గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తున్న సారా మహమ్మారికి అంతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం తయారీ స్థావరాలు, ముడి సరుకు విక్రయదారులపై ఉక్కుపాదం మోపింది. కూకటివేళ్లతో పెకిలించివేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలనుకనుగుణంగా గుడుంబా ప్రభావిత ప్రాంతాలను ఆబ్కారీ శాఖ జల్లెడ పట్టి సారాను సమూలంగా రూపుమాపే దిశగా చర్యలు చేపట్టింది. యాదాద్రి భువనగిరిని సారా రహిత జిల్లాగా మార్చేందుకు సంబంధిత శాఖ అధికారులు ఐదేండ్లుగా అమలు చేస్తున్న కార్యాచరణ అద్భుత ఫలితాలను ఇచ్చింది. ఒకప్పుడు వేల సంఖ్యలో నమోదైన కేసులు నేడు రెండంకెలను మించడం లేదు. సారా విక్రయాలపై ఆధారపడి జీవిస్తున్న 81 కుటుంబాలకు ‘చేయూత’ కల్పించడంతో ప్రత్యామ్నాయ వృత్తుల్లో గౌరవప్రదమైన జీవితాన్ని సాగిస్తున్నాయి.
సారా తయారీతో ఎన్నో కుటుంబాలకు జీవనోపాధి కలుగుతున్నప్పటికీ.. దీని బారిన పడి అనేక కుటుంబాలు బలవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఐదేండ్లుగా మహమ్మారిని తరిమికొట్టేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు విస్తృత దాడులు నిర్వహించి సారాను ధ్వంసం చేయడంతో పాటు కేసులు నమోదు చేశారు. బైండోవర్లతో భారీగా జరిమానాలు విధించారు. అవసరమైతే పీడీ యాక్ట్‌లను సైతం అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఉత్పత్తిదారులు, ముడిసరుకు పంపిణీ దారులు, మధ్యవర్తుల జాబితాలను రూపొందించి కఠిన చర్యలకు దిగడంతో జిల్లాలో క్రమక్రమంగా పల్లెలు సారా రహిత గ్రామాలుగా మార్పు చెందుతూ వచ్చాయి.
జిల్లా ఆవిర్భావం నాటి నుంచే జిల్లాలో ఎక్సైజ్ శాఖ పకడ్బందీ కార్యాచరణతో కఠిన చర్యలు చేపట్టింది. సారాను సమూలంగా రూపుమాపే దిశగా సంబంధిత శాఖ అధికారులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. జిల్లాలో సారాను సమూలంగా నిరోధించడంలో అధికారులు విజయం సాధించారు. జిల్లాలో ఉన్న భువనగిరి, రామన్నపేట, ఆలేరు, మోత్కూరు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో నమోదవుతున్న కేసుల గణాంకాలే సారా విక్రయాలు తగ్గాయనడానికి నిదర్శనం. జిల్లా ఏర్పాటుకు ముందు వేలల్లో కేసులు నమోదుకాగా..ప్రస్తుతం ఏడాదిలో ముఫ్పైకి మించడం లేదు. కరోనా సమయంలో చాలామంది యువత తండాలకు తిరిగొచ్చి సారా తయారీకి పూనుకోవడంతో కొంతమేర కేసులు పెరగగా.. ఆబ్కారీ శాఖ అధికారులు చేపట్టిన విస్తృత దాడుల నేపథ్యంలో తిరిగి కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాదిలో కేవలం 18 కేసులు మాత్రమే నమోదు కాగా.. 40 లీటర్ల సారా మాత్రమే లభ్యమైంది. ముడిసరుకును అందిస్తున్న బెల్లం, పటిక దుకాణాలు సైతం జిల్లాలో మూతబడ్డాయి.
‘చేయూత’తో 81 కుటుంబాలకు ఉపాధి
సారా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘చేయూత’ పథకం జిల్లాలో మంచి ఫలితాలను ఇచ్చింది. పథకం అమలులో భాగంగా సారా వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న 81 కుటుంబాలను ఉమ్మడి జిల్లాలోనే గుర్తించినప్పటికీ కార్యాచరణ మాత్రం జిల్లా ఆవిర్భావం తర్వాతనే మొదలైంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిని ఎంపిక చేసి వారిపై 2015-16 మధ్యకాలంలో నమోదైన కేసులు, పడిన శిక్షలను పరిగణలోకి తీసుకున్నారు. పూర్తిగా గుడుంబా తయారీపైనే ఆధారపడిన కుటుంబాలు జిల్లాలో 81 ఉన్నట్లు గుర్తించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలుగా వర్గీకరించి చేయూత పథకం కింద సాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. ఎస్టీ కేటగిరీ కింద 7 కుటుంబాలకు, ఎస్సీ కింద 16 కుటుంబాలకు, బీసీలు 57 మందికి, ఇతరులు ఒక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించి యూనిట్లను ఏర్పాటు చేశారు. 27 మందికి గొర్రెల యూనిట్లను, 30 మందికి కిరాణా దుకాణాలను ఏర్పాటు చేయించగా..మిగతా 24 మందికి క్లాత్, టెంట్ హౌజ్ వంటి ఉపాధి మార్గాలను కల్పించారు. ప్రభుత్వం అందించిన సాయంతో ఆయా కుటుంబాలు సారా తయారీని వదిలేసి కొత్త వృత్తులలో సగర్వంగా జీవిస్తున్నాయి.
ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేరుస్తున్నాం
ఏ ఒక్క గ్రామంలో కూడా సారా క్రయ విక్రయాలు జరగకూడదన్న దృఢమైన సంకల్పంతో చర్యలకు దిగుతున్నాం. సారా స్థావరాలపై దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేయడంతో ఐదేండ్లలో విక్రయాలు గణనీయంగా తగ్గాయి. ఇప్పటివరకు పీడీ యాక్ట్‌ను అమలుచేసే అవసరం కూడా రాలేదు. అక్కడక్కడా ఒక్కటీ, రెండు చోట్లా మినహా జిల్లా అంతటా నాటుసారా నిర్మూలన జరిగింది. మా శాఖ అధికారులు, సిబ్బంది సమష్టిగా కృషిచేసి ప్రభుత్వ సంకల్పాన్ని పూర్తిగా నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నాం.