భువనగిరి అర్బన్, నవంబర్ 6 : అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అటవీ భూముల సమస్యలు పరిష్కరించడానికి చేపట్టాల్సిన చర్యలపై శనివారం భువనగిరి మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చౌటుప్పల్ మండలం లక్కవరం, నారాయణపురం మండలం కడీల బాయి తండా, పల్లగుట్ట లండా, రాచకొండ, తూంబాయి తండా, వెంకంబావి తండా, ఎనగండి తండా, తుర్కపల్లి మండలం మల్కాపురం గ్రామాలకు సంబంధించి అటవీ భూముల సమస్యలపై ఈ నెల 8న గ్రామ కమిటీల ఏర్పాటుతో గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అందుకోసం గ్రామ, డివిజన్, జిల్లా స్థాయి బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎంపీటీసీ, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఫారెస్ట్ అధికారి, పంచాయతీ కార్యదర్శి, సర్వేయర్, గిరిజనులు, మహిళలు, 10 నుంచి 15 మందితో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అటవీ భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఎఫ్ఆర్సీలతో పాటు గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అంతకు ముందు రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్‌తో సమావేశమై అటవీ భూముల సమస్యల పరిష్కారంపై చేపడుతున్న చర్యలను సమీక్షించారు. అవగాహన కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి మంగ్తానాయక్, జిల్లా ఫారెస్ట్ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి, చౌటుప్పల్ ఆర్డీఓ సూరజ్ కుమార్, తుర్కపల్లి, నారాయణపురం, చౌటుప్పల్ మండలాల తాసీల్దార్లు, ఎంపీడీఓలు, ఫారెస్ట్ అధికారులు, సర్వేయర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.