ఎంపీ సంతోష్ పిలుపునకు స్పందించిన మహిళలు
రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటిన పలువురు
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళా మొక్కలు నాటాలన్న ఎంపీ సంతోష్‌కుమార్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందించారు. మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఉత్సాహంగా గ్రీన్ చాలెంజ్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి సతీమణి సీత రంజిత్‌రెడ్డి, సినీనటి రీతూ వర్మ జమ్మి మొక్కను నాటారు. హెటిరో కంపెనీ డైరెక్టర్ రత్నాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు మొక్కలు నాటారు. హైదర్‌గూడ ఎమ్మెల్యే నివాస సముదాయంలో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు కోరుకంటి ఉజ్వల, కాలేరు పద్మ, పుట్ట శైలజ, పుష్ప, సంగీత, కోనేరు మధులిక, మంజుల, విజయ, కీర్తన, రమ్య తదితరులు మొక్కలు నాటారు. కాళ్లు, చేతులు లేకున్నా ఆర్టిస్ట్ మధు నోటితో బ్రష్ పట్టుకొని ఎంపీ సంతోష్‌కుమార్ చిత్రాన్ని గీశారు. కామినేని మెడికల్ కాలేజీలో వైద్యులు మొక్కలు నాటారు. బోరబండలో మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో , జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్‌లో టీ న్యూస్ యాంకర్లు, మొగల్‌పురలో టీ న్యూస్ ఎడిటర్ ఖాజాఖయ్యుమ్ అన్వర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.