హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 22: ఇందిరమ్మ ఇల్లు(Indiramma houses), పింఛన్ రాలేదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని మహిళలు నిలదీశారు. సోమవారం గ్రేటర్ వరంగల్ 7వ డివిజన్లోని విజయ టాకీస్ వద్ద అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే, మేయర్ అక్కడికి వచ్చిన క్రమంలో ఎమ్మెల్యేను మహిళలు ప్రశ్నించారు. ఉన్నోళ్లకే ఇందిరమ్మ ఇల్లు, పింఛన్లు ఇస్తున్నారని, ఎన్నిసార్లు దరఖాస్తులు ఇచ్చినా బయట పడేస్తున్నారు తప్ప ఇస్తలేరని మహిళ నిలదీశారు. నీకు రాకపోతే వచ్చి దరఖాస్తు చేసుకోవాలని వేరేవాళ్ల గురించి నీకెందుకు అమ్మా.. ఇప్పుడు దరఖాస్తు ఇచ్చినవ్ కదా చూస్తానని ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇందిరమ్మ ఇల్లు, పింఛన్ రావడంలేదని మహిళ వేడుకుంది.
7వ డివిజన్లో ఫ్లెక్సీ చిచ్చు..
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్ 7వ డివిజన్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చిచ్చు రేపుతున్నాయి. డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు వచ్చినవారు వచ్చినవారందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. పబ్లిక్ గార్డెన్లో, బయట, విజయటాకీస్ వద్ద భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. స్థానిక కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వచ్చారని జంప్ జిలానీలకు ఈసారి కష్టమేనని అక్కడివారు చర్చించుకోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షీ నటరాజన్ కూడా పార్టీ కోసం కష్టపడిన వారికే ప్రాధాన్యత ఇస్తారని పార్టీ మారిన వారికి కాదని, జైలుకు వెళ్లినవారు కాదని గుసగుసలు వినిపిస్తున్నాయి.