PM Modi : న్యూఢిల్లీ (New Delhi) లోని భారత్ మండపంలో ఇటీవల ముగిసిన ‘ఏఐ ఇంపాక్ట్ సదస్సు (AI Impact Summit)’ పై ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ప్రశంసలు కురిపించారు. దీని ద్వారా కృత్రిమమేథ (Artificial Intelligence-AI) రంగంలో భారతదేశ అద్భుతమైన సామర్థ్యాలను ప్రపంచానికి చూపించామని అన్నారు. ఆదివారం ‘మన్ కీ బాత్ (Mann Ki Baat)’ 131వ ఎపిసోడ్లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు.
భారత ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన ఈ సదస్సు ప్రపంచ దేశాలను ఆకర్షించిందని ప్రధాని చెప్పారు. ఈ సదస్సులో ముఖ్యంగా మన రెండు ఆవిష్కరణలు ప్రపంచ నేతలను ఆశ్చర్యపరిచాయని తెలిపారు. జంతువుల చికిత్స కోసం వాటిని ట్రాక్ చేయడానికి ‘ఏఐ’ని ఉపయోగించడం, భారత పురాతన గ్రంథాలు, జ్ఞానాన్ని సంరక్షించడానికి ఏఐని ఉపయోగించడం చూసి ప్రపంచ నేతలు ప్రశంసించారని అన్నారు.
నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, స్టార్టప్ రంగాలకు చెందిన వారు ఈ సదస్సుకు హాజరయ్యారని ప్రధాని తెలిపారు. కృత్రిమ మేథ, అంతరిక్ష పరిశోధన, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగిస్తూ భారత్ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. మన యువత ఆవిష్కరణలతో దేశకీర్తిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లే శక్తిని కలిగి ఉందని చెప్పారు.
ఈ సదస్సు ద్వారా మన యువత ప్రతిభను ప్రపంచానికి చూపించగలిగామని ప్రధాని అన్నారు. సైబర్ నేరాలపై ప్రధాని మోదీ హెచ్చరించారు. డిజిటల్ అరెస్టులపట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కేరళకు చెందిన 10 నెలల చిన్నారి అలిన్ షెరిన్ అవయవదానానికి ముందుకు వచ్చిన తల్లిదండ్రులను ప్రధాని ప్రశంసించారు. బిడ్డను కోల్పోయిన బాధలోనూ వారు తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు.