భువనగిరి అర్బన్, అక్టోబర్ 29 : రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మరింత చేయూత అందిస్తున్నది. ఇప్పటికే చేతి వృత్తిదారులకు పలు పథకాలు చేపట్టి భరోసా కల్పిస్తుండగా తాజాగా వైన్స్ దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టింది. నవంబర్ నెలలో నిర్వహించనున్న మద్యం దుకాణాల టెండర్లలో బీసీ వర్గంలోని గౌడ కులస్తులకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లు కల్పించనున్నది.
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం…
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు కల్పిస్తూ సెప్టెంబర్ 21న జీఓ జారీ చేసింది. బార్ అండ్ రెస్టారెంట్ల మంజూరు విషయంలో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారా ? లేదా ? అనే అంశంపై త్వరలో స్పష్టత రానున్నది. అయితే, మద్యం దుకాణాల విషయంలో రిజర్వేషన్లు పక్కాగా అమలు కానున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రస్తుతం 69 మద్యం దుకాణాలు, 7 బార్ అండ్ రెస్టారెంట్లు ఉండగా మరో 5 కొత్తగా మంజూరయ్యాయి. తద్వారా ప్రతి నెలా రూ.60కోట్ల నుంచి రూ.65 కోట్ల వరకు ఆదాయం రానున్నదని అధికారులు తెలిపారు.
బార్ అండ్ రెస్టారెంట్స్‌కు పన్ను రాయితీ..
లాక్డౌన్ సమయంలో దుకాణాలు మూసేసినందుకు గాను బార్ అండ్ రెస్టారెంట్లకు సైతం ప్రభుత్వం పన్ను మినహాయింపు కల్పించింది. సాధారణంగా యాజమాన్యాలు ఏటా రెన్యువల్‌కు ఫీజు రూపంలో లక్ష చెల్లిస్తాయి. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని బార్లకు రూ.42లక్షలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న బార్లకు ఏడాదికి రూ.30లక్షల చొప్పున పన్ను చెల్లించాల్సి ఉన్నది. ఈ మొత్తాన్ని యజమాన్యాలు ఏడాదిలో రెండు విడుతల్లో చెల్లిస్తాయి. రెన్యువల్ ఫీజును సెప్టెంబర్ 30 లోపు చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతం ఉన్న లైసెన్స్‌తోనే నవంబర్ 30 వరకు విక్రయించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
గౌడ కులస్తులకు మరింత ప్రోత్సాహం…
ముఖ్యమంత్రి కేసీఆర్ గౌడ కులస్తులకు మరింత ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు అమలు చేశారు. దాంతో గౌడ కులస్తులు మద్యం వ్యాపారంలో రాణిస్తారు. ఇప్పటికే ప్రభుత్వం గౌడ కులస్తులను ప్రోత్సహిస్తూ తాటి, ఈత వనాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాలో నీరా తయారీ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
వెనుకబడిన, దళిత గిరిజన వర్గాలకు సదవకాశం
వెనుకబడిన, దళిత గిరిజన వర్గాలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ అమలు చేయడం గొప్ప విషయం. కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. రిజర్వేషన్ల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దళిత, బడుగు, బలహీన వర్గాలు ఉన్నత స్థాయిని చేరుకోవాలి.