యాదాద్రి, అక్టోబర్ 24 : యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి బారులుతీరిన భక్తులతో బాలాలయ సముదాయాలు, మొక్కు పూజలతో మండపాలు కిక్కిరిసిపోయాయి. వారాంతపు సెలవుదినం కావడంతో ఆదివారం యాదాద్రీశుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో యాదాద్రి పోటెత్తింది. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించుకునేందుకు గంటల కొద్దీ క్యూ కట్టారు. రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలను అనమతించలేదు. స్వామివారి ధర్మదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మొదలైంది. నారసింహుడికి నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపారు. కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సం ఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం చేశారు. కొండకింద పాతగోశాల వద్ద వ్రత మండపంలో జరిగిన సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. శ్రీవారి ఖజానాకు రూ.17,60,736 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 2,65,342
వీఐపీ దర్శనాలు 2,20,650
రూ.100 దర్శనం టిక్కెట్ 23,100
వేద ఆశీర్వచనం 6,708
నిత్యకైంకర్యాలు 500
సుప్రభాతం 1,600
క్యారీబ్యాగుల విక్రయం 7,600
టెంకాయల విక్రయం 60,000
వ్రత పూజలు 66,000
కల్యాణకట్ట టిక్కెట్లు 43,400
ప్రసాద విక్రయం 6,80,325
శాశ్వత పూజలు 71,160
వాహన పూజలు 17,900
టోల్గేట్ 2,780
అన్నదాన విరాళం 33,700
సువర్ణ పుష్పార్చన 1,37,996
యాదరుషి నిలయం 73,540
పాతగుట్ట నుంచి 48,135
గోపూజ 300