హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రైతులు యూరియా అడిగితే.. సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులను ఇంటికి పంపుతున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి మండిపడ్డారు. ఆగ్రహంతో ఉన్న తెలంగాణ ప్రజానీకం సీఎంపై తిరుగబడే పరిస్థితులు వచ్చాయని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. యూరియా కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే.. పోలీసుల మనోభావాలు ఎందుకు దెబ్బతింటున్నాయని ప్రశ్నించారు.
కాంగ్రెస్ కోసం ఆ పార్టీ కార్యకర్తల కంటే పోలీసులే ఎక్కువ పని చేస్తున్నారని విమర్శించారు. యూరియా ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించిన రైతుల ఇండ్లకు పోలీసులు ఎందుకు వెళ్తున్నారని, ఎందుకు బెదిరిస్తున్నారని నిలదీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గురువారం యూరియా కొరత గురించి సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించిన రైతుపై పోలీసు అధికారే స్టేషన్లో ఫిర్యాదు చేయడం విడ్డూరమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు తమ అసలు పనులు వదిలేసి, ప్రశ్నించిన ప్రజలను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.