ఆలేరు టౌన్, నవంబర్ 2 : మున్సిపాలిటీల్లోని ఆస్తుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా భువన్-2 యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నది. వివరాలు నమోదు చేసుకునేందుకు ఈ నెల 15వరకు గడువును పొడిగించింది. 2017లో మొదటి విడుత సర్వే నిర్వహించారు. రెండో విడుత సర్వేను గత ఏడాది జూన్‌లో ప్రారంభించగా కరోనా నేపథ్యంలో ఆగిపోయింది. మళ్లీ ఆ సర్వేను చేపడుతున్నారు.
12 వార్డుల్లో సర్వే
ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో 5,589 నివాసాలు, 17,120 జనాభా ఉంది. ఇప్పటి వరకు 4,670 ఇండ్ల నిర్మాణాలను భువన్ పరిధిలోకి తీసుకొచ్చారు. మున్సిపాలిటీలో ప్రతిరోజూ సర్వే చేస్తున్నారు . ఈ విధానంలో వివరాలను తప్పుగా, తక్కువగా చూపడం కుదరదు. ఆస్తి పన్నులు ఎగ్గొట్టడం, అక్రమాలకు తావులేకుండా లెక్కలను పక్కాగా మదింపు చేస్తున్నారు. అసెస్మెంట్లను మ్యాపింగ్ చేసి ఆదాయం సమకూర్చుకునేలా కొలతలు వేస్తున్నారు. భవనాల వివరాలను యాప్‌లో పొందుపరిచి క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ, అప్లోడ్ బాధ్యతలను బిల్ కలెక్టర్లకు అప్పగించారు. భవనాల నిర్మాణాలు ఆన్లైన్లో నమోదైతే ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉండదు. అయితే మున్సిపల్ పరిధిలో పాత నిర్మాణాల ఆకృతులను మార్చడంతో పాటు అదనపు అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటి వివరాలను ఇండ్ల యజమానులు నమోదు చేసుకోవడం లేదు. అలాంటివి యాప్ ద్వారా నమోదు చేయనున్నారు.
ఇంటినంబర్ కేటాయింపు
ఆన్లైన్లోనే ఇంటి నంబర్ కేటాయిస్తారు. ఇంటి నంబర్‌కు ఆన్లైన్ చేసే సమయంలోనే యజమానులు ఇంటి కొలతలను సైతం నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి చెల్లించే ఆస్తి పన్నుకు ఇది ప్రామాణికం కానున్నది. తప్పుడు కొలతలు నమోదు చేస్తే దాని విలువపై 25రెట్ల జరిమానా విధిస్తారు. సర్వేలో భాగంగా ఇంటి నిర్మాణం, ఎన్ని అంతస్తులు, సౌకర్యాలు, విస్తీర్ణం, గృహ, వ్యాపార, వాణిజ్య సముదాయామా అనే వివరాలు నమోదు చేయడంతోపాటు భవనానికి సంబంధించిన చిత్రాన్ని అప్లోడ్ చేసి జియో ట్యాగింగ్ చేయనున్నారు. సర్వే పూర్తయ్యాక ఆన్లైన్లో పొందుపరుస్తారు. మున్సి పల్ చట్టానికి అనుగుణంగా లేఅవుట్లు, నిర్మాణ అనుమతుల కోసం టీఎస్‌బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి కలెక్టర్ల ఆధ్వర్యంలో అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సామాన్యులు సైతం సులభంగా భవన నిర్మాణ అనుమతులను పొందవచ్చు.
పారదర్శకతకు పెద్దపీట..
పురపాలక సిబ్బంది ఇంటింటికీ తిరిగి సర్వే చేసి జీపీఎస్ ద్వారా కొలతలు వేస్తున్నారు. ఇంటి నిర్మాణం, కట్టడాన్ని బట్టి పన్ను విధిస్తారు. ఆన్లైన్లో ఇంటి ఫొటోను అప్లోడ్ చేస్తారు. కొందరు వాణిజ్య గృహాలను సైతం నివాస గృహాలకు నమోదు చేయించుకొని తక్కువ పన్ను చెల్లిస్తున్నారు. ఆ భవనాల వైశాల్యం కంటే తక్కువ నిర్మాణం చూపించడంతో మున్సిపల్ ఆదాయానికి గండిపడుతుంది. కొన్నిచోట్ల అనుమతి లేకుండా ఇండ్లు కడుతున్నారు. అయితే సొంతంగా కూడా సెల్‌ఫోన్ ద్వారా ఇండ్ల వివరాలు నమోదు చేయవచ్చు. ఇందుకు సంబంధించి సెల్ఫోన్లో గూగుల్, ప్లేస్టోర్‌కు వెళ్లి సంబంధిత యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్‌లో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పేర్లు వస్తాయి. అందులో మున్సిపాలిటీ పేరు ఎంచుకుంటే దరఖాస్తు దారుడికి ఓటీపీ వస్తుంది. దాని ద్వారా లాగిన్ అయ్యి వివరాలు నమోదు చేయాలి. దరఖాస్తు నమోదు చేసిన వివరాల మేరకు ఆస్తిపన్ను సైతం ఆన్లైన్లో చెల్లించుకోవచ్చు.
త్వరలో పూర్తి చేస్తాం
భువన్ యాప్‌లో వివరాల నమోదుకు వచ్చే వారికి ప్రజలు సహకరించాలి. సిబ్బందిని నియమించి అన్ని వార్డుల్లోనూ సర్వే చేపడుతున్నాం. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుంది. తప్పుడు వివరాలు నమోదు చేస్తే 25 రెట్ల జరిమానా విధిస్తాం. సాయిగూడెంలో ఇంటర్నెట్ పని చేయకపోవడంతో 500 ఇండ్ల వివరాలు కాలేదు. త్వరలోనే పూర్తి చేస్తాం.
-మారుతీప్రసాద్, మున్సిపల్ కమిషనర్, ఆలేరు