భారతదేశంలో మహిళా వైద్యులు పెరుగుతున్నారు. మునుపటి కన్నా ఎక్కువ సంఖ్యలో డాక్టరమ్మలు.. పట్టాలు అందుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇటీవలి సర్వేలో తేల్చింది. ఈ దశాబ్దకాలంలో వైద్యవిద్యను అభ్యసించిన పురుషులు, మహిళల సంఖ్యను వెల్లడించింది. 2020 – 21లో ప్రతి వందమంది పురుషులకు వందమంది మహిళలు వైద్య కళాశాలల్లో చేరారట. అదే.. 2011-12లో 100 మంది పురుషులకు కేవలం 88 మంది మహిళలే ఉండేవారట. కార్డియాలజీ విభాగంలో 2012-13లో 312 మంది పురుష డాక్టర్లు ఉండగా.. కేవలం ఏడుగురు మాత్రమే మహిళా వైద్యులు ఉండేవారు.
కానీ, 2020-21కి వచ్చేసరికి మహిళల సంఖ్య 78కి పెరిగింది. ఆంకాలజీలోనూ 2012-13లో 95 మంది పురుషులకుగాను 29 మంది మహిళా వైద్యులు ఉండేవారు. 2020-21లో వారిసంఖ్య 116కు చేరింది. ఇక న్యూరాలజీ విభాగానికి వస్తే.. 2012-13లో 118 మంది పురుష వైద్యులు ఉండగా.. కేవలం తొమ్మిది మంది మహిళలు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహించేవారు. 2020-21లో ఈ సంఖ్య 78కి చేరింది. అయితే, చదువు పూర్తిచేసుకున్న మహిళలకు వృత్తిపరమైన అన్ని అర్హతలు ఉన్నప్పటికీ.. కుటుంబం, మాతృత్వ బాధ్యతలతోపాటు ఇతర కారణాల వల్ల వృత్తి జీవితాల్లో స్థిరపడలేకపోతున్నారట. ఏది ఏమైనప్పటికీ.. రాబోయే దశాబ్దంలో భారత వైద్యుల్లో దాదాపు సగంమంది మహిళలే ఉండబోతున్నారని ఈ సర్వే చెబుతున్నది.