ఆసరా పింఛన్ల కోసం జిల్లాలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. నిరుపేద వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పెన్షన్లకు అర్హత వయస్సును 57ఏండ్లకు కుదించడంతో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరుగనున్నది. అక్టోబర్ 30 వరకు ప్రభుత్వం దరఖాస్తులకు రెండుసార్లు అవకాశమివ్వగా, మొత్తం 18,995 అర్జీలు అందాయి. అత్యధికంగా భువనగిరి మండలం నుంచి 2,079 దరఖాస్తులు వచ్చాయి. పరిశీలనకు సంబంధిత అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 87,739 మంది పెన్షన్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రతి నెలా రూ.20.14కోట్లను వెచ్చిస్తున్నది.
యాదాద్రి భువనగిరి, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆసరా పింఛన్లను 65 ఏండ్లు నిండినవారికి మాత్రమే ఇస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో 17 మండలాల్లో 87,739 మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రస్తుతం అర్హత వయస్సును రాష్ట్ర ప్రభుత్వం 57 ఏండ్లకు తగ్గించింది. కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు రెండు విడుతలుగా అవకాశం కల్పించింది. ఆగస్టు 31 నాటికి జిల్లాలో 17,379 మంది కొత్తగా పింఛన్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. సరైన అవగాహన లేక చాలా మంది అర్హులు దరఖాస్తు చేసుకోలేక పోవడంతో సర్కారు మరో సారి అవకాశం కల్పించింది. అక్టోబర్ 11 నుంచి 30 వరకు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించారు. దీంతో దరఖాస్తు దారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అత్యధికంగా భువనగిరి మండలం నుంచే 2,079 దరఖాస్తులు వచ్చాయి.
అనేక కుటుంబాలకు ఆసరా
రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా అందిస్తున్న పింఛన్లతో అనేక కుటుంబాలకు ఆసరా ఏర్పడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో వృద్ధులకు రూ.200, దివ్యాంగులకు రూ.500 పింఛన్ మాత్రమే వచ్చేది. ఈ కొద్దిమొత్తం వారి కనీస అవసరాలకు కూడా సరిపోవని భావించిన సీఎం కేసీఆర్ పింఛన్లను భారీగా పెంచారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు గౌరవంగా బతికేలా పింఛన్ అందిస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు. వృద్దులకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016, ఇతరులకు రూ.2,016 చొప్పున పింఛన్ అందుతున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 87,739 మంది వివిధ రకాల పింఛన్ దారుల కోసం ప్రభుత్వం రూ.20.14కోట్లు వెచ్చిస్తున్నది.
మార్గదర్శకాల ప్రకారం ఎంపిక
ఆసరా పింఛన్ వయసును 57 ఏండ్లకు తగ్గించడం వల్ల ఎంతోమందికి ప్రయోజనం కలుగనున్నది. ఈ క్రమంలో దరఖాస్తుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి రెండో దఫాగా అవకాశం కల్పించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది.