యాదాద్రి, అక్టోబర్ 31 : పంచనారసింహుడిగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వయంభువుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో యాదాద్రి సందడిగా మారింది. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించాలని గంటల కొద్దీ క్యూలో నిల్చున్నారు. రద్దీతోపాటు ఆలయ పునర్నిర్నాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో వాహనాలను కొండపైకి అనుమతించలేదు. స్వామివారి పాదాల నుంచి పాత గోశాల వద్దకు వాహనాలను మళ్లించారు. స్వామివారి ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి మొదలైంది. నారసింహుడికి నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులను అభిషేకించి సుప్రభాతం నిర్వహించిన అర్చకులు స్వామిని ఆరాధిస్తూ పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించి శ్రీసుదర్శన నారసింహ హోమం ద్వారా కొలిచారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపారు. కల్యాణమూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణతంతు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు చేశారు. శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరునికి రుద్రాభిషేకం చేశారు. నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. కొండకింద పాత గోశాల వద్ద గల వ్రత మండపంలో జరిగిన సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు పాల్గొని వ్రతమాచరించారు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. శ్రీవారి ఖజానాకు రూ. 17,82,857 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 2,60,764
వీఐపీ దర్శనాలు 25,800
వేద ఆశీర్వచనం 11,352
నిత్య కైంకర్యాలు 1,200
సుప్రభాతం 3,200
క్యారీబ్యాగుల విక్రయం 11,000
టెంకాయల విక్రయం 51,000
వ్రత పూజలు 62,000
కల్యాణకట్ట టిక్కెట్లు 36,800
ప్రసాద విక్రయం 7,41,505
శాశ్వత పూజలు 20,232
వాహన పూజలు 15,200
టోల్గేట్ 3,280
అన్నదాన విరాళం 36,783
సువర్ణ పుష్పార్చన 1,23,212
యాదరుషి నిలయం 90,400
పాతగుట్ట నుంచి 51,071
గోపూజ 550
ఇతర విభాగాలు 12,508