న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) కార్యాలయాన్ని (Wrestling Federation Office) శుక్రవారం తరలించారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసంలో ఇప్పటి వరకు ఆ కార్యాలయం కొనసాగింది. అయితే రెజ్లింగ్ ఫెడరేషన్ కొత్త అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ ఇటీవల ఎన్నిక కావడంపై రెజర్లు మరోసారి నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ స్పందించింది. డిసెంబరు 24న రెజ్లింగ్ ఫెడరేషన్ కొత్త ప్యానల్‌ను రద్దు చేసింది.
కాగా, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసంలోని ఫెడరేషన్ కార్యాలయంలో మహిళా రెజర్లపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై కోర్టులో విచారణ జరుగుతున్నట్లు క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. సంజయ్ సింగ్ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడిన డబ్ల్యూఎఫ్ఐ ప్యానల్ బ్రిజ్ భూషణ్ నియంత్రణలో ఉన్నట్లు పేర్కొంది. కొత్త కమిటీని రద్దు చేయడానికి ఇది ఒక కారణమని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) కార్యాలయాన్ని ఢిల్లీలోని హరి నగర్ ప్రాంతానికి తరలించారు. ఇకపై కొత్త చిరునామా నుంచి ఈ కార్యాలయం పని చేస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.