ఆలేరు రూరల్, నవంబర్ 7 : కరోనాను ఖతం పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగా టీకాలు అందిస్తోంది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేస్తున్నది. అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు పెట్టి మరీ వ్యాక్సిన్ వేస్తున్నారు. ఆలేరు మండలంలోని అన్ని గ్రామాల్లో టీకాల కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఇంకా మిగిలిపోయిన వారిని గుర్తించి టీకా వేయిస్తున్నారు.
పలు గ్రామాల్లో పూర్తి
అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు మండలంలోని 12 గ్రామాల్లో వందశాతం టీకాలు వేశారు. శ్రీనివాసపురం, కొల్లూరు, శారాజీపేట, మందనపల్లి, మంతపురి, రాఘవాపురం, తూర్పుగూడెం, కందిగడ్డతండా, గుండ్లగూడెం, శర్బనాపురం, పటేల్‌గూడెం, గొలనుకొండ గ్రామాల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు వైద్య సిబ్బందిని ఘనంగా సన్మానించారు.
5399 మందికి మొదటిడోస్
నెల రోజుల క్రితం వరకు టీకా కోసం పీహెచ్‌సీల వద్ద ప్రజలు బారులు దీరారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం సరిపడా టీకాలు అందిస్తుండడంతో పాటు గ్రామాల్లోనే ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి టీకాలు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మండలంలోని 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతమైంది. ప్రతి గ్రామానికో కేంద్రాన్ని ఏర్పాటు చేసి టీకాలు వేస్తున్నారు. సర్పంచులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 5399 మందికి మొదటి డోస్‌ను పూర్తి చేశారు.
అర్హులందరికీ టీకా వేయించాం
ఆలేరు మండల వ్యాప్తం గా 18 ఏండ్లు నిండిన వారందరికీ టీకా వేయిం చాం. చాలా గ్రామాల్లో 100 శాతం మొదటిడోస్ వ్యాక్సినేషన్ పూర్తయినందుకు సంతోషంగా ఉంది. సహకరించిన అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు. రెండో డోసు కూడా 90శాతం మందికి వేయించాం. వాటిని కూడా పూర్తి చేస్తాం.
-ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్‌రావు, ఆలేరు
త్వరలో వందశాతం పూర్తిచేస్తాం
వందశాతం వ్యాక్సినేషన్ దిశగా మండలం ముందుకు సాగుతుంది. 14 గ్రామ పంచాయతీలకు గానూ 12 గ్రామ పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సహకారంతో ఇప్పటికే వందశాతం కరోనా వ్యాక్సిన్ పూర్తయింది. మరో రెండు గ్రామాలు త్వరలోనే వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యే దిశగా కృషి చేస్తాం.
-శ్రవణ్‌కుమార్, వైద్యాధికారి