రాష్ట్ర స్థాయిలో హాజరుకానున్న జూనియర్ బాలుర జట్లుభువనగిరిలో ఏర్పాట్లు పూర్తి
భువనగిరి అర్బన్, నవంబర్ 9 : 5వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర అంతర్ జిల్లాల హకీ టోర్నమెంట్ యాదాద్రి భువనగిరి జిల్లా హాకీ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 12న జిల్లా కేంద్రంలో ప్రారంభంకానున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతర్ జిల్లాల రాష్ట్ర స్థ్థాయి హాకీ పోటీలు యాదాద్రి భువనగిరి జిల్లాలో జరుగడం ఇదే ప్రథమం. ఈ పోటీలకు రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లోని 10 జట్లు పాల్గొననున్నాయి. 12న పోటీల ప్రారంభోత్సవం, 13న మ్యాచ్‌లు, 14న ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. గెలుపొందిన జట్లకు అదేరోజు సాయంత్రం బహుమతులు అందించనున్నారు.
పాల్గొనే జట్లు ఇవి..
హాకీ పోటీల్లో నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబాబ్‌నగర్ జిల్లాల జట్లు పాల్గొంటాయి. ఒక్కొక్క జట్టులో 16 మంది క్రీడాకారులతోపాటు ఇద్దరు అదనపు క్రీడాకారులు, ఒక కోచ్, ఒక మేనేజర్‌తో పాటు మొత్తం 20 మంది ఉంటారు. మొత్తం 10 జట్లు కలిపి 250 మంది రానున్నారు. పోటీల నిర్వహణకు 10 మంది ఎంపైర్స్తో పాటు పోటీల పర్యవేక్షణకు భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, రాష్ట్ర హాకీ సెక్రటరీ ఎన్.ముఖేశ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నెల 12న మార్చ్ఫాస్ట్ నిర్వహించిన అనంతరం కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ నారాయణరెడ్డి జ్యోతి ప్రజ్వళన చేసి పోటీలను ప్రారంభించనున్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డితోపాటు పలువురు అతిథులు గెలుపొందిన వారికి బహుమతులు అందించనున్నారు.
అట్టహాసంగా నిర్వహించనున్నాం..
5వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర అంతర్ జిల్లాల హాకీ పోటీలను అట్టహాసంగా నిర్వహించనున్నాం. ఈ పోటీలు భువనగిరి పట్టణ పరిధి నల్లగొండ రోడ్డులో గల న్యూ డై మెన్షన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రౌండ్స్ సువాలి ఎస్టేట్స్ క్యాంపస్‌లో జరుగుతాయి. ఇప్పటికే గ్రౌండ్‌ను చదును చేయడంతోపాటు క్రీడాకారులు, కోచ్‌లకు అన్ని వసతులు ఏర్పాటు చేశాం.
బి.కిరణ్‌కుమార్‌గౌడ్, హాకీ సమాఖ్య అధ్యక్షుడు, యాదాద్రి భువనగిరి జిల్లా