అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, సీఎం కేసీఆర్ పాలన పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరిలో నిర్వహించిన టీఆర్ఎస్ నియోజకవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. స్వరాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు తుడిచి పెట్టుకుపోయాయని, వలసలు వెళ్లిన జిల్లాకే తిరిగి వలసలు పెరిగాయని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రణాళికా బద్ధంగా చేపడుతుండడంతో నేడు టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారిందని తెలిపారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
భువనగిరి కలెక్టరేట్, అక్టోబర్ 27 : ఎన్నిక ఏదైనా.. టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థుల ఎన్నిక ఖాయమని, జాతీయ పార్టీల నాయకులు ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడిగే ధైర్యం లేదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని సాయి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వరాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు తుడిచిపెట్టుకుపోయాయని, ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతకు నిదర్శనమని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు రూపొందించి వాటిని అమలు చేస్తున్న గొప్ప ప్రజానాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి లేదని గుర్తుచేశారు. రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేకుండా అనునిత్యం ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందింస్తున్న రాష్ర్టాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు. బీజేపీ నాయకులకు దమ్మూ, ధైర్యం ఉంటే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు నిజం కాదని నిరూపించాలన్నారు.
60 ఏండ్ల చీకటిని పారదోలిన వెలుగు దివిటీ..
సమైక్య పాలనలో 60ఏండ్లు గోసపడ్డ తెలంగాణ తల్లికి విముక్తిని ప్రసాదించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. అంధకారంలో ఉన్న రాష్ర్టాన్ని అభివృద్ధిపథంలో ముందుకు నడిపించిన వెలుగు దివిటీ అని కొనినయాడారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఏడేండ్లలో వందేండ్ల అభివృద్ధిని ప్రజల కండ్లముందు ఆవిష్కరించారని, అలాంటి నాయకుడికి ప్రజలంతా అండగా ఉండాలన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలకు ప్రజలు సరైనరీతిలో గుణపాఠం చెబుతారన్నారు.
ఎవరి ఆలోచనలకూ అందని కేసీఆర్..
ఎవరి ఆలోచనలు, అంచనాలకు అందని ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉద్యమ ప్రస్తానం మొదలు పార్టీ పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రి స్థాయిలో అనునిత్యం ప్రజాసంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. అలాంటి మహానాయకుడి కాలు గోటికి సైతం ప్రతిపక్షాలు సరిపోవన్నారు. మరో వంద జన్మలెత్తినా కేసీఆర్ స్థాయిలో ఆలోచించే శక్తి ప్రతిపక్షాలకు రాదన్నారు. ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్కు ప్రజలు పట్టం కడుతున్నారని గుర్తుచేశారు. 2014, 2018 ఎన్నికల్లో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా ప్రజలు తీర్పునిచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు ఎదురులేదని చెప్పారు.
టీఆర్ఎస్ కార్యకర్తలుగా గర్వపడాలి…
ఉద్యమ చరిత్ర కలిగిన పార్టీకి కార్యకర్తలైనందుకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గర్వపడాలని పేర్కొన్నారు. అనునిత్యం ప్రజలతో మమేకమై ఉద్యమ కాలం నుంచి వెన్నంటి ఉన్న కార్యకర్తలకు టీఆర్ఎస్ పాలనలో మంచిరోజులు వస్తాయన్నారు. బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. వరంగల్‌లో జరిగే బహిరంగసభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు, అన్నివర్గాల ప్రజలు, కార్యకర్తలు సభకు సకాలంలో హాజరయ్యేలా స్థానిక నాయకులు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పార్టీ కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని, పార్టీలో కొత్త, పాత భేదాభిప్రాయాలు లేకుండా సమిష్టిగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్రావు, ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ కొలుపుల అమరేందర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాసు రమేశ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చందుపట్ల వెంకటేశ్వర్రావు, శెట్టి బాలయ్యయాదవ్, పైళ్ల రాజవర్ధన్‌రెడ్డి, గాదె నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు ఏవీ కిరణ్‌కుమార్, జనగాం పాండు, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మున్సిపల్, పీఏసీఎస్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.