ఊట్కూర్ : కార్మిక, కర్షక రాజ్యం కోసం కార్మికులు ఐక్య పోరాటాలకు ( United Struggles ) సిద్ధం కావాలని పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సిద్దు ( Siddu ) పిలుపునిచ్చారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని బిజ్వార్ గ్రామంలో మే డే ఉత్సవాలను ( May Day ) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐఎంఎల్ మాస్‌లైన్ పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చౌరస్తాలో కార్మిక జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గ్రామపంచాయతీ, భవన నిర్మాణ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు పాల్గొని ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎనిమిది గంటల పని దినాలు, హక్కులు సాధించుకున్న మే 1న కార్మిక లోకం ఉత్సవాలను జరుపుకుంటుందని వెల్లడించారు. కార్మికులు తమ హక్కుల కోసం, దోపిడీ లేని సమ సమాజ సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
మేడే కార్యక్రమంలో తాపీ మేస్త్రీ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు లొడ్డ తమ్మప్ప, గ్రామపంచాయతీ కార్మిక సంఘం నాయకులు కొల్లూరు హనుమంతు, ముబారక్ అలీ, కతలప్ప, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అంజప్ప, రైతు సంఘం నాయకులు పోర్ల నరసింహులు, పిరికి రాము, తిమ్మన్న, కతలప్ప పాల్గొన్నారు. మండల కేంద్రంలోని బస్ స్టాండ్ కూడలిలో సీఐటియు జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ రెడ్డి ఆధ్వర్యంలో కార్మిక జెండాను ఎగరవేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులు, గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటియు మండల అధ్యక్షుడు నారాయణ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.