అమరావతి : కేంద్రం తీసుకువచ్చిన జాతీయ విద్యాహక్కు చట్టం కింద టీచర్లందరికీ టెట్ ( TET ) పరీక్షల నిర్వహించాలన్న నిబంధన నుంచి 2011 ముందు ఉన్న టీచర్లను మినహాయించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి( Y.S. Jagan ) డిమాండ్ చేశారు. టెట్ చట్టాన్ని సవరించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలన్న ధ్యాసకూడా చంద్రబాబు ( Chandra Babu ) లేకుండా పోయిందని విమర్శించారు.
అసెంబ్లీలో తీర్మానం చేసి టీచర్ల ఇబ్బందులపై కేంద్రంపై ఒత్తిళ్లు తీసుకురావాలని ట్విటర్ వేదిక ద్వారా చంద్రబాబును కోరారు. 2011 ముందు నుంచి టీచర్లుగా ఇప్పటికీ పనిచేస్తున్న వారు కూడా టెట్ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలన్న నిబంధన పెట్టడంతో దాదాపు లక్షమందికి పైగా టీచర్లు ఇబ్బందులు పడుతున్న పట్టించుకోకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.
20-25 ఏళ్లకు పైబడి కొనసాగుతున్న సబ్జెక్టు టీచర్లు, అన్ని సబ్జెక్టుల సిలబస్‌తో ఉన్న టెట్ పరీక్ష పాస్‌కావాలని, అందులోకూడా గరిష్టంగా 60శాతం మార్కులు రావాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వీళ్లంతా అప్పట్లో డీఎస్సీ ఎలిజిబిలిటీ టెస్టులో ఉత్తీర్ణులు కాబట్టే ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు. వారికి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు అప్పట్లో టెట్’ అనే పరీక్షే లేనప్పుడు, ఇప్పుడు టెట్ పరీక్షలో పాస్ కావాలని రూల్ పెట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు.
టెట్ పరీక్ష నిబంధన కారణంగా ప్రమోషన్ల సమస్యే కాకుండా, చివరకు ఉద్యోగభద్రత లేకుండా చేస్తున్నారని, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని వివరించారు. 2011 కు ముందున్న వారంతా కాంపిటేటివ్ పరీక్షలు పాసయిన తర్వాతనే ఉద్యోగాలు వచ్చాయన్నది మరిచిపోవద్దని గుర్తు చేశారు.