హాంగ్జౌ (చైనా): మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత జట్టు ఘనంగా బోణీ కొట్టింది. శుక్రవారం ఇక్కడ జరిగిన పూల్ ‘బీ’ మ్యాచ్‌లో భారత్.. 11-0తో థాయ్‌లాండ్‌పై భారీ విజయాన్ని అందుకుంది. ఉదిత (30వ నిమిషం, 52వ ని.), డంగ్ (45వ ని. 54వ ని.) చెరో రెండు గోల్స్ చేయగా ముంతాజ్ ఖాన్ (7వ ని.), సంగీత కుమారి (10వ ని.), నవ్‌నీత్ కుమారి (16వ ని.), లాల్రెమ్సియామి (18వ ని.), సుమన్ దేవి (49వ ని.), షర్మిలా దేవి (57వ ని.), రుతజ (60వ ని.) తలా ఒక గోల్ కొట్టారు. హాఫ్ టైమ్ ముగిసేసరికి 5-0తో పూర్తి ఆధిక్యంలో ఉన్న భారత్.. సెకండాఫ్‌లో మరింత రెచ్చిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు 9 పెనాల్టీ కార్నర్లు లభించగా అందులో ఐదింటినీ గోల్స్‌గా మలుచుకుంది. ఈ టోర్నీలో భారత్ శనివారం జపాన్‌తో తలపడనుంది.