సిటీబ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరిట ఇండ్లను కూల్చి, తమను రోడ్డున పడేస్తున్నదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పరేడ్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన ప్రధాని మోదీ సభలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులతో పాటు హైదర్షా కోట్, గంధంగూడ తదితర కాలనీల నుంచి వందమందికి పైగా మూసీ బాధితులు సభకు చేరుకొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరిట పట్టా భూముల్లో అన్ని అనుమతులతో నిర్మించుకున్న తమ ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. అభివృద్ధి పేరిట ఇండ్లను కూల్చడమేంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ జోక్యం చేసుకుని తమ ఇండ్లను కూల్చకుండా, తమ భూములను లాక్కోకుండా ఆపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి కానీ విధ్వంసం చేయొద్దని.. అందుకు కేంద్రం సహకరించొద్దని నినాదాలు చేశారు.
రాష్ట్రంలో బుల్డోజర్ పాలన సాగుతున్నదని, పేదల ఇండ్లను కూల్చి రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా బుల్డోజర్లతో పేదల ఇండ్లను కూల్చి, భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరిట నగరంలోని మూడు వేలకు పైగా భూములను లాక్కొనేందుకు ప్రణాళికలు రచిస్తున్నారన్నారు. అందులో కేంద్ర ప్రభుత్వం భాగం కావొద్దని కోరారు. మూసీ ప్రాజెక్టులో 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 25 శాతం కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని తెలుస్తున్నదని.. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇండ్లను కూల్చి రోడ్డున పడేయొద్దని కోరారు.