లక్నో: మేనల్లుడితో వివాహేతర సంబంధం నేపథ్యంలో అతడితో కలిసి ఉండేందుకు భర్తను భార్య హత్య చేసింది. (woman murders husband) తన భర్తను పొరుగువారు చంపినట్లు ఆరోపించింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అయితే దర్యాప్తులో అసలు విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ మహిళతోపాటు ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ సంఘటన జరిగింది. మే 11న ట్రాక్టర్ యజమాని అయిన ధీరేంద్ర తన ఇంట్లో హత్యకు గురయ్యాడు. అతని తలపై పెద్ద వస్తువుతో కొట్టడంతో చనిపోయాడు.
కాగా, భార్య రీనా పెద్దగా ఏడ్చింది. ట్రాక్టర్ మరమ్మతు వివాదం వల్ల పొరుగున ఉన్న కీర్తి యాదవ్, అతడి కుమారులు రవి, రాజు కలిసి తన భర్తను కొట్టి చంపారని ఆమె ఆరోపించింది. గొడవ సృష్టించడంతో ఒక రాజకీయ పార్టీ జోక్యం చేసుకున్నది. స్థానికులతోపాటు రాజకీయ నేతల ఒత్తిడి నేపథ్యంలో కీర్తి యాదవ్ కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడితో పాటు కుమారుడు రవిని అరెస్ట్ చేశారు.
మరోవైపు ఇంటి బయట భర్త హత్య జరిగినట్లు రీనా ఆరోపించింది. అయితే ఇంటి లోపల హత్య జరిగినట్లు ఫోరెన్సిక్ ఆధారాల్లో తేలింది. ఇంటి లోపల రక్తపు మరకలు కనిపించాయి. రక్తంతో కూడిన మంచం కోడు కూడా లభించింది. తొలుత ఆ ఇంటి ముందే డాగ్ స్క్వాడ్ ఆగింది. అలాగే నేరం జరిగిన రోజు రాత్రి మేనల్లుడు సత్యంతో 40 సార్లు రీనా మాట్లాడినట్లు దర్యాప్తులో తెలిసింది.
కాగా, మేనల్లుడు సత్యంతో రీనాకు వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అసలు విషయాన్ని అతడు బయటపెట్టాడు. ఆ రోజు రాత్రి భర్తకు మత్తుమందు ఇచ్చిందని, అతడు నిద్రించిన తర్వాత తనకు ఫోన్ చేసినట్లు చెప్పాడు. మంచం కోడుతో భర్త తలపై బాది హత్య చేసిందని వివరించాడు. తామిద్దరం కలిసి రక్తం మరకలను శుభ్రం చేశామని, స్నానం తర్వాత టెర్రస్ వద్దకు వెళ్లి తన పిల్లలతో కలిసి ఆమె నిద్రించిందని అతడు చెప్పాడు.
మరోవైపు నిందితులైన రీనా, సత్యంను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరి మధ్య సంబంధం గురించి ధీరేంద్రకు తెలియడంతో అతడ్ని హత్య చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. తొలుత అరెస్టు చేసిన పొరుగువారైన తండ్రి, కొడుకును విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.