హుజూరాబాద్: ఈటల రాజేందర్.. నా జీవితాన్ని బజారుపాలుచేయలేదని ఇల్లందకుంట రాముడిపై ఒట్టేసి చెబుతావా? అని ఓ మహిళ సవాల్ విసిరారు. తనను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీసిన ఈటల రాజేందర్‌పై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ కోట్లు కొల్లగొట్టాడని ఆరోపించారు. ఈ కుంభకోణంపై 2015లోనే సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశానని, మళ్లీ ఇప్పుడు కలుస్తానని తెలిపారు.
హైదరాబాద్ అంబర్ పేటకు చెందిన విజయలక్ష్మి ఆగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ నిర్వాహకురాలు కన్న శివకుమారి సోమవారం హుజూరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన భర్త వెంకట్ సహాయ సహకారాలతో చిన్నతనంలో వ్యాపార రంగంలోకి దిగిన తనలాంటి ఆడపడుచులను ప్రోత్సహించాల్సింది పోయి.. ఈటల రాజేందర్ తన జీవితాన్నే రోడ్డు పాలు చేశాడని మండిపడ్డారు. సుమారు రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి రాకుండా అడుగడుగునా అడ్డుపడ్డాడని సంచలన ఆరోపణలు చేశారు. ఈటల అపరిచితుడని, పెద్ద అవినీతిపరుడని మండిపడ్డారు. రేషన్ షాపులకు ప్రభుత్వం అందించే నిత్యావసర వస్తువులను టెండర్ ద్వారా అందించడంలో తనకు మంచి ట్రాక్ రికార్డు ఉందని, కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 800 టన్నుల కారం (చిల్లీపౌడర్), 1200 టన్నుల కందిపప్పును విష్ణు ట్రేడింగ్ కంపెనీ ద్వారా ప్రభుత్వానికి సప్లయ్ చేసినట్లు చెప్పారు. ఈటల రాజేందర్ సివిల్ సప్లయ్ శాఖా మంత్రిగా ఉన్న సమయంలో 2014 ఆగస్టులో జరిగిన టెండర్ లో కందిపప్పు సప్లయ్ ఆర్డర్ తనకు దక్కిందని తెలిపారు.
అయితే, వెయ్యి టన్నులను తక్షణమే సప్లయ్ చేయాలని 2014 సెప్టెంబర్ 13న సంబంధిత శాఖ నుంచి తనకు ఆర్డర్ కాపీ వచ్చిందని చెప్పారు. టెండర్ లో పాల్గొన్న తనకు కోటి 97 లక్షల 50 వేల రూపాయలకు టెండర్ (కందిపప్పు సప్లయ్) దక్కిందని, నిబంధనల ప్రకారం ఆ మొత్తాన్ని సివిల్ సప్లయ్ శాఖలో డిపాజిట్ చేశానని తెలిపారు. కంది పప్పును ఆంధ్రా నుంచి కొనుగోలు చేసి తీసుకువచ్చేందుకు అదనంగా మరో రెండుకోట్లు సమకూర్చుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇంత చేసినా కందిపప్పు సప్లయ్ చేయకుండా ఈటల రాజేందర్ అడ్డుపడ్డాడని, కమిషన్లు ఇవ్వనందుకే తనపై కక్షగట్టి వేధించడం మొదలుపెట్టాడని శివకుమారి ఆరోపించారు. పలు బలమైన కారణాల వల్ల కందిపప్పు సప్లైలో కొంత జాప్యం జరిగిందన్నారు. అయినప్పటికీ 2014 సెప్టెంబర్ 30 నుంచి 2014 అక్టోబర్ 5 వరకు రంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు 100 టన్నుల కందిపప్పును సరఫరా చేశామని తెలిపారు.
ముడుపులు ముట్టజెప్పలేదనే..
ముందుగా వందటన్నులు కందిపప్పును సరఫరా చేశామని, రెండు రోజుల వ్యవధిలోనే మరో వందటన్నుల కందిపప్పును జిల్లాలకు పంపించామని శివకుమారి వెల్లడించారు. అయితే కందిపప్పు క్వాలిటీగా లేదంటూ అధికారుల ద్వారా ఈటల రాజేందర్ వెనక్కు పంపారని ఆరోపించారు. సప్లయ్‌లో జాప్యం జరుగుతున్నదంటూ 2014 సెప్టెంబర్ 24న షోకాజ్ నోటీసు జారీ చేయించి తనపై ఈటల రాజేందర్ వేధింపులకు తెరలేపాడని చెప్పారు. నోటీసుకు జవాబు ఇచ్చినప్పటికీ అక్టోబర్ 10న మరో షోకాజ్ నోటీసు పంపారని చెప్పారు. 20 రోజుల గడువు ఇస్తే సప్లయ్ చేస్తానని 2014 అక్టోబర్ 15న లిఖితపూర్వకంగా ఈటల రాజేందర్‌ను వేడుకున్నానని తెలిపారు. అయినా ఈటల కనికరించలేదన్నారు. తాము డిపాజిట్ చేసిన కోటి 97 లక్షల 50 వేల రూపాయలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టించారని పేర్కొన్నారు. తాము వ్యాపారం చేయలేమని, తమ డబ్బు తిరిగి ఇప్పించండని ఏళ్లుగా వేడుకుంటున్నా స్పందించలేదన్నారు. ఇలా 2014 నుంచి 2021 వరకు అంటే ఆరేళ్లుగా తమ కోటి 97 లక్షల 50వేల రూపాయలు ఈటల నియంతృత్వంగా వ్యవహరించడంవల్ల నేటికి సివిల్ సప్లయ్ శాఖలోనే మురిగిపోతున్నాయని పేర్కొన్నారు. దీంతో అప్పులు తీర్చేందుకు తమ రెండు ఇళ్లను అమ్మేసినట్లు శివకుమారి ఆవేదన వ్యక్తంచేశారు.
తనకు జరిగిన అన్యాయం గురించి అంబర్ పేట టీఆర్ఎస్ ఇన్చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి ద్వారా 2015 ఫిబ్రవరి 25న సీఎం కేసీఆర్‌ను కలిసి ఫిర్యాదు చేశానని చెప్పారు. కందిపప్పు సప్లయ్‌లో కోట్ల కుంభకోణం జరుగుతున్నదని, సివిల్ సప్లయ్ శాఖను రాజేందర్ భ్రష్టు పట్టిస్తున్నాడని ఫిర్యాదు చేయగా, తక్షణమే అప్పటి నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్‌ను సివిల్ సప్లయ్ శాఖకు కమిషనర్‌గా నియమించారని, తెలంగాణవ్యాప్తంగా కందిపప్పు సప్లయ్ ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారని శివకుమారి వివరించారు. సప్లయ్ నిలుపుదలతో కోట్ల రూపాయలు (స్వాహా కాకుండా) కాపాడినట్లయిందని ఆమె పేర్కొన్నారు.
ఈటలపై విజిలెన్స్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశా..
బ్లాక్ లిస్టులో పెట్టిన దాదాపు రెండు కోట్ల డిపాజిట్ సొమ్మును రిలీజ్ చేయించకుండా ఈటల ఇబ్బందులు పెడుతున్నాడని 2014 నవంబర్ 27న విజిలెన్స్ కమిషనర్ అమిత్ గార్గ్‌కు ఫిర్యాదు చేశానని, ఈ కారణంగానే ప్రభుత్వం సివిల్ సప్లయ్ శాఖలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్లు శివకుమారి పేర్కొన్నారు. తన డబ్బును బ్లాక్ లిస్ట్ లో పెట్టి వివిధ కారణాలతో వ్యాపారాన్ని అడ్డుకున్న తర్వాత ఇదే సివిల్ సప్లయ్ శాఖ 2014 సెప్టెంబర్ 22న కందిపప్పు సప్లయ్ కోసం మరో టెండర్ పిలిచిందని, మూడు కంపెనీలు ఎక్కువ రేటుకు టెండర్ దక్కించుకున్నాయని వివరించారు. కందిపప్పు సప్లయ్ లో మాత్రం జాప్యం చేస్తూ వచ్చాయని ఆమె ఆరోపించారు. అయినా ఆ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోకుండా నోటీసులు మాత్రమే జారీ చేసి సివిల్ సప్లయ్ శాఖ చేతులు దులుపుకున్నదని తెలిపారు.
వాసవీ దాల్ మిల్ కంపెనీకి 60 రోజుల్లో రూ.4 కోట్లు రిలీజ్..
వాసవీ దాల్ మిల్ కంపెనీ నాసిరకం కంది పప్పును సప్లయ్ చేసిందని, కానీ ఆ కంపెనీ డిపాజిట్ చేసిన నాలుగు కోట్ల రూపాయలను బ్లాక్‌లో పెట్టి సరిగ్గా 60 రోజుల తర్వాత రూ. 17 లక్షల జరిమానా మాత్రమే విధించి మిగతా మొత్తం డబ్బును ఈటల దగ్గరుండి మరీ రిలీజ్ చేయించాడని శివకుమారి ఆరోపించారు.
ఇందులో ఆంతర్యం ఏమిటో సంబంధిత శాఖలోని ఉద్యోగులందరికి తెలిసిపోయిందన్నారు. తాము నాసిరకం పప్పు సరఫరా చేయకపోయినా… నిబంధనల మేరకు నడుచుకున్నప్పటికీ ఈటల వికృత చర్యల వల్ల.. అతని అవినీతి దాహం తీరక గత 84 నెలలుగా తమ డబ్బు సివిల్ సప్లయ్ శాఖలోనే మగ్గుతున్నదని, ఈ విషయమై సీఎం కేసీఆర్‌ను రెండు, మూడు రోజుల్లో కలువబోతున్నట్లు చెప్పారు.
మినిస్టర్ క్వార్టర్స్‌లోనే ఈటలపై మన్ను పోశా..
బ్లాక్‌లో పెట్టిన డబ్బులు రిలీజ్ చేయాలని అడిగేందుకు తన భర్తతో కలిసి ఈటల వద్దకు వెళ్లానని శివకుమారి తెలిపారు. అయితే, ఇన్ని డబ్బులు మీకెక్కడివి..? సీఎంకు ఫిర్యాదు చేశారుగా.. అక్కడికే వెళ్లండంటూ ఈటల బెదిరించాడని ఆమె వాపోయారు. ఇదే విషయంపై పదేపదే ప్రశ్నిస్తున్నానని తన ఇంటిపై ఈటల రాజేందర్ సేల్స్‌ట్యాక్స్ అధికారులతో దాడిచేయించారని ఆరోపించారు.
ఈటల ఓరోజు మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉండగా ఆయన నెత్తిపై రెండు దోసిళ్ల దుమ్మెత్తిపోశానని, ఉసురు తగిలిపోతావని శపించానని చెప్పారు. ఈటల రాజేందర్ మేకవన్నెపులి అని, గొర్రెల మందలో తోడేలు లాంటివాడని మండిపడ్డారు. ఆయనకు కమీషన్లు ఇచ్చిన వారిని ప్రోత్సహిస్తారని, ఇవ్వని వారిని వేధింపులకు గురిచేస్తారని శివకుమారి ఆరోపించారు. తన ఉసురు తగిలే ఇప్పుడు పదవి పోయిందని, ఇంకా సర్వనాశనం అవుతాడని తిట్టిపోశారు.