ఆలేరు టౌన్, అక్టోబర్ 28 : నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. దీంతో అద్దె ఇండ్లల్లో, పూరి గుడిసెల్లో ఉంటూ అవస్థలు పడుతున్న వారి కష్టాలు తీరనున్నాయి. ఆలేరు నియోజకవర్గంలో 382 ఇండ్లు మంజూరు కాగా దాదాపుగా అన్నీ పూర్తయ్యాయి.
57.27 కోట్లతో నిర్మాణం
ఆలేరు నియోజకవర్గంలో ఇండ్ల నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేయడంతో పాటు త్వరగా పూర్తి చేసేలా నిత్యం పర్యవేక్షణ చేశారు. నియోజకవర్గంలో 382 ఇండ్ల నిర్మాణానికి రూ. 57.27 కోట్లు ఖర్చు చేశారు. ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో సర్వే నం.1026లో కొలనుపాకలో 64 ఇండ్లు మంజూరు కాగా వాటి నిర్మాణం పూర్తయ్యింది. ఆత్మకూరు (ఎం)లో 49, ఉప్పల్పహాడ్లో 45, తుర్కపల్లిలో 40, మోటకొండూరులో 40, మాసాయిపేటలో 40, వంగపల్లిలో 40 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. కొలనుపాకలో 64 ఇండ్లకు గానూ 16 ఇండ్లల్లో కొన్ని పనులు చేపట్టాల్సి ఉంది.
పంపిణీకి సిద్ధం
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ బాధ్యతను ఆర్అండ్బీ శాఖకు అప్పగించింది. ఆ శాఖ ఆధ్వర్యంలో ఇండ్ల నిర్మాణంతో పాటు ఆయా ప్రాంతాల్లో వసతులను కూడా కల్పించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఇండ్లన్నీ నిర్మాణం పూర్తి చేసుకొని త్వరలో అర్హులైన లబ్ధిదారులకు అందజేయనున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పనులను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పర్యవేక్షిస్తూ వాటిని త్వరగా పూర్తి చేయించారు. పూర్తయిన ఇండ్లను పంపిణీ చేసేందుకు రెవెన్యూ అధికారులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 8 వరకు దరఖాస్తులను స్వీకరించారు. ఆయా గ్రామాలకు చెందిన నిరుపేదలు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఆలేరులో 509, కొలనుపాకలో 141 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ నిబంధనలు
అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. అందులో భాగంగా ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు స్థానికుడై ఉండాలి, ఆహారభద్రతా కార్డు కలిగి ఉండాలి, ప్రభుత్వం నుంచి గతంలో ఎలాంటి లబ్ధి పొందకుండా ఉండాలి. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగి, వ్యవసాయ భూములు, ఇంటి స్థలం కలిగిన వారు అర్హులుగా నిర్దేశించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, మైనార్టీలకు 7శాతం, ఇతర వర్గాలకు 43 శాతం వంతున లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎస్సీలకు 17శాతం, ఎస్టీలకు 6శాతం, మైనార్టీలకు 12శాతం, ఇతరులకు 65శాతం కోటా కేటాయించారు.
అర్హులను గుర్తించి అందిస్తాం
అర్హులైన పేదలకే డబుల్బెడ్రూం ఇండ్లు దక్కుతాయి. ఆలేరులో 509, కొలనుపాకలో 141 మంది దరఖాస్తు చేసుకున్నారు. సొంత ఇండ్లు లేని పేదలనే రెండు పడక గదుల ఇండ్ల కోసం ఎంపిక చేస్తాం. ప్రభుత్వ నిబంధనల మేరకే ఎంపిక ఉంటుంది.
-గణేశ్‌నాయక్, తాసీల్దార్, ఆలేరు
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
రెండు పడక గదుల ఇండ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ప్రభుత్వం అధికారులకు అప్పగించింది. వారు దరఖాస్తులను కూడా స్వీకరించారు. సొంతిల్లు లేని పేదలకే ఇండ్లు ఇవ్వనున్నారు. పేదల సొంతింటి తీర్చేందుకు సీఎం కేసీఆర్ డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.
వస్పరి శంకరయ్య, మున్సిపల్ చైర్మన్, ఆలేరు