలను స్వీకరించేందుకు టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఈ యాప్‌లోని ఎన్నారై ఆప్షన్ ద్వారా యాదాద్రితో పాటు హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ, పెద్దమ్మగుడి, సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్, కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి ఆలయాలకు విరాళాలు సమర్పించుకునే అవకాశం ఉన్నదని తెలిపారు. సమావేశంలో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
గ్రాంట్ ఇన్ ఎయిడ్ కటాఫ్ తొలగించండి
దేవాదాయ, ధర్మాదాయశాఖ పరిధిలోని వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగులకు న్యాయం చేయాలని తెలంగాణ దేవాదాయ అర్చక, ఉద్యోగ ఐక్య కార్యచరణ సమితి గురువారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కోరింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా ఇచ్చే వేతనాల విషయంలో కటాఫ్ తేదీని తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ సమితి అధ్యక్షుడు కాండూరి కృష్ణమాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ తదితరులు వినతిపత్రం అందజేశారు.