రెవెన్యూ సంస్కరణల్లో విప్లవాత్మకమైన ధరణి పోర్టల్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్నది. అవినీతి రహిత, పారదర్శక సేవలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 29న
అమల్లోకి తెచ్చిన పోర్టల్.. ప్రారంభంలో చిన్నచిన్న ఆటంకాలు ఎదుర్కొన్నా సమస్యను
అధిగమిస్తూ పూర్తిస్థాయిలో సబ్బండ వర్గాల మన్ననలను పొందుతున్నది. జిల్లావ్యాప్తంగా
17 మండలాల్లోని తాసీల్దార్ కార్యాలయాల్లో నిర్విరామంగా సేవలందిస్తున్నది. ఏడాది కాలంలో గిఫ్ట్ డీడ్స్, మార్టిగేజ్‌కు సంబంధించి 31,443,వాసరత్వ ఫౌతీలు 2,486, మ్యుటేషన్‌కు
సంబంధించి 9,850 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ సక్సెస్‌లో భాగస్వాములైన అధికార
యంత్రాంగానికి కలెక్టర్ పమేలా సత్పతి అభినందనలు తెలిపారు.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత భూ రిజిస్ట్రేషన్ కోసం దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎవరికీ రూపాయి లంచం ఇవ్వాల్సిన పని కూడా లేదు. పట్టాదారు పాసుపుస్తకం కోసం రోజుల తరబడిగా కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి అంతకన్నా లేదు. రిజిస్ట్రేషన్ కోసం ఒక కార్యాలయానికి, మ్యుటేషన్ కోసం మరో కార్యాలయానికి వెళ్లాల్సిన పని కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చిటికెలో అవుతున్నది. రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలన్నది కూడా మనమే నిర్ణయించుకునే వెసులుబాటు ఉండడంతో రిజిస్ట్రేషన్ సమయానికి వచ్చి నిమిషాల్లోనే పట్టా పొందవచ్చు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితో వచ్చిన మార్పులు ఇవి. ఏళ్లనాటి భూ సమస్యలకు చెక్ పెట్టేలా ఉన్న ధరణి పోర్టల్‌ను చూసి రెవెన్యూ అధికారులు ఊపిరిపీల్చుకుంటుండగా.. శ్రమ తగ్గి, పారదర్శకత పెరిగిందంటూ ప్రజానీకం కొనియాడుతోంది. సీఎం కేసీఆర్ మూడేండ్ల కష్టానికి ప్రతిఫలాలు కండ్లెదుట కనిపిస్తుండడంతో అన్నివర్గాల ప్రజానీకం తెలంగాణ ప్రభుత్వానికి ముక్తకంఠంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నది.
ఏడాదిలో ..
ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏండ్ల తరబడిగా ఉన్న ఎన్నో భూ సమస్యలకు పరిష్కారాన్ని చూపింది. రిజిస్ట్రేషన్ సేవలు సైతం ప్రజలకు అత్యంత చేరువయ్యాయి. ఏడాది కాలంలో అద్భుత ఫలితాలను అందించింది. ఈ క్రమంలోనే జిల్లాలో గిఫ్ట్ డీడ్స్, మార్ట్గేజ్ కలిపి 31,925 స్లాట్స్ బుక్ కాగా, 31,433 రిజిస్ట్రేషన్లు సవ్యంగా పూర్తయ్యాయి. అలాగే వారసత్వ ఫౌతీలకు సంబంధించి 2,635 స్లాట్స్ బుక్కాగా, 2,486 రిజిస్ట్రేషన్లు జరిగాయి. మ్యుటేషన్‌కు సంబంధించి 10,132 స్లాట్స్ బుక్కాగా..9,850 రిజిస్ట్రేషన్లు జరిగాయి.
‘ధరణి’ ప్రత్యేకతలివీ..
ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ ఉన్నాయి.
అడ్వాన్స్‌గా స్లాట్ బుకింగ్ సౌకర్యం, బయోమెట్రిక్ నిర్ధారణ
ప్రతి సర్వే నంబర్‌కు మార్కెట్ విలువ నిర్ధారణ
రిజిస్ట్రేషన్లతోపాటే మ్యుటేషన్.
రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ సుంకం మొత్తం ఆటోమెటిక్‌గా నిర్ధారణ. అన్లైన్ చెల్లింపుల సౌలభ్యం
అక్కడికక్కడే ఈ-పట్టాదార్ పాస్ పుస్తకం జారీ, పోస్ట్ ద్వారా పాస్ పుస్తకం బట్వాడా.
నిషేధిత భూములకు ఆటో-లాక్ విధానం
అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పోర్టల్‌లో మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటు
జిల్లాలోవిజయవంతంగా అమలు
జిల్లాలో ఏడాది కాలంలో ధరణి పోర్టల్ ద్వారా విజయవంతంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. రెవెన్యూ పాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ఫ్రూఫ్‌గా ఉండే పోర్టల్ ఇది. జిల్లాలో ధరణిని సమర్థవంతంగా అమలు చేయడంలో పాలుపంచుకున్న ప్రతి అధికారికీ అభినందనలు. పూర్తి సహాయ, సహకారాలు అందిస్తూ, నిరంతర మార్గదర్శకంగా నిలిచిన రాష్ట్ర స్థాయి అధికారులకు ధన్యవాదాలు. ధరణిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ప్రజలందరినీ కోరుతున్నా.