Ukraine War | బెర్లిన్, ఫిబ్రవరి 22: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై రష్యా ప్రారంభించిన యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని, 2022లో దాదాపు 1.6 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం జరిగిందని జర్మన్ ఎకనమిక్ ఇన్స్టిట్యూట్(ఐడ్ల్యూ) అధ్యయనం వెల్లడించింది.
ఈ ఏడాది మరో ట్రిలియన్ డాలర్ల మేర నష్టం ఉంటుందని అంచనా వేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రధానంగా పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిందని, గ్లోబల్ ప్రొడక్షన్లో మూడింట రెండొంతులు కోల్పోయాయని పేర్కొన్నది. ఇంధనం, ఇతర ముడిసరుకుల సరఫరాలో నెలకొన్న సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెంచాయని ఐడ్ల్యూ నిపుణుడు మైఖెల్ గ్రోమ్లింగ్ అన్నారు.