ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల రక్షణ, భద్రతలకు విద్యాశాఖ ప్రాధాన్యం కల్పిస్తున్నది. పాఠశాలల్లోని బోధన, బోధనేతర సిబ్బందిలో ఒకరిని స్టూడెంట్ సేఫ్టీ ఆఫీసర్గా, మరొకరిని చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా నియమించుకోవాలని సూచించింది. దీంతో సమాజంలోని మంచి, చెడు విషయాలను విద్యార్థులకు తెలియచెప్పి వారిపై పూర్తి నిఘా పెట్టే విధంగా చర్యలు తీసుకోనున్నది.
భువనగిరి కలెక్టరేట్ అక్టోబర్ 27 : ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల రక్షణ, భద్రతకు ప్రాధాన్యమిస్తూ కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. సేఫ్టీ, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లను నియమించాలనే ఆదే శాలతో విద్యార్థులపై తల్లిదండ్రులకు ఉన్న ఆందోళనలు తొలగిపోనున్నాయి.కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని పిల్లల కోసం సేఫ్టీ, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లను నియమించనున్నారు. ఈ నియామకాల కోసం ఆయా పాఠశాలల్లోని బోధన, బోధనేతర సిబ్బంది నుంచి ఒకరిని స్టూడెంట్ సేఫ్టీ ఆఫీసర్గా, మరొకరిని చైల్డ్ ప్రొటెక్షన్ అధికారిగా నియమించుకోవాలని ఆదేశించింది. అంతేగాక శాశ్వత ప్రాతిపదికన పనిచేసే వారినే సేఫ్టీ అధికారులుగా నియమించాలని తెలిపింది. ఈక్రమంలో సేఫ్టీ ఆఫీసర్లు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు ఐదేళ్లుగా అదే పాఠశాలలో పనిచేసి ఉండాలనే నిబంధనను విధించింది. పాఠశాల విద్యార్థుల మంచి చెడులను పరిశీలించి అనునిత్యం సంధానకర్తలుగా సేఫ్టీ, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు వ్యవహరించనున్నారు. వీరి నియామకాల్లో నిబంధనలు తప్పక పాటించాలని ఆదేశాలిచ్చింది. అందులో భాగంగా వీరి నియామకానికి ఆయా పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది అదే పాఠశాలలో ఐదేళ్లు పనిచేసి ఉండాలనే షరతు విధించింది. పాఠశాలల్లో సేఫ్టీ ఆఫీసర్లు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులను నియమించడం సంతోషక రమని పలువురు అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు.
విద్యాశాఖ నిర్ణయం హర్షణీయం
పాఠశాలల్లో సేఫ్టీ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ల నియామాకాలు చేపట్టాలనే కేంద్ర విద్యాశాఖ నిర్ణయం హర్షణీయం. ప్రతీ పాఠశా లలో విద్యార్థులకు అనుగుణంగా సేఫ్టీ, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లలో మహిళా టీచర్లకు ఒకరికి అవకాశం కల్పించాలి. విద్యార్థులకు చదువుతో పాటుగా సమాజం మనుగడ తదితర అంశాలపై ఎప్పటి కప్పుడు విస్తృత అవగాహనలు చేపట్టాల్సిన అవసరముంది.
పాఠశాల విద్య మరింత బలోపేతం
కేంద్ర విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్య మరింతగా బలోపేతం అవుతుంది. ప్రతి పాఠశాలలో సేఫ్టీ, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లుగా ఆయా పాఠశాలల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందిని నియమించడం సంతోషకరం.