యాదగిరిగుట్ట రూరల్, అక్టోబర్ 31 : ఘర్షణలు, చోరీలు, మోసాలు, రోడ్డు ప్రమాదాలు.. నేరాలేవైనా కేసులు ఛేదించడంలో పోలీసులు ఓ అడుగు ముందుకేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని గంటలు, రోజుల వ్యవధిలోనే నిందితులను పట్టుకుంటున్నారు. ముఖ్యంగా నేరాలను అదుపు చేయడం, కేసుల విచారణలో సీసీ కెమెరాలు ‘కీ’లకంగా మారాయి. నేరం చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తికి అవి భయాన్ని కలిగిస్తున్నాయి. వివిధ సందర్భాల్లో లభ్యమయ్యే సీసీ పుటేజీ ద్వారా కేసు విచారణ వేగవంతం అవుతున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 12వేలకు పైగా కెమెరాలు నేరాల నియంత్రణలో కీలకంగా మారాయి. త్వరలోనే మరో 500కెమెరాల బిగింపునకు పోలీస్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతపై పోలీస్ శాఖ ‘నేను సైతం’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇండ్లు, షాపులు, పాఠశాలలు, ఫంక్షన్ హాళ్లు.. ఇలా అనేక మంది సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంతో నేరాలు తగ్గుముఖం పట్టాయి. అడపాదడపా ఎక్కడైన నేరాలు జరిగినా వాటిని ఛేదించడంలో సీసీ కెమెరాలు సహాయపడుతున్నాయి. వ్యాపారులు సీసీ కెమెరాలను మొబైల్‌కు అనుసంధానం చేసుకుని ఎక్కడి నుంచైనా వీక్షించగలుగుతున్నారు. ఏదైనా అనుమానం కలిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. జిల్లాలో వరంగల్-హైదారాబాద్, విజయవాడ-హైదారాబాద్ జాతీయ రహదారుల వెంట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పోలీస్ శాఖకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రమాదాలతో పాటు, అనుమానిత వ్యక్తులు, వాహనాలను వీటి ద్వారా పరిశీలించే అవకాశం కలుగుతుంది. 70 శాతం కేసులను ఛేదించడంలో సీసీ కెమెరాలు సహాయపడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.
పోలీసులు ఛేదించిన కేసుల్లో కొన్ని..
భువనగిరి పట్టణంలోని ఆర్బీనగర్కు చెందిన ఓ వ్యక్తి ఎసీబీఐ బ్యాంకు ఏటీఎంలో డబ్బు డ్రా చేయడానికి వెళ్లాడు. కంటి చూపు సమస్యతో మరో వ్యక్తిని సాయం కోరగా అతడు కార్డును మార్చి విడుతల వారీగా డబ్బులు డ్రా చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన పట్టణ ఇన్స్పెక్టర్ సుధాకర్.. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించాడు. కరీంనగర్‌కు చెందిన వాడిగా గుర్తించి అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.
ఆలేరు మండలంలోని మంతపురిలో 14ఏండ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడని సమాచారం అందుకున్న ఎస్ఐ ఇద్రిస్ అలీ.. చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలను పూర్తిగా పరిశీలించారు. కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు బాబును కిడ్నాప్ చేసినట్లు ధ్రువీకరించుకుని కారు నంబర్ ఆధారంగా వివరాలు సేకరించారు. హైదరాబాద్‌లో ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని బాబును తల్లిదండ్రులకు అప్పగించారు.