పెద్దవంగర, మే 10: కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని తూర్పారా పట్టేందుకు బైక్‌పై వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళా రైతు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం కొరిపెల్లి సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగింది.
స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. కొరిపెల్లి శివారులోని శంకర్‌తండాకు చెందిన జాటోత్ వెంకన్న తన భార్య జాటోత్ విజయ, చిన్నమ్మ జాటోత్ భద్రమ్మ(60)తో కలిసి బైక్‌పై వడ్డెకొత్తపల్లి కొనుగోలు కేంద్రానికి బయల్దేరారు. ఈక్రమంలో కొరిపెల్లి శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొన్నది. ఘటనలో భద్రమ్మ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. వెంకన్న, విజయకు తీవ్రగాయాలవడంతో 108లో తొరూర్రులోని దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ప్రమోద్‌కుమార్ తెలిపారు.
వడ్డెకొత్తపల్లిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి 8వేల క్వింటాళ్లకుపైగా ధాన్యం వచ్చింది. తూర్పార పట్టే ప్యాడీ క్లీనర్ ఒక్కటే ఉండటంతో రైతుల మధ్య పోటీ నెలకొన్నది. దీంతో రాత్రివేళ ధాన్యం తూర్పార పట్టేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెప్పారు. ప్యాడీ క్లీనర్ల కొరతతోనే ఇది జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు.