రామన్నపేట, అక్టోబర్ 31 : జనం గుండెల్లో చోటు సంపాదించుకున్న స్వాతంత్య్ర సమరయోధుడు వేమవరపు మనోహర్ పంతులు జనం మనిషి అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అన్నారు. మండలంలోని జనంపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన మనోహర్ పంతులు సంస్మరణ సభలో వారు పాల్గొని ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించి మాట్లాడారు. ప్రతి పేదవాడికీ విద్యను అందించాలనే లక్ష్యంతో గురుకుల బాలికల పాఠశాలకు పది ఎకరాలు, ఉన్నత పాఠశాలకు మూడు ఎకరాలు భూమిని దానం చేశారన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా బందూకులతో పోరాటం చేసి నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడే విధంగా కృషి చేసిన మహోన్నతుడు అని కొనియాడారు. అనాథాశ్రయాలు, అంధుల పాఠశాలలకు, పేదల, అనాథల చదువుల కోసం ఆర్థిక సాయం చేసి ఎందరినో డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజినీర్లుగా తీర్చిదిద్ది వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. మనోహర్ పంతులు ఆశయ సాధనకు కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఎంపీటీసీ వేమవరపు సుధీర్‌బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో లక్ష్మీనరసింహస్వామి మున్నూరు కాపు ట్రస్ట్ సభ్యులు పలుగుల శ్రీనివాస్, ఉప్పాల నర్సింహులు, సింగం సత్తయ్య, వేముల రవీందర్, ప్రముఖ సాహితీవేత్త కూరెళ్ల విఠ లాచార్య, నాయకులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కొండేటి మల్లయ్య, చకిలం అనిల్‌కుమార్, దైద రవీందర్, సర్పంచ్ రేఖ యాదయ్య, నక్క యాదయ్య, పోచబోయిన మల్లేశం, మిర్యాల మల్లేశం పాల్గొన్నారు.