పట్నా : బిహార్ మహిళాభివృద్ధి సంస్ధ మేనేజింగ్ డైరెక్టర్ హర్జోత్ కౌర్ స్కూల్ బాలికలను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) తీవ్రంగా పరిగణించింది. బాలికలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఎన్సీడబ్ల్యూ ఆమెను కోరింది.
ఓ కార్యక్రమానికి హాజరైన హర్జోత్ కౌర్‌ను స్కూల్ బాలికలు శానిటరీ నాప్కిన్స్ కోరగా ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ అడిగిన మీరు రేపు కుటుంబ నియంత్రణ కోసం ఉచిత కండోమ్స్ కావాలని అడుగుతారని ఆమె వ్యాఖ్యానించారు.
మహిళా అధికారిణి దిగజారుడు వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర అభ్యంతరకరమని ఎన్సీడబ్ల్యూ పేర్కొంది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని హర్జోత్ కౌర్‌కు రాసిన లేఖలో ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ కోరారు.